‘రామాయణం’ రైలులో చుట్టొద్దామా?

తాజా వార్తలు

Published : 20/02/2020 01:13 IST

‘రామాయణం’ రైలులో చుట్టొద్దామా?

రామాయణ ఎక్స్‌ప్రెస్‌.. 17రోజుల యాత్ర

ప్రత్యేక రైలును మార్చి 28న పట్టాలెక్కించనున్న ఐఆర్‌సీటీసీ

రామాయణంతో సంబంధం ఉన్న చారిత్రక ప్రదేశాలను సందర్శించాలనే ఆసక్తి ఉన్న పర్యాటకులకు భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) గొప్ప అవకాశం కల్పించనుంది. ‘రామాయణం’ ప్రాంతాలను కలిపే ప్రదేశాల్లో పర్యటనకు ఓ ప్రత్యేక రైలును సిద్ధంచేసి కొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది. ప్రయాణికులకు అచ్చం ‘రామాయణం’లో ఉన్నామన్న అనుభూతిని కల్పించేలా ‘శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌’ రైలును తీర్చిదిద్దింది. ఈ ప్రత్యేక రైలును మార్చి 28న పట్టాలెక్కించనున్నట్టు ఐఆర్‌సీటీసీ బుధవారం వెల్లడించింది. ఈ రైలులో పర్యటన షెడ్యూల్‌తో పాటు ఛార్జీలు ఎంత? ఏయే ప్రదేశాలను కలుపుతూ ప్రయాణం చేయనుంది? తదితర విషయాలను ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

రైలు విశేషాలివీ..

ఐఆర్‌సీటీసీ పట్టాలెక్కించబోయే ఈ ప్రత్యేక రైలులో మొత్తం 10 బోగీలు ఉంటాయి. వీటిలో 5 స్లీపర్‌ కోచ్‌లు కాగా.. మరో ఐదు థర్డ్‌ ఏసీ బోగీలు ఉంటాయి. ఈ బోగీల్లో రామాయణ గాథ థీమ్‌ అలంకరణ ఉంటుంది. భజనలు కూడా ఏర్పాటు చేస్తారు. మొదట బుకింగ్‌ చేసుకున్నవారికి తొలి ప్రాధాన్యమిచ్చేలా సీట్ల కేటాయింపు ఉంటుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. గతేడాది కూడా ఇదే తరహాలో ఐఆర్‌సీటీసీ నడిపిన పర్యాటక రైలుకు విశేష స్పందన లభించింది. ఆ రైలును మొత్తం స్లీపర్‌ కోచ్‌లతోనే నడిపినా.. కేవలం ఏడు రోజుల్లోనే అన్ని సీట్లూ నిండిపోవడమే ఆ రైలు పట్ల ఆదరణకు నిదర్శనమని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. 

16 రాత్రులు.. 17 రోజులు

శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్చి 28న దిల్లీ నుంచి బయల్దేరనుంది. ఆసక్తి ఉన్నపర్యాటకులు టిక్కెట్లు బుక్‌ చేసుకొని దిల్లీలోని సఫ్దర్‌గంజ్‌, యూపీలోని గజియాబాద్‌, మొరాదాబాద్‌, బరేలీ, లఖ్‌నవూ స్టేషన్లలో ఎక్కవచ్చు. మొత్తం 17 రోజులు.. 16 రాత్రుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 

ఏయే ప్రదేశాలకు వెళ్తుంది?

రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో ఈ రైలు పర్యటించనుంది. అయోధ్యలోని రామజన్మభూమి, హనుమాన్‌ ఘడీ, నందిగ్రామ్‌లోని భారత్‌ మందిర్‌, బిహార్‌లోని సీతామడిలో సీతా దేవి మందిర్‌, నేపాల్‌లోని జనక్‌పురి, వారణాసిలోని తులసీ మానస్‌ మందిర్‌, సంకట్‌ మోచన్‌ మందిర్‌, యూపీలోని సీతా సంహిత్‌ స్థల్‌, ప్రయాగ్‌లోని త్రివేణి సంగమం, హనుమాన్‌ మందిర్‌, భరద్వాజ్‌ ఆశ్రమ్‌, శృంగ్‌వెర్‌పూర్‌లోని శృంగి రిషి మందిర్‌, చిత్రకూట్‌లోని రామ్‌ ఘాట్‌, సతీ అనసూయ మందిర్‌, నాసిక్‌లోని పంచావతి,  హంపీలోని అంజనాద్రి కొండలు, హనుమాన్‌ జన్మస్థల్‌, రామేశ్వరంలోని జ్యోతిర్లింగ శివమందిర్‌ ప్రదేశాల్లో ప్రయాణిస్తుంది. 

భోజనం.. వసతులు?

ఈ ప్రత్యేక రైలులో పర్యాటకులకు స్వచ్ఛమైన శాకాహార భోజనంతో పాటు వసతి, స్నానం తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. స్లీపర్‌ తరగతి ప్రయాణికులకు ధర్మశాలలు, ఏసీ తరగతి ప్రయాణికులకు హోటళ్లలో వసతి కల్పిస్తారు. అక్కడి ప్రముఖ ప్రదేశాల్లో పర్యటించేందుకు నాన్‌ ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ఈ యాత్రలో ప్రయాణికులతో పాటు ఐఆర్‌సీటీసీకి చెందిన టూర్‌ మేనేజర్‌ కూడా ఉంటారు. ఆయన అన్నింటినీ పర్యవేక్షిస్తారు. నవరాత్రుల సమయంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఆహారం అందించనున్నారు. ఉపవాసం పాటించే ప్రయాణికులకు  కిచిడీ, పండ్లు, పెరుగు, పొటాటో చాట్‌ అందుబాటులో ఉంటాయని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

రైలు టిక్కెట్‌ ధరెంత?

ఈ టూర్‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో పర్యాటకులను తిప్పేందుకు ఐఆర్‌సీటీసీ ఛార్జీలను ప్రకటించింది. ఒక్కో ప్రయాణికుడికి స్లీపర్‌ క్లాస్‌ అయితే రూ. 16,065, థర్డ్‌ ఏసీ అయితే రూ.26,775 చొప్పున వసూలు చేయనున్నట్టు తెలిపింది. ఆసక్తి ఉన్న పర్యాటకులు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ రైలులో ప్రయాణానికి టిక్కెట్ల బుకింగ్‌ ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుంది.. తదితర వివరాలు తెలియలేదు. 

శ్రీలంక పర్యటనకూ వెళ్లేలా..

భారత్‌లోని రామాయణ సర్క్యూట్‌ సందర్శనతో పాటు శ్రీలంకలోని రామాయణం సంబంధిత  ప్రదేశాలను చూసేందుకు కూడా ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది. అయితే, అక్కడికి వెళ్లేందుకు 40 మందికి మాత్రమే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రామాయణ ఎక్స్‌ప్రెస్‌లో యాత్రను ముగించుకున్న తర్వాత 15వ రోజు అంటే ఏప్రిల్‌ 11న చెన్నైకి వెళ్లి అక్కడి విమానంలో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో కొలంబోకు తీసుకెళ్తారు. అక్కడ మూడు రాత్రుళ్లు బస చేసేలా ఏర్పాట్లు చేశారు. శ్రీలంకలో కాండీ, నువారా ఇలియా, నెగంబోలలో పర్యటనకు తీసుకెళ్తారు. శ్రీలంకలో పర్యటనకు అదనంగా మరో రూ.37,800 వసూలు చేయనున్నారు. శ్రీలంకలోని సీతామాతా మందిర్‌, అశోక్‌ వాటిక, విభీషణ ఆలయం, మున్నేశ్వరంలోని శివాలయం, మున్నవారి తదితర ఎన్నో ప్రదేశాలను చూపిస్తారు. ఏప్రిల్‌ 15న కొలంబో నుంచి తిరుగుపయనమై దిల్లీకి చేరుతారు. దీంతో యాత్ర ముగుస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని