close

ప్రధానాంశాలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నగారా

షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

● 12న నోటిఫికేషన్‌.. ఏప్రిల్‌ 7న పోలింగ్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరి వరకే ఉంది. కేవలం రెండేళ్లలోపే ఉన్నప్పటికీ పలువురు తెరాస నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న నేతలు మంత్రి కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తెరాస అదిష్ఠానం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి వారి అభీష్టం మేరకు అభ్యర్థిని ఎంపిక చేయనుంది. మాజీ ఎంపీ కవిత ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారినే ఎమ్మెల్సీ పదవి వరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు గురువారం షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఈ నెల 19 వరకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయొచ్ఛు 20న వాటిని పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 7న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. 13తో ఉప ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది.

అధిష్ఠానం పరిశీలనలో

తెరాస అధిష్ఠానం మాజీ సభాపతి కే.ఆర్‌.సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పదవీ కాలం తక్కువగా ఉండడంతో వీరు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఉద్యమకారులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయిస్తే నాడు పని చేసిన నేతల పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. తెరాస మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజిబొద్దీన్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉమ్మడి జిల్లా తెరాస అధ్యక్షుడిగా పనిచేసిన ఈగ గంగారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు సైతం పదవి ఆశిస్తున్నారు.

అనర్హత వేటుతో ఉప ఎన్నిక

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయణ్ని అనర్హుడిగా ప్రకటిస్తూ అప్పటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్ణయం తీసుకున్నారు. తెరాస తరఫున ఎన్నికైన భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ టికెట్‌పై నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనర్హతపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఛైర్మన్‌ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురైంది.

ఎన్నుకునేది వీరే

ఉభయ జిల్లాల్లో మొత్తం 535 ఎంపీటీసీ స్థానాలుండగా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి ఎంపీటీసీ సభ్యురాలిపై అనర్హత వేటు పడడంతో ఆ స్థానం ఖాళీ అయింది. 534 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు ఉభయ జిల్లాల్లో 49 మంది జడ్పీటీసీ సభ్యులు, 166 మంది కౌన్సిలర్లు, 60 మంది కార్పొరేటర్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు

తెరాసదే ఆధిక్యం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తెరాస అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని తెరాస సునాయాసంగా గెలుచుకునే అవకాశాలున్నాయి. మెజార్టీ లేనందున కాంగ్రెస్‌, భాజపా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం లేదు. తెరాస అభ్యర్థి ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.