close

ప్రధానాంశాలు

Updated : 24/02/2021 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్ర, కేరళల్లో 2 కీలక రకాలు

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ఇవే కారణమని చెప్పలేం

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కరోనా కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు సంబంధించి ఎన్‌440కె, ఈ484కె రకాలను దేశంలోని మహారాష్ట్ర, కేరళల్లో  గుర్తించినట్లు కేంద్రం మంగళవారం తెలిపింది.  ఈ రెండు రకాల్లో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళల్లోని కొన్ని జిల్లాల్లో కేసులు పెరగడానికి ఈ కొత్తరకాలు ప్రధాన కారణం కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. మంగళవారం దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బ్రిటన్‌ రకం వైరస్‌ కనిపించిన తర్వాత భారత ప్రభుత్వం విభిన్న విభాగాలకు చెందిన పది ప్రయోగశాలలను జోడించి కన్సార్షియం ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు అది 3,500 వైరస్‌ల జన్యుపరిణామక్రమాలను విశ్లేషించింది. అందులో 187 మందిలో బ్రిటన్‌, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తికి బ్రెజిల్‌ రకం వైరస్‌ సోకినట్లు తేలింది. జన్యుపరిణామక్రమాన్ని గుర్తించేటప్పుడు కేవలం ఈ మూడు రకాల వైరస్‌ల పరిశీలనకే పరిమితం అవకుండా, ఇంకా ఏమైనా ఉత్పరివర్తనాలు వచ్చాయేమోనని నిరంతరం పరిశీలిస్తున్నాం. మార్పులు రావడం వైరస్‌ సహజ లక్షణం. అందుకు అనుగుణంగానే మరికొన్ని రకాల మార్పులు కనిపించాయి. అయితే వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం ప్రకారం వైరస్‌లో వచ్చిన మార్పుల వల్లే కేసులు పెరగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’’ అని స్పష్టంచేశారు.

మాస్కులు తప్పవు : బలరాం భార్గవ
దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు వైరస్‌లో వచ్చిన మార్పులను కారణంగా చెప్పలేమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవకూడా చెప్పారు. మాస్క్‌ ధరించడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు. సామూహిక సమావేశాలను పరిహరించాలన్నారు. 50 ఏళ్ల పైబడిన వయోవృద్ధులకు టీకాలు వేసే కార్యక్రమం అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు.

కర్ణాటక ఆంక్షలపై ప్రధానికి లేఖ
తిరువనంతపురం: కేరళ నుంచి కర్ణాటకలోకి ప్రవేశించేవారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన అంశంలో కేంద్రం తక్షణం కల్పించుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మోదీకి ఓ లేఖ రాశారు. కొత్త ఆంక్షల కారణంగా కర్ణాటక వెళ్లే ప్రజలు, విద్యార్థులు, రోగులు, నిత్యావసరాలు తీసుకెళ్లే ట్రక్కుల డ్రైవర్లు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి కె.సుధాకరన్‌ ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘‘కర్ణాటక-కేరళ మధ్య రాకపోకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిషేధించలేదు. కేరళ నుంచి కర్ణాటక వచ్చేవారు గత 72 గంటల్లో చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉండడాన్ని తప్పనిసరి చేశాం’’ అని స్పష్టంచేశారు. ఈ నిబంధన ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చని వ్యాఖ్యానించారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన