close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బురదనేలలో హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

లులు గ్రూపు ఛైర్మన్‌, సతీమణి సురక్షితం

కోచి: అంతర్జాతీయస్థాయి ప్రముఖ పారిశ్రామికవేత్త, లులు గ్రూపు ఛైర్మన్‌ ఎం.ఎ.యూసుఫ్‌ ఆలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఆదివారం పైలట్‌ అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మికంగా బురద నేలలో కిందికి దింపారు. ఈ సంఘటనలో యూసుఫ్‌ ఆలీతో పాటు, ఆయన భార్య, ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం కోలుకున్నారు. అబుదాభిలో ఉంటున్న ఆయన స్వస్థలమైన కోచి వచ్చారు. సమీప బంధువు ఒకరు దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో పరామర్శకు హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 9 గంటల సమయంలో వాతావరణం మారి పోయి భారీ వర్షం పడడంతో దాన్ని సురక్షిత ప్రాంతంలో దింపాలని పైలట్లు నిర్ణయించారు. దాంతో పనన్‌గాడ్‌ గ్రామం సమీపంలోని ఫిషరీస్‌ కళాశాల మైదానంలో దింపాలని భావించారు. పరిస్థితుల కారణంగా అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న బురదనేలలోనే దింపారు. బైపాస్‌ రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా ఉండడం, సమీపంలో విద్యుత్తు తీగలు, ఇళ్లు ఉన్నప్పటికీ సురక్షితంగా కిందికి దించారు. ఇది చూసిన స్థానికుడు ఒకరు హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయిందని భావించి అక్కడికి వెళ్లారు. పైలట్ల సహకారంతో యూసుఫ్‌ ఆలీ తదితరులను కిందికి దించారు. పది నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన