Lakhmipur Kheri Violence: లఖింపుర్‌ ఖేరీ వెళ్తున్నా.. పంజాబ్‌ సీఎం చన్నీ

తాజా వార్తలు

Updated : 04/10/2021 14:55 IST

Lakhmipur Kheri Violence: లఖింపుర్‌ ఖేరీ వెళ్తున్నా.. పంజాబ్‌ సీఎం చన్నీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నానంటూ పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలు, రైతులకు అండగా ఉండేందుకు లఖింపుర్ ఖేరికి బయలుదేరుతున్నాను. ఈ మేరకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి కోరాను’ అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సైతం.. ఎవరినీ లఖింపుర్‌ ఖేరికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని పంజాబ్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం గమనార్హం.

లఖింపుర్ ఖేరి ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్‌)ను నియమించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను ఎస్‌టీఎఫ్‌ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఈ హింసాత్మక ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు యూపీ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌ అన్నారు. కేసు విచారణలో ఉందని, నేరస్థులకు శిక్ష తప్పదని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ ఘటనను తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు.

ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలని భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో అనుమానితులందరినీ త్వరగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నిరసన తెలిపే రైతుల పట్ల సంయమనం, సహనంతో వ్యవహరించాలని కోరారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా నేతలు సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌కు లేఖ రాశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను సైతం పదవినుంచి తొలగించాలని కోరారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని, రైతుల మృతికి కారణమైన ఆయన కుమారుడిని అరెస్ట్‌ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్‌ నేత రాకేశ్ టికాయిత్‌ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరాకే మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

* జమ్మూ- కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ఉత్తర్‌ప్రదేశ్‌ను ‘నయా జమ్మూ- కశ్మీర్‌’గా అభివర్ణించారు. లఖింపుర్‌ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని