ఇలాంటి మనస్తత్వం పార్లమెంట్‌లో ఎన్నడూ చూడలేదు - మోదీ

తాజా వార్తలు

Published : 19/07/2021 22:51 IST

ఇలాంటి మనస్తత్వం పార్లమెంట్‌లో ఎన్నడూ చూడలేదు - మోదీ

మహిళలు మంత్రులు కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు: ప్రధాని మోదీ

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కొత్త మంత్రులను సభకు పరిచయం చేస్తూ ప్రధానమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రధాని మోదీ, ప్రతిపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. ఇలాంటి నెగటివ్‌ మనస్తత్వం ఉన్న వారిని పార్లమెంట్‌లో ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు.

‘అనేక మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన చాలా మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం అందరికీ గర్వకారణం.  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన సభ్యులు మంత్రులు కావడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని అనిపిస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది కొత్త మంత్రులు ఓబీసీ వర్గానికి చెందిన వ్యవసాయ కుటుంబీకులేనని గుర్తుచేశారు. ప్రధాని ప్రసంగిస్తోన్న సమయంలోనూ సభ్యులు వారి నిరసన కొనసాగించారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రమాణాలను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ..

అటు రాజ్యసభలోనూ కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల పరిచయ కార్యక్రమానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. లోక్‌సభలో మాదిరిగానే ఇక్కడ కూడా పలు అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, రైతుల ఆందోళనలపై నినాదాలు చేశారు. వారి తీరుపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, మహిళా మంత్రులను పరిచయం చేయడం కొందరు సభ్యులు కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తద్వారా వారికి మహిళా వ్యతిరేక భావన ఉన్నట్లు కనిపిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇలాంటి నెగటివ్‌ మైండ్‌సెట్‌ను పార్లమెంట్‌లో గతంలో ఎన్నడూ చూడలేదని ప్రధాని మోదీ మరోసారి పేర్కొన్నారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.

అఖిలపక్ష నేతలతో మరోసారి భేటీ

కరోనా విషయంపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలతో మంగళవారం మరోసారి సమావేశం కానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. కొవిడ్‌ను ఎదుర్కొంటున్న తీరుతో పాటు, వ్యాక్సినేషన్‌ విధానాన్ని వారికి వివరిస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొవిడ్‌పై సమీక్ష జరుపుతున్నానని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కొవిడ్‌ మహమ్మారిపై ప్రభుత్వం పోరాడుతున్న తీరుపై సభలోనూ, బయట కూడా చర్చించేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని