నేడు భారత్‌-చైనాల కీలక సైనిక చర్చలు  

తాజా వార్తలు

Updated : 09/04/2021 10:35 IST

నేడు భారత్‌-చైనాల కీలక సైనిక చర్చలు  

శాంతి దిశగా ఈ దఫా ముందడుగు?

దిల్లీ: భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య శుక్రవారం కీలక చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా ఈ దఫా పురోగతి చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోర్‌ కమాండర్‌ స్థాయిలో జరిగే ఈ చర్చలకు తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌ ప్రాంతంలో ఉన్న భారత శిబిరం వేదిక కానుంది. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలూ భారీగా సైన్యాలను మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. వీటికి అనుగుణంగా పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. అయితే ఘర్షణకు కేంద్ర బిందువులుగా ఉన్న మిగతా ప్రాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే 11వ విడత కోర్‌ కమాండర్ల సమావేశంలో పరిస్థితి మార్పునకు గట్టి ప్రయత్నం జరుగుతుందని సంబంధిత వర్గాలు ‘ఈటీవీ భారత్‌’కు తెలిపాయి. అది కార్యరూపం దాలిస్తే గోగ్రా లోయ, హాట్‌స్ప్రింగ్స్, దెమ్‌చోక్‌లో ఉద్రిక్తతలు సడలి, ప్రశాంతత నెలకొంటుందని వివరించాయి. 

మరోవైపు తూర్పు లద్దాఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరిగి, ద్వైపాక్షిక బంధం వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చీ వ్యక్తంచేశారు. 11వ విడత కోర్‌ కమాండర్ల భేటీ నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ బీజింగ్‌లో చెప్పారు. నిర్దేశిత ఒప్పందాలకు అనుగుణంగా ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌ తమతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది ఏప్రిల్‌ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలన్న భారత విజ్ఞప్తిపై శుక్రవారం నాటి కోర్‌ కమాండర్ల భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని