జూన్‌ 26న రైతుల ‘రాజ్‌భవన్ల ముట్టడి’
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 14:41 IST

జూన్‌ 26న రైతుల ‘రాజ్‌భవన్ల ముట్టడి’

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ‘రాజ్‌భవన్ల ముట్టడి’కి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల నివాసాలైన రాజ్‌భవన్‌ల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి. నల్లజెండాలతో ధర్నాలో పాల్గొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రాలను పంపిస్తామని సంయుక్త కిసాన్‌మోర్చా నాయకుడు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. 

‘‘1975 జూన్‌ 26న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఈ జూన్‌ 26 నాటికి మేం ఉద్యమం చేపట్టి 7 నెలలు పూర్తికావస్తుంది. అందుకే ఆ రోజును సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమొక్రసీ (వ్యవసాయాన్ని కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం) డేగా పాటించాలని నిర్ణయించాం’’ అని ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. ఆ రోజున అన్ని రాజ్‌భవన్‌ల ముందు నల్ల జెండాలో ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు గతేడాది నవంబరు 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం సుప్రీంకోర్టుకు చేరడంతో సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. నూతన చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రతిపాదించగా.. పూర్తిగా రద్దు చేయాలని రైతు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని