
తాజా వార్తలు
బగ్ గుర్తించి.. ₹36 లక్షలు సాధించి..
చెన్నై: టెక్ కంపెనీల్లో బగ్స్ వెతికి పట్టుకొని.. చెబితే డబ్బులు ఇస్తారనే విషయం మీకు తెలుసా? దీన్నే బగ్ బౌంటీ అంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ కుర్రాడు మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌లోని ఓ బగ్‌ను కనుక్కొని లక్షల రూపాయల బహుమతి గెలుచుకున్నాడు. ఇంతకీ ఏంటా బగ్, కనుగొన్నది ఎవరు, దానికిగానూ ఆయనకు ఎంత రివార్డు వచ్చిందో చూద్దాం!
చెన్నైకు చెందిన లక్ష్మణ్ ముత్తయ్య అనే యువకుడు మైక్రోసాఫ్ట్ అకౌంట్లలో ఉన్న బగ్‌ను గుర్తించినందుకుగానూ 50 వేల డాలర్ల రివార్డు పొందాడు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు ₹36 లక్షలు. వృత్తి రీత్యా సెక్యూరిటీ రీసెర్చర్ అయిన లక్ష్మణ్ గతంలో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉన్న బగ్‌లను గుర్తించి, రివార్డులు సాధించాడు. ఇక మైక్రోసాఫ్ట్ వివరాల్లోకెళ్తే.. యూజర్ అనుమతి లేకుండా ఖాతాలను వినియోగించడం, పాస్‌వర్డ్‌లను మార్చడం వంటివాటికి మైక్రోసాఫ్ట్ అకౌంట్లు వీలుగా ఉన్నట్లు లక్ష్మణ్ గుర్తించారు. గతేడాది నవంబరులో ఈ అంశంపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను సంప్రదించారు. అనేక చర్చలు, పరీక్షల తర్వాత... లక్ష్మణ్ ఎత్తి చూపిన బగ్ సరైనదే అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు అంగీకరించారు. లక్ష్మణ్ చెప్పిన విధంగా అకౌంట్లను హ్యాక్ చేయడం కుదురుతోందని గమనించిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సమస్యను పరిష్కరించారు. అందుకుగానూ రివార్డు ఇచ్చారు. ఈ విషయాన్ని లక్ష్మణ్ తన బ్లాగ్ వేదికగా పంచుకున్నారు.
లక్ష్మణ్ గుర్తించిన బగ్ ఇదీ...
మెయిల్, సోషల్ మీడియా తదితర అకౌంట్ల పాస్‌వర్డ్‌ను మనం మర్చిపోయినా, లేదంటే వేరే వారు మన ఖాతాను హ్యాక్ చేయాలని చూసినా... ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్నే వాడాల్సిందే. ఆ ప్రక్రియలో భాగంగా ఆ ఖాతాతో అనుసంధానం అయి ఉన్న మొబైల్ నంబరు/ మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. సాధారణంగా ఆ ఓటీపీ 6 నుంచి 7 అక్షరాలు/అంకెల రూపంలో ఉంటుంది. అయితే ఆ ఓటీపీ తెలియకపోయినా... రకరకాల కాంబినేషన్లలో ఓటీపీలు ఎంటర్ చేసి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయొచ్చని లక్ష్మణ్ కనుకున్నారు. అయితే ఇది అంత సులభంగా ఏమీ సాగలేదని, కొన్ని రోజులపాటు వరుస అటెంప్ట్‌లు చేస్తే సాధ్యపడిందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా మనకు ఓటీపీ గరిష్ఠంగా 5 సార్లు ఎంటర్ చేసేందుకే అనుమతుంటుంది. దీంతో లక్ష్మణ్ వేల కొద్దీ ఐపీ అడ్రెస్లు మార్చి... పదే పదే ప్రయత్నించి వేరే ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చి, తెరవడంలో సఫలీకృతుడయ్యాడు. వెంటనే ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసి మైక్రోసాఫ్ట్‌కు అందించాడు. దానిని పరిశీలించిన మైక్రోసాఫ్ట్, నెల రోజుల క్రితం రివార్డు పంపింది. తాజాగా మైక్రోసాఫ్ట్ అనుమతితో తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని లక్ష్మణ్ పోస్టు చేశాడు.