ఢమాల్‌

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

ఢమాల్‌

షూటింగ్‌లో వైఫల్యాల పరంపర

నిరాశపరిచిన సౌరభ్‌-మను

మిగతా జోడీలదీ అదే వరస

ప్రపంచకప్‌లో అడుగు పెడితే పతకాల పంటే. ఆసియా, కామన్వెల్త్‌ లాంటి క్రీడల్లోనూ పతకాలే పతకాలు. కానీ ఒలింపిక్స్‌లోకి వస్తే మాత్రం నిట్టూర్పులే! 2004 నుంచి 2012 వరకు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పతకాలతో అంచనాలు పెంచేశాక.. రియోలో షూటర్లు ఎంతగా నిరాశ పరిచారో తెలిసిందే. ఇప్పుడు ఒలింపిక్స్‌ చరిత్రలోనే అతి పెద్ద జట్టుతో, అత్యధిక అంచనాలతో టోక్యోలో అడుగు పెట్టిన షూటింగ్‌ బృందం.. ఘోరమైన ప్రదర్శనతో పతకాశల్ని కూల్చేస్తోంది. తాజాగా మంగళవారం సౌరభ్‌ చౌదరి-మను బాకర్‌ సహా నాలుగు జోడీలు రెండు పతక ఈవెంట్లలో తీవ్ర నిరాశకు గురి చేశాయి.

టోక్యో

ఈ రోజైనా.. ఈ రోజైనా అనుకుంటూనే ఈవెంట్లు అయిపోతున్నాయి. షూటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. భారీ అంచనాలతో టోక్యోలో అడుగు పెట్టిన మన షూటర్లు.. రియోను తలపిస్తూ ఇప్పటిదాకా ఖాతానే తెరవలేదు. వ్యక్తిగత ఈవెంట్లలో అదృష్టం కలిసి రాలేదు, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో కసిగా పోటీ పడి పతకం పట్టేస్తారని ఆశలు పెట్టుకున్న సౌరభ్‌ చౌదరి-మను బాకర్‌ జంట.. ఈ పోటీలోనూ పతకం గెలవడంలో విఫలమైంది. సౌరభ్‌ ఉన్నంతలో మెరుగైన  ప్రదర్శనే చేసినా.. మను అంచనాలను అందుకోలేకపోవడంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో సౌరభ్‌-మను జోడీ ఫైనల్‌ కూడా చేరలేకపోయింది. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్లో సౌరభ్‌-మను జోడీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ రౌండ్‌ మూడు సిరీస్‌ల్లో వరుసగా 98,  100, 98 పాయింట్లతో సౌరభ్‌ మొత్తం 296 స్కోర్‌ సాధించగా.. మను 286 (97+94+95) పాయింట్లు నమోదు చేసింది. మొత్తంగా 582 పాయింట్లతో భారత జోడీ  అగ్రస్థానంలో నిలిచి పతకాశలు రేపింది. కానీ క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్లో మను పేలవ ప్రదర్శన చేయడంతో భారత జోడీకి దారులు మూసుకుపోయాయి. రెండు సిరీస్‌ల ఈ రౌండ్లో మను 92, 94 పాయింట్లు మాత్రమే సాధించింది. సౌరభ్‌ 96, 98 పాయింట్లతో  ఆకట్టుకున్నా.. ఓవరాల్‌గా 380 పాయింట్లతో ఈ జోడీ ఏడో స్థానానికి పరిమితమైంది. క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్లో టాప్‌-4లో నిలిచిన జోడీలు పతక పోటీకి అర్హత సాధించాయి. టాప్‌-2 జట్లు స్వర్ణం కోసం తలపడితే.. తర్వాతి రెండో స్థానాల్లోని జట్టు కాంస్యం కోసం పోటీ పడ్డాయి. చైనా, రష్యా ఒలింపిక్‌ కమిటీ, ఉక్రెయిన్‌ జట్లు వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం గెలిచాయి. ఇదే ఈవెంట్లో అభిషేక్‌ వర్మ-యశస్విని జైశ్వాల్‌ జోడీ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. వీళ్లు 564 పాయింట్లతో (అభిషేక్‌ 283+యశస్విని 281) 17వ స్థానానికి పరిమితమయ్యారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీంలోనూ భారత జోడీలు ప్రభావం చూపలేకపోయాయి. దివ్యాంశ్‌ సింగ్‌ పన్వార్‌ (313.3)-ఎలవేనిల్‌ వలరివాన్‌ (313.2) జోడీ మొత్తం 626.5 పాయింట్లతో క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్లో 12వ స్థానంలో నిలవగా.. దీపక్‌ కుమార్‌ (311.4)-అంజుమ్‌ మౌద్గిల్‌ (312.4) జంట 623.8 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది. భారత్‌కు పతకాలు ఖాయం అనుకున్న ఈవెంట్లలో రిక్తహస్తమే మిగలగా.. ఇంకో నాలుగు ఈవెంట్లలో మన షూటర్లు పోటీ పడాల్సి ఉంది. అందులో ఒక్కటైనా భారత్‌కు పతకం అందిస్తుందేమో చూడాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన