ఆరోగ్యసేతు తప్పనిసరి కాదు..

తాజా వార్తలు

Published : 13/06/2020 02:19 IST

ఆరోగ్యసేతు తప్పనిసరి కాదు..

బెంగళూరు: రైళ్లు, విమానాల్లో ప్రయాణించే వారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోనవసరంలేదని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. యాప్‌ లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని పేర్కొంది. యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు దానిపై స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎమ్‌ఎన్‌ నర్గుంద్ కోర్టుకు వివరించారు. ‘‘విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోనవసరంలేదు. ప్రయాణసమయంలో వారు దానికి బదులుగా స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.’’ అని కోర్టులో విచారణ సందర్భంగా నర్గుంద్  తెలిపారు. 

బెంగళూరు చెందిన సైబర్‌ కార్యకర్త ఒకరు ఆరోగ్యసేతు యాప్‌కు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, పిటిషనర్ ప్రస్తావించిన అంశాలకు కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించింది. అలానే ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించే వారు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాలనే నిబంధనకు ఏవిధమైన చట్టబద్దత ఉందో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేసు తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది.   

కరోనా సోకిన వారిని గుర్తించేందుకు రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఇప్పటి వరకు 10 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే ఇందులో వ్యక్తిగత గోప్యతకు సంబంధించి లోపాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని