కరోనా ఎఫెక్ట్‌:‘డ్రాగన్‌’ చేపట్టిన చర్యలివే!

తాజా వార్తలు

Updated : 04/03/2020 01:39 IST

కరోనా ఎఫెక్ట్‌:‘డ్రాగన్‌’ చేపట్టిన చర్యలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ప్రపంచమంతటికీ విస్తరించినప్పటికీ దాని ప్రభావం చైనాలో క్రమంగా తగ్గుతోంది. కరోనా బయటపడ్డ హుబెయ్‌ ప్రావిన్స్‌లో జనాభా దాదాపు 6కోట్లు కాగా ప్రధాన కేంద్రం వుహాన్‌ నగరంలో జనాభా 1.15కోట్లు.. అప్పటికే వేల మందికి ఈ వైరస్‌ సోకింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా కరోనా వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలేంటి? అంతమందికి సమర్ధంగా వైద్యం ఎలా అందించింది. వైరస్‌ ప్రభావాన్ని అత్యంత సమర్ధంగా ఎలా తగ్గించగలిగింది?


వుహాన్‌..అష్టదిగ్బంధం

చైనా ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ధనిక దేశమేమీ కాదు. దేశ జనాభాలో సగానికి పైగా పేదలే ఉన్నారు. విశాలమైన రహదారులు, అందమైన భవనాలతో పాటు ఇరుకు ఇళ్లతో ఉండే మురికి వాడలు అక్కడ కోకొల్లలు. అలాంటి దేశాన్ని కరోనా వైరస్‌ ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. వైరస్‌ ప్రభావాన్ని ఆ దేశం గుర్తించే సరికి అది తీవ్రరూపం దాల్చింది. వైరస్‌ బయటపడిన హుబెయ్‌ ప్రావిన్స్‌లో జనాభా 6కోట్లు ఉండగా.. వాణిజ్య కేంద్రమైన వుహాన్‌ నగరంలో జనాభా 1.15కోట్లు. వీరితో పాటు  వ్యాపారం తదితర అవసరాల కోసం వచ్చిపోయే చైనీయులు, విదేశీయులు ఎంతో మంది. అలాంటి చోట ఒక్కసారి వెలుగు చూసిన కరోనా వైరస్‌ను గుర్తించే సరికి అది వేల మందికి సోకింది. దీంతో చైనా ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వుహాన్‌ నగరాన్ని అష్టదిగ్బంధం చేసింది. 


వేగంగా ఆస్పత్రుల నిర్మాణం

జనాభా ఎక్కువగా ఉన్న ఏ నగరంలోనైనా వారికి సరిపడా ఆస్పత్రులు ఉండడం అరుదు. వుహాన్‌ పరిస్థితీ అంతే. వేల మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స చేయాల్సి ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. గతంలో ఆస్పత్రులు ప్రస్తుత అవసరాలకు సరిపోవని గుర్తించి 10, 15 రోజుల్లో 1,000, 1,500 పడకల ఆస్పత్రులను నిర్మించింది. వేలాదిగా వస్తున్న కరోనా రోగులకు ఆ పడకలు ఏ మాత్రం సరిపోలేదు. అంతకు ముందు ఉన్న ఆస్పత్రులు నిండిపోవడంతో, రోగుల కోసం ఆడిటోరియంలు, హోటళ్లు, ప్రదర్శనశాలు, ఖాళీగా ఉండే కార్యాలయాలను ఆస్పత్రులుగా మార్చేశారు అక్కడి అధికారులు. వుహాన్‌లోని ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను కేవలం 3రోజుల వ్యవధిలోనే ఆస్పత్రిగా మార్చేశారు. అక్కడ 2వేల పడకలను ఏర్పాటు చేసి  రోగులకు చికిత్స అందిస్తున్నారు. వుహాన్‌లో దాదాపు 13 భవనాలు 13,348 పడకలతో తాత్కాలిక కరోనా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. వాటిలో స్టేడియాలు, కాన్ఫరెన్స్‌ కేంద్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ అత్యంత వేగంగా ఆస్పత్రులుగా మారినవే కావడం గమనార్హం. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసి వాటినే చికిత్సా కేంద్రాలుగా మార్చేశారు.  


సమర్థంగా చికిత్స

ఒక పక్క రోగులకు సరిపడా ఆస్పత్రులను వేగంగా ఏర్పాటు చేస్తూనే మరో పక్క వైరస్‌ నిర్మూలనకు చికిత్సను సైతం ప్రారంభించారు. కొత్త వ్యాధి కావడంతో ఎలాంటి చికిత్స అందించాలనే సందిగ్ధావస్థలో ఉన్న చైనా వైద్యులు.. న్యుమోనియా లక్షణాలు ఉండడంతో మొదట్లో ఆ తరహాలోనే చికిత్స అందించారు. సార్స్‌ తరహాలోనే ఉన్న కరోనాకు చికిత్స ఎలా చేయాలో సతమతమయ్యారు. మరణించిన వ్యాధిగ్రస్థులకు శవపరీక్ష నిర్వహించిన తర్వాతే ఒక అవగాహనకు వచ్చామని అక్కడి వైద్యులు వెల్లడించారు. ప్రధానంగా అల్వియోలర్‌‌ వ్యవస్థ(శ్వాసవ్యవస్థ)ను వైరస్‌ దెబ్బతీస్తుందని శవపరీక్షల్లో వెల్లడైంది. వాయునాళంలో దట్టంగా మ్యూకస్‌ పేరుకుపోవడం వల్ల ఏర్పడిన సమస్యలను గుర్తించిన వైద్యులు దానికి అనుగుణంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు. మెరుగైన ఫలితాలు రావడడంతో పాటు కొద్దిరోజులకే చాలా మంది కోలుకున్నారు. 


ఒకరినొకరు కలుసుకోకుండా చర్యలు

వుహాన్‌ నగరాన్ని దిగ్బంధించడంతో పాటు అప్పటికే అక్కడికి వచ్చిన విదేశీ పౌరుల్లో మనోధైర్యం దెబ్బ తినకుండా చైనా ప్రభుత్వం వలంటీర్లను నియమించింది. కొవిడ్ అంటు వ్యాధి కావడంతో వుహాన్‌లో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు చైనా సర్కారు సమాజంలోని వివిధ వర్గాల వారు నేరుగా కలుసుకోకుండా చర్యలు చేపట్టింది. కొద్దిరోజుల పాటు ఒక్కో అపార్టుమెంటు నుంచి ఒకరిని మాత్రమే బయటకు అనుమతించింది. అలా చాలా మంది ఐదారు వారాల వరకు తమ ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. సొంత ఇళ్లలోనే బందీలై వారికీ సైతం వలంటీర్లే సేవలందించడం విశేషం. 

వైరస్ వ్యాప్తితో మాస్కుల కొరత ఏర్పడడంతో వాటి తయారీని కూడా పెంచిన చైనా ప్రభుత్వం ప్రజలందరికీ మాస్కులను అందుబాటులోకి తేగలిగింది. వుహాన్‌తో పాటు ఇతర నగరాల్లోని ప్రజల మధ్య నేరుగా సంబంధాలు లేకుండా చేసింది. దీంతో కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరో 1, 2 నెలల్లోనే కొవిడ్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని భావిస్తున్న చైనా సర్కారు.. వ్యాక్సిన్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని