టీకాలపై అపోహలను తొలగించాలి

ప్రధానాంశాలు

Updated : 02/07/2021 12:09 IST

టీకాలపై అపోహలను తొలగించాలి

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు

ఈనాడు డిజిటల్‌, చెన్నై:  కరోనాపై పోరాటంలో టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణుల్లో అపోహలను తొలగించాల్సి ఉందన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం చెన్నైలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డా.జార్జి అబ్రహమ్‌ తాను రాసిన ‘‘మై పేషెంట్స్‌ మై గాడ్‌ - జర్నీ ఆఫ్‌ ఏ కిడ్నీ డాక్టర్‌’’ పుస్తకం తొలి కాపీని ఉపరాష్ట్రపతికి అందజేశారు. వైద్యుడు, విద్యావేత్త, పరిశోధకునిగా అబ్రహమ్‌ నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు చూపించిన చొరవ ప్రశంసనీయం. వైద్యుల ఆరోగ్య భద్రత, వారి సంక్షేమం విషయంలోనూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని’ ఆయన పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ బీసీ రాయ్‌కు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్‌ నివారణకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గురువారం ‘ఐఎఫ్‌సీపీసీ- 2021 వరల్డ్‌ కాంగ్రెస్‌’ను చెన్నై నుంచి అంతర్జాలంలో ఆయన ప్రారంభించారు.

* చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య నాయుడు తన 72వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, తెదేపా నేతలు చంద్రబాబు, లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆనందమైన, ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

కేసీఆర్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘హుందాతనంతో సమాజం, దేశం పట్ల అంకితభావంతో మీరు చేస్తున్న సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలి’’ అని సీఎం ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని భగవంతుని కోరినట్లు తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన