Delta variant: ప్రపంచాన్ని వేగంగా చుట్టుముడుతోంది..

తాజా వార్తలు

Updated : 13/07/2021 14:14 IST

Delta variant: ప్రపంచాన్ని వేగంగా చుట్టుముడుతోంది..

104 దేశాలకు వ్యాపించిన డెల్టా రకం.. WHO ఆందోళన

జెనీవా: కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను వేగంగా చుట్టుముడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. ఇది భౌగోళిక ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కరోనా రకం 104 దేశాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ప్రపంచవ్యాప్తంగా వరుసగా గత నాలుగు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పది వారాల క్షీణత తర్వాత మృతుల సంఖ్యా పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దాంతో కొత్త కేసులు, మరణాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఇది 104 దేశాలకు వ్యాపించింది. త్వరలో భౌగోళిక ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని గుర్తుచేయాలనుకుంటున్నాను. వైరస్‌ ప్రజల జీవితాలు, జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణను మరింత గందరగోళంలో పడేస్తోంది. టీకా అందని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అలాగే ఏ దేశంలోనూ మహమ్మారికి ముగింపు లభించలేదు’ అని టెడ్రోస్‌ అంతర్జాతీయ సమాజానికి మరోసారి గుర్తు చేశారు.

కరోనా దశలకు కారణమవుతోన్న కొత్త వేరియంట్లు.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలను పెంచుతున్నాయని టెడ్రోస్‌ అన్నారు. తొలి దశలో కరోనాను విజయవంతంగా కట్టడిచేయగలిగిన దేశాలు ఇప్పుడు తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అలాగే దేశాలు ఆంక్షలు సడలించే సమయంలో వైద్య వ్యవస్థ, ఆరోగ్య కార్యకర్తలపై పడే ప్రభావాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. మరోపక్క కొన్ని పేద దేశాలు ఆరోగ్య కార్యకర్తలు, ముప్పు పొంచి ఉన్న వర్గాలకు టీకాలు అందించక ముందే..  ధనిక దేశాలు మిలియన్ల కొద్దీ బూస్టర్ డోసులకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. టీకా పంపిణీలోని అసమానతలపై ఆందోళన వ్యక్తం చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని