Dubai: 360 సీట్ల విమానంలో.. ఒక్కడే
close

తాజా వార్తలు

Updated : 27/05/2021 10:17 IST

Dubai: 360 సీట్ల విమానంలో.. ఒక్కడే

రూ.18 వేలతో ముంబయి-దుబాయ్‌ ప్రయాణం
చప్పట్లతో స్వాగతం పలికిన  సిబ్బంది 


ముంబయి: బోయింగ్‌ 777 ఎమిరేట్స్‌ విమానం అది. 360 సీట్లున్న ఈ విమానం ఒక్క ట్రిప్పునకు ఇంధనం ఖర్చే రూ.8 లక్షలు అవుతుంది. ఇలాంటి విమానంలో ఓ వ్యక్తి రూ.18 వేలకు టికెట్‌ కొని ఒక్కడే ప్రయాణించాడంటే నమ్మశక్యం కాదు. దుబాయికి చెందిన వజ్రాల కంపెనీ ‘స్టార్‌జెమ్స్‌’ సీఈవోగా పనిచేస్తున్న భవేష్‌ జవేరికి (40) ఆ అదృష్టం దక్కింది. వారం రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కరోనా కారణంగా భారతీయ ప్రయాణికులపై యూఏఈ విధించిన కొత్త ఆంక్షలతో ఇది సాధ్యమైంది.  అక్కడికి పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దౌత్యపరమైన సిబ్బంది, యూఏఈ గోల్డెన్‌ వీసా ఉన్నవారు, అరబ్‌ జాతీయులు, ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తూ.. బిజినెస్‌ తరగతిలో వెళ్లేవారికి కొవిడ్‌-19 పీసీఆర్‌ పరీక్షల ధ్రువపత్రం తప్పనిసరి చేశారు. భారత్‌లో కరోనా రెండోదశ ఉద్ధృతమైన నేపథ్యంలో ఏప్రిల్‌ 24 నుంచి నెలరోజులపాటు ఈ ఆంక్షలు విధించారు. వీటిని మళ్లీ జూన్‌ 14 దాకా పొడిగించనున్నట్లు ప్రకటించారు.

వారం కిందట.. మే 19న దుబాయి నుంచి ముంబయికి చేరిన బోయింగ్‌ 777 ఎమిరేట్స్‌ విమానం తిరుగుప్రయాణానికి సిద్ధమైంది. ఆ రోజుకు యూఏఈ గోల్డెన్‌ వీసా కార్డుతోపాటు అన్ని అనుమతులున్న ప్రయాణికుడు భవేష్‌ జవేరి ఒక్కరే కావడంతో నిబంధనల ప్రకారం ఆయనకు టికెటు జారీ చేశారు. 360 సీట్ల విమానంలో తనొక్కడే దుబాయికి వెళుతున్నట్టు తెలిసి భవేష్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విమానం ఎక్కగానే సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. తన లక్కీ నంబర్‌ 18 అని చెప్పగానే.. సాదరంగా ఆ సీటు వద్దకు తీసుకుపోయారు. విమాన కమాండర్‌ సైతం వచ్చి మాట్లాడారు. విమానమంతా కలయదిరుగుతూ.. సిబ్బందితో సరదా కబుర్లు చెబుతూ భవేష్‌ దుబాయి చేరుకున్నారు. అపూర్వమైన ఈ అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ..‘ముంబయి, దుబాయిల మధ్య ఇప్పటికి దాదాపు 240 సార్లు తిరిగాను. ఈ ట్రిప్పు ఇచ్చిన అనుభూతి మాత్రం ప్రత్యేకం.. అద్భుతం’ అని స్పందించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని