Delta Variant: ‘డెల్టా’తో భయం భయం

తాజా వార్తలు

Published : 17/08/2021 21:17 IST

Delta Variant: ‘డెల్టా’తో భయం భయం

కట్టడి చర్యలు చేపట్టాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ ప్రభావంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అతిఎక్కువ ప్రాబల్యం కలిగిన వేరియంట్‌గా డెల్టా రకం మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ ముప్పు పొంచివున్న వారికి అత్యవసరంగా వ్యాక్సిన్‌ అందించే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130కి పైగా దేశాలకు డెల్టా వేరియంట్‌ విస్తరించిందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లతో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో పలు దేశాల్లో ఆస్పత్రులు కొవిడ్‌ బాధితుల చేరికలతో కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కొరత కూడా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల్లో కొవిడ్‌ టెస్టుల సంఖ్య తక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ముఖ్యంగా పేద, మధ్య ఆదాయ దేశాలు కొవిడ్‌ ప్రబలుతున్న తీరుపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2020 సంవత్సరం మొత్తం నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే  కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తుచేసింది. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ ముప్పు ఇంకా తీవ్రంగానే ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్లను వెంటనే గుర్తించేందుకు గానూ నిర్ధారణ పరీక్షలను భారీగా చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వీటితో పాటు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వారిని రక్షించేందుకు అవసరమైన ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగానే కొనసాగుతోంది. ఇప్పటివరకు 183 దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా 475 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అంచనా. ఇక వ్యాక్సిన్‌ పంపిణీలో 180 కోట్ల డోసుల పంపిణీతో చైనా ముందువరుసలో ఉండగా.. భారత్‌లో 54కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈయూలో 50కోట్లు, అమెరికాల్లో 35 కోట్ల డోసులను అందించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని