హ్యారీ, మేఘన్‌ల ఆవేదన బాధపెట్టింది
close

తాజా వార్తలు

Published : 10/03/2021 14:15 IST

హ్యారీ, మేఘన్‌ల ఆవేదన బాధపెట్టింది

జాతి వివక్ష వ్యాఖ్యలపై ప్రైవేటుగా చర్చిస్తాం

 బ్రిటన్‌ రాజకుటుంబం ప్రకటన

లండన్‌: బ్రిటన్‌ రాజ కుటుంబానికి వ్యతిరేకంగా యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై బకింగ్‌హాం ప్యాలెస్‌ స్పందించింది. రాజ కుటుంబీకుల నుంచి తనకు జాతి వివక్ష ఎదురైందని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఓప్రా విన్‌ఫ్రే టాక్‌షోలో మేఘన్‌ వెల్లడించగా.. ఆమె వ్యాఖ్యలను హ్యారీ సమర్థిస్తూ సొంత కుటుంబంపై అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ కుటుంబం మంగళవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. హ్యారీ, మేఘన్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న సవాళ్లను తెలుసుకుని రాజ కుటుంబం బాధకు లోనైందని అందులో పేర్కొంది. ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు, ముఖ్యంగా జాతి వివక్షకు సంబంధించిన అంశం ఆందోళన కలిగించాయని, వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ విషయాలపై ప్రైవేటుగా చర్చిస్తామని చెప్పింది. హ్యారీ, మేఘన్, వారి కుమారుడు ఆర్చీ ఎప్పటికీ అత్యంత ప్రీతిపాత్రమైన కుటుంబ సభ్యులని ప్రకటించింది. మరోవైపు రాజ కుటుంబంపై జాతి వివక్ష వ్యాఖ్యలకు సంబంధించి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘రాణిపైన, బ్రిటన్‌తో పాటు కామన్‌వెల్త్‌ దేశాల్లో ఆమె పోషిస్తున్న కీలక పాత్రపైనా నాకు మొదటి నుంచి గౌరవ భావం ఉంది’’ అని పేర్కొన్నారు. రాజకుటుంబంపై ఇన్నాళ్లూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఇప్పుడూ ఆ విధానాన్ని విడిచిపెట్టాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ ఇంటర్వ్యూపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్‌ ఏమైనా స్పందించారా అని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి జెన్‌ సాకీని ప్రశ్నించగా.. తన మానసిక అనారోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యం మేఘన్‌ చేసిందని, బైడెన్‌ కూడా దాన్ని విశ్వసిస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించడానికి మాత్రం నిరాకరించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని