
తాజా వార్తలు
ప్రపంచ వ్యాప్తంగా..3కోట్ల మందికి టీకా!
46 దేశాల్లో ప్రారంభమైన టీకా పంపిణీ
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే టీకా ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు మూడు కోట్ల మంది టీకాలు తీసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అయితే, టీకాల పంపిణీలో ఎక్కువగా ధనిక దేశాలు మాత్రమే ముందున్నాయని అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 46 దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం డైరెక్టర్ మైక్ రేయాన్ వెల్లడించారు. వీటిలో అధిక ఆదాయ దేశాలే 38 ఉన్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన దేశాల్లో దాదాపు ఐదు రకాల వ్యాక్సిన్లకు చెందిన 2కోట్ల 80లక్షల డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. వైరస్ వ్యాప్తి గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది మరింత కష్టంగానే ఉందనిపిస్తోంది. ముఖ్యంగా అత్యంత వ్యాప్తి కలిగిన కరోనా స్ట్రెయిన్లు బయటపడుతోన్న నేపథ్యంలో తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది’ అని మైక్ రేయాన్ స్పష్టంచేశారు. మరికొన్ని దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో కోటి మందికి..
ప్రైవేటు నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల 24లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా అమెరికాలో కోటి 8లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు సీడీసీ వెల్లడించింది. వీరిలో దాదాపు ఏడున్నర లక్షల మంది రెండో డోసు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక కరోనా వైరస్ మహమ్మారికి పుట్టిల్లైన చైనాలోనూ వ్యాక్సిన్ పంపిణీ భారీస్థాయిలోనే జరుగుతోంది. గతవారం నాటికే అక్కడ 90లక్షల మందికి టీకా ఇచ్చినట్లు చైనా మీడియా వెల్లడించింది. వీటితో పాటు ఈయూ దేశాల్లోనూ టీకా పంపిణీ వేగవంతం కాగా, యూకే, ఇజ్రాయెల్, రష్యా, యూఏఈ దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ చురుగ్గా కొనసాగుతోంది.
ఇవీ చదవండి..
కొవిడ్ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!
చైనా నగరాల్లో ఎమర్జెన్సీ