ఆ వాహనం ఎటెటో వెళుతోంది!

ప్రధానాంశాలు

Updated : 18/03/2021 08:45 IST

ఆ వాహనం ఎటెటో వెళుతోంది!

అంబానీ ఇంటి వద్ద ఎస్‌యూవీ కేసు రోజుకో కొత్త మలుపు
సచిన్‌ వాజే చుట్టూ ‘పరిణామాలు’
ముంబయి పోలీసు కమిషనర్‌ బదిలీ
కేసు లోతుల్ని తవ్వుతున్న ఎన్‌ఐఏ

ముంబయి/దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసులో రోజుకో కొత్త కోణం బయట పడుతోంది. విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీగ లాగుతుంటే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా పేలుడు పదార్థాల వాహనం కేసును సక్రమంగా చేపట్టని కారణంగా ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీవేటు వేసింది. ఆయన్ను అంతగా ప్రాధాన్యం లేని హోంగార్డుల విభాగానికి అధిపతిగా పంపించింది. ముంబయి కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, 26/11 ముంబయి ఉగ్రదాడుల సమయంలో కీలకంగా పనిచేసిన హేమంత్‌ నగ్రాలేకు బాధ్యతలు అప్పగించింది.
అతను వాజేనా!
ఈ కేసులో ఇటీవల అరెస్టయిన పోలీసు అధికారి సచిన్‌ వాజే కీలకంగా మారారు. మొత్తం వ్యవహారంలో కొందరు ‘ఇతరుల’ ప్రమేయం ఉందని, వారి సూచనల మేరకే వాజే పనిచేసినట్లు ఎన్‌ఐఏ భావిస్తోంది. కాగా ఆధారాల సేకరణకు గాను సచిన్‌ వాజేను ఎన్‌ఐఏ బుధవారం ఘటనస్థలికి తీసుకెళ్లింది. ఠాణేలోని వాజే నివాసంలోనూ సోదాలు జరిపింది. అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో వాజేను అక్కడికి తీసుకెళ్లి ప్రశ్నించింది. అంబానీ ఇంటికి సమీపంలో పీపీఈ కిట్‌ ధరించి, సీసీటీవీ కెమెరాలో చిక్కిన వ్యక్తి వాజేనేనని ఎన్‌ఐఏ తెలిపింది. కారులో పేలుడు పదార్థాలను అతనే పెట్టినట్లు అనుమానిస్తోంది.
కారెక్కింది మన్‌సుఖ్‌!
పేలుడు పదార్థాలతో కనుగొన్న వాహనం తనదేనని, అంతకుముందే అది చోరీకి గురైందని గతంలో హిరేన్‌ మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఏ పరిశీలించిన ఓ సీసీ టీవీ ఫుటేజిలో సీఎస్‌ఎంటీ వద్ద మన్‌సుఖ్‌ నిరీక్షిస్తుండగా అంతలో మెర్సిడెస్‌ కారు రావడం, అందులోకి మన్‌సుఖ్‌ ఎక్కడం వెంటనే అది వేగంగా వెళ్లిపోవడాన్ని గుర్తించారు. ఆ తర్వాతే మన్‌సుఖ్‌ అదృశ్యం కావడం, అనంతరం అతను శవమై కనిపించడంతో దర్యాప్తులో ఈ కారు కీలకం కానుందని ఎన్‌ఐఏ భావిస్తోంది.
ఖాజీని ప్రశ్నించిన ఎన్‌ఐఏ
ముంబయి క్రైంబ్రాంచి అధికారి రియాజుద్దీన్‌ ఖాజీని వరుసగా నాలుగో రోజు (బుధవారం) ఎన్‌ఐఏ ప్రశ్నించింది. క్రైంబ్రాంచికి చెంది అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌ హోవల్‌ కూడా ఎన్‌ఐఏ ఎదుట హాజరయ్యారు.

‘సీన్‌’లోకి మరో కారు..
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనాన్ని (ఎస్‌యూవీ) కనుగొన్న తర్వాత అక్కడి సమీపంలో ఓ ఇన్నోవా కారును కూడా కనుగొన్నారు. తాజాగా మూడో వాహనం సంగతి బయటపడింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) స్టేషన్‌కు సమీపంలో పార్కింగ్‌ చేసిన ఈ నల్లరంగు మెర్సిడెస్‌ కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఐజీ అనిల్‌ శుక్లా తెలిపారు. దీన్ని వాజే వినియోగించేవారని భావిస్తున్నారు. ఆ కారులోంచి రూ. 5 లక్షల నగదు, కరెన్సీ నోట్లను లెక్కించే యంత్రాన్ని, రెండు నెంబర్‌ ప్లేట్లను, కొన్ని దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే వాజే కార్యాలయం నుంచి ల్యాప్‌టాప్‌, ఐపాడ్‌, మొబైల్‌ ఫోన్లు వంటివాటితో పాటు, కొన్ని కీలక పత్రాలను ఎన్‌ఐఏ బృందం స్వాధీనం చేసుకుంది. ల్యాప్‌టాప్‌లో సమాచారం మొత్తం ముందే డిలీట్‌ చేసి ఉన్నట్లు కనుగొంది. తన సెల్‌ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగానే సచిన్‌ వాజే ఎక్కడో పడేశారని ఎన్‌ఐఏ తెలిపింది. కాగా ఆ మెర్సిడెస్‌ కారు తనదేనని ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా గత నెలలోనే విక్రయించినట్లు శరాన్ష్‌ భావ్‌సర్‌ అనే వ్యక్తి ఓ టీవీ ఛానెల్‌కు తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన