మీ వీరత్వంతో దేశం గర్వపడుతోంది

తాజా వార్తలు

Published : 04/07/2020 01:35 IST

మీ వీరత్వంతో దేశం గర్వపడుతోంది

గాయపడ్డ సైనికులతో మాట్లాడిన ప్రధాని మోదీ

దిల్లీ: గల్వాన్‌ వ్యాలీలో చైనాతో ఘర్షణలో గాయపడ్డ వీర సైనికులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కలుసుకున్నారు. మీ పరాక్రమంతో 130 కోట్ల ప్రజలు గర్వపడేలా చేశారని వారిని కొనియాడారు. లద్దాఖ్‌లో సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రధాని లేహ్‌కు చేరుకొని అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను కలిసి మాట్లాడారు. ‘మీ త్యాగాలకు కృతజ్ఞత చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను. ప్రపంచంలోని ఏ శక్తికీ భారత్‌ తలొగ్గలేదు. మీలాంటి వీర సైనికులు ఉన్నంతకాలం అలా జరిగే అవకాశమే లేదు. మీకు, మిమ్మల్ని కన్న తల్లులకు, మీలాంటి పోరాటయోధులను అందించిన ఈ భరతమాతకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని మోదీ సైనికులతో ముచ్చటించారు. 

‘మీరు ఆసుపత్రిలో ఉండటం వల్ల మీకు తెలియకపోవచ్చు. 130 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారు. శత్రువులకు మీరు తగిన గుణపాఠం చెప్పారు. మీ వీరత్వంపై ప్రపంచమంతా చర్చించుకుంటోంది. మీ పరాక్రమం గురించి తెలుసుకోవాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీ త్యాగాలను కొనియాడుతోంది. మీ ధైర్యం, మీరు చిందించిన రక్తం యువతకీ, ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినందిస్తోంది’ అని ప్రధాని గాయపడ్డ సైనికులతో అన్నారు. 

అంతకుముందు ప్రధాని లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. సరిహద్దు పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం జూన్‌ 15న చైనా దాడిని తిప్పికొట్టిన వీర సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని