Covid vaccines: కరోనా, వ్యాక్సిన్‌లపై రాజకీయాలు చేయొద్దు..!

తాజా వార్తలు

Published : 23/07/2021 18:45 IST

Covid vaccines: కరోనా, వ్యాక్సిన్‌లపై రాజకీయాలు చేయొద్దు..!

ప్రతిపక్షాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌, వ్యాక్సిన్‌ సమస్యలపై ఎటువంటి రాజకీయం చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించే బృహత్తర కార్యక్రమంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉందని.. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

కొవిడ్‌-19 సమస్యలు, వ్యాక్సిన్‌ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రులతో 20సార్లు భేటీ అయిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గుర్తుచేశారు. ఆరోగ్యం విషయం రాష్ట్రాలకు సంబంధించిందని కొన్ని రాష్ట్రాలు గుర్తుచేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అయినప్పటికీ దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగానే పంపిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్‌ నాటికి 135 కోట్ల డోసులు..

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంలో ఎటువంటి ఆలస్యం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు-డిసెంబర్‌ నాటికి దాదాపు 135కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నట్లు అంచనా వేసింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఎప్పుడు ముగుస్తుందనడానికి ఎటువంటి కచ్చితమైన సమయం లేదని.. డిసెంబర్‌ చివరినాటికి 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

వ్యాక్సిన్ల కోసం రూ.9725కోట్ల ఖర్చు..

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో కొనసాగుతోందని.. ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు రూ.9,725కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్‌ సేకరణతో పాటు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం వీటిని ఖర్చు పెట్టామని తెలిపింది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 42కోట్ల డోసులను పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే 54లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని