వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలుండాలి

ప్రధానాంశాలు

Published : 08/09/2021 05:06 IST

వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలుండాలి

రోగి మరణించినందుకు.. వారిపై నిందలు వేయకూడదు: సుప్రీం వ్యాఖ్యలు

దిల్లీ: శస్త్రచికిత్స జరుగుతుండగా రోగి మరణిస్తే, అందుకు వైద్య నిపుణుడి నిర్లక్ష్యమే కారణమని భావించడం సరికాదని... దీన్ని నిరూపించడానికి తగిన వైద్యపరమైన ఆధారాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘చికిత్స వికటించినా, రోగి చనిపోయినా.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని ఆటోమేటిక్‌గా భావించకూడదు. వారి అలసత్వాన్ని నిరూపించేందుకు సరైన మెడికల్‌ రికార్డు లేదా వైద్యపరమైన ఆధారాలు ఉండాలి’’ అని విస్పష్టంగా పేర్కొంది. ఓ కిడ్నీ బాధితురాలు 1996లో మృతి చెందిన కేసులో ‘జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)’ విచారణ చేపట్టింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్టు తేల్చింది. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సదరు వైద్యుడిని ఆదేశించింది. వ్యాజ్యం దాఖలైనప్పటి నుంచి పరిహారం చెల్లించేనాటి వరకూ ఆ మొత్తానికి 9% వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును సవాలుచేస్తూ ఆ వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా... జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోపన్నల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్‌సీడీఆర్‌సీ తీర్పును తోసిపుచ్చింది. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల రోగి చనిపోయినట్టుగానీ, వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగానీ ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది. కేవలం ఒక ఉద్దేశం ఆధారంగా వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పడం సరికాదని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన