Delta Plus: ఇతర వేరియంట్‌లకు భిన్నమే..!
close

తాజా వార్తలు

Updated : 27/06/2021 20:47 IST

Delta Plus: ఇతర వేరియంట్‌లకు భిన్నమే..!

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వెల్లడి

దిల్లీ: ఇదివరకు వెలుగు చూసిన కొత్తరకం వైరస్‌లతో పోలిస్తే డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భిన్నంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల కణజాలాలకు ఆకర్షితమయ్యే ప్రభావం ఈ వేరియంట్‌కు ఎక్కువగానే ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అంతమాత్రాన ఇది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌, విస్తృత వ్యాప్తికి కారణమవుతున్నట్లు కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ వేరియంట్‌ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ పేర్కొంది. భారత్‌లో జూన్‌ రెండో వారంలో బయటపడిన డెల్టా వేరియంట్‌.. ఆందోళనకర రకంగా ఇప్పటికే భారత్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

‘కొత్తగా వెలుగు చూసిన ఇతర వేరియంట్‌లతో పోలిస్తే డెల్టా ప్లస్‌ రకం ఊపిరితిత్తుల కణాజాలనికి ఎక్కువ ఆకర్షితమవుతున్నట్లు తేలింది. కానీ, దానివల్ల నష్టం జరుగుతుందో లేదో అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా వైరస్‌ విస్తృతి ఎక్కువ ఉండడంతో పాటు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు ఇది కారణమవుతుందని ఇప్పుడే చెప్పలేం’ అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు మరింత నిశిత పరిశీలన అవసరమన్నారు. అప్పుడే వైరస్‌ వ్యాప్తి సామర్థ్యాన్ని అంచనా వేయగలమని చెప్పారు.

థర్డ్‌ వేవ్‌పై ఇప్పుడే చెప్పలేం..

కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌కు డెల్టా వేరియంట్‌ కారణమవుతుందా? అన్న ప్రశ్నకు.. ఇప్పుడే అంచనా వేయడం కష్టమని డాక్టర్‌ ఎన్‌కే అరోరా అభిప్రాయపడ్డారు. ‘వైరస్‌లో ఉత్పరివర్తనాలకు (మ్యుటేషన్లకు) అనుగుణంగా వేవ్స్‌ వస్తూ ఉంటాయి. ఈ వేరియంట్‌ వల్ల థర్డ్‌ వేవ్‌ వస్తుందో లేదో చెప్పలేం. ఇది ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతుండడంతో పాటు నిత్యం 50వేల కేసులు నమోదవుతున్నాయి. ఇంకా చాలా మంది వైరస్‌కు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు నడుచుకునే విధానంపైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. ఇక కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతంగా చేపట్టినట్లయితే థర్డ్‌వేవ్‌ ప్రభావాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించవచ్చు’ అని ఎన్‌కే అరోరా పేర్కొన్నారు.

12 రాష్ట్రాలకు వ్యాపించిన వైరస్‌..

వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉన్నట్లు భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 51 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్‌పై అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఈ వేరియంట్‌ బయటపడిన రాష్ట్రాల్లో స్థానికంగా జిల్లా స్థాయిలో వైరస్‌ కట్టడి చర్యలు సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే ఆరోరా పేర్కొన్నారు. తద్వారా వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చన్నారు. వీటితో పాటు కొత్త వేరియంట్‌ ప్రభావమున్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని