డేనియల్‌ పెర్ల్‌ హత్య కేసు ప్రధాన నిందితుడికి జైలు నుంచి స్వేచ్ఛ

ప్రధానాంశాలు

Updated : 03/02/2021 08:15 IST

డేనియల్‌ పెర్ల్‌ హత్య కేసు ప్రధాన నిందితుడికి జైలు నుంచి స్వేచ్ఛ

అహ్మద్‌ ఒమర్‌ను ప్రభుత్వ విశ్రాంతి గృహానికి తరలించాలని పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌: అమెరికా జర్నలిస్టు డేనియల్‌ పెర్ల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అల్‌ ఖైదా ఉగ్రవాది అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్‌ను కొన్ని రోజుల క్రితమే నిర్దోషిగా ప్రకటించిన పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు... అతడికి జైలు నుంచి స్వేచ్ఛ కల్పించేందుకు పూనుకుంది. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఖైదీల సెల్‌లో ఉన్న అతణ్ని ప్రభుత్వ విశ్రాంతి గృహానికి తరలించాలని మంగళవారం ఆదేశించింది. తొలుత రెండు రోజులు సాధారణ బ్యారక్‌లో ఉంచాలని ఆ తర్వాత శుక్రవారంలోపు విశ్రాంతి గృహానికి మార్చాలని చెప్పింది. అక్కడ అతణ్ని తన కుటుంబ సభ్యులు కలవడానికి అనుమతినిచ్చింది. వారు అక్కడికి వచ్చి వెళ్లేందుకు రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. అయితే ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయాలను అతడికి కల్పించకూడదని స్పష్టం చేసింది. అతడు విశ్రాంతి గృహం నుంచి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. అహ్మద్‌ ఒమర్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సింధ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తాజా ఆదేశాలిచ్చింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికలో పనిచేసే డేనియల్‌ పెర్ల్‌ 2002లో ఉగ్రవాద కార్యకలాపాలపై పరిశోధనాత్మక కథనాలు రాసేందుకు పాక్‌కు వెళ్లినప్పుడు అహ్మద్‌ ఒమర్‌ మరికొందరితో కలసి అతణ్ని అపహరించి దారుణంగా హతమార్చినట్లు ఆరోపణలున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన