Corona Vaccine: 100కోట్లకు చేరువైనా.. 30శాతం మందికే రెండు డోసులు!

తాజా వార్తలు

Published : 19/10/2021 20:31 IST

Corona Vaccine: 100కోట్లకు చేరువైనా.. 30శాతం మందికే రెండు డోసులు!

మరిన్ని వారాల్లో ఈ వ్యత్యాసం తగ్గుతుందంటున్న విశ్లేషకులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడంలో ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే వ్యాక్సిన్‌ పంపిణీలో చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, బ్రిటన్‌ దేశాలు ముందున్నాయనే చెప్పవచ్చు. తాజాగా భారత్‌ కూడా 100కోట్ల డోసుల పంపిణీకి చేరువయ్యింది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. సింగిల్‌ డోసు, పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ తీసుకున్న వారి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 30శాతం మంది మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ తీసుకోగా.. 70శాతానికిపైగా అర్హులు కేవలం ఒక్క డోసు మాత్రమే తీసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్న చైనాలో మాత్రం ఇప్పటికే దాదాపు 105కోట్ల మందికి (అక్కడి జనాభాలో 75శాతం మందికి) రెండు మోతాదుల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు సమాచారం.

వ్యత్యాసం ఎక్కువ అందుకేనా..?

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ధాటికి వణికిపోతున్న సమయంలో వ్యాక్సిన్‌ పంపిణీని భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ కనీసం ఒక డోసు ఇచ్చే ప్రయత్నం చేసింది. రెండు డోసుల మధ్య వ్యవధిని కూడా మూడు నెలలకు పెంచింది. రెండు డోసుల మధ్య వ్యవధి పెరగడం కూడా పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ పంపిణీ ఆలస్యానికి కారణమైనట్లు యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌కు చెందిన బ్రమర్‌ ముఖర్జీ పేర్కొన్నారు. దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కాస్త తగ్గినప్పటికీ నిత్యం 13వేలకు పైగా కేసులు వస్తున్నాయని అన్నారు.

నిర్లక్ష్యం చేస్తే మరింత మందకొడిగా..

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడం కూడా వ్యాక్సిన్‌ పంపిణీ అత్యవసరంగా అందించాల్సిన అవసరం, వాటిపై ఉన్న ఉత్సాహం తగ్గుతుందని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రజారోగ్య విభాగానికి చెందిన బ్రెయాన్‌ వాల్‌ అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావాలంటూ చాలా రాష్ట్రాలు అవగాహన చేపట్టాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం ఒకడోసు వ్యాక్సిన్‌ తీసుకుంటేనే రేషన్‌ ఇస్తామనే నిబంధన పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఒక డోసు తీసుకునేందుకు ముందుకువచ్చారు. కానీ, రెండో డోసు విషయంపై ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టకపోవడంతో పూర్తి మోతాదులో తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదని బ్రెయాన్‌ వాల్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రానున్న రోజుల్లో ఒకటి, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్యలో ఈ వ్యత్యాసం తగ్గుతుందని అంచనా వేశారు. వ్యాక్సిన్‌ పంపిణీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు ఉంటుందని.. అందుకే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని బ్రెయాన్‌ వాల్‌ స్పష్టం చేశారు.

చిన్నారుల టీకా ఆలస్యమే..

దేశవ్యాప్తంగా 18ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ పిల్లల కోసం వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. దేశ జనాభాలో దాదాపు 40శాతం మంది 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే. అయితే, 12-18ఏళ్ల పిల్లల కోసం ఇప్పటికే జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన టీకాకు అనుమతి లభించింది. మరోవైపు 2 నుంచి 18 ఏళ్ల పిల్లలకోసం రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి డీసీజీఐ సబ్జెక్టు నిపుణుల బృందం సిఫార్సు చేసింది. అయినప్పటికీ వీటి పంపిణీ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే జైడస్‌ క్యాడిలా పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలాఉంటే, ఈ ఏడాది చివరినాటికి దేశంలో 18ఏళ్ల వయసుపైబడిన వారందికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారితోపాటు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్ల టీకా తీసుకోని వారిలోనూ సహజ రోగనిరోధకశక్తి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరి నాటికి వైరస్‌పై పోరులో లక్ష్యాన్ని సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని