సింధు శుభారంభం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 04:03 IST

సింధు శుభారంభం

శ్రీకాంత్‌, సమీర్‌ కూడా

ఒడెన్స్‌: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత బరిలో దిగిన తొలి టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆమె రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మంగళవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ ప్రపంచ ఛాంపియన్‌ 21-12, 21-10 తేడాతో నెస్లిహాన్‌ యిగిట్‌ (టర్కీ)ని చిత్తుచేసింది. వరస గేమ్‌ల్లో ఆధిపత్యం చలాయించిన నాలుగో సీడ్‌ సింధు కేవలం 30 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి గేమ్‌ ఆరంభంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కొన్న సింధు.. ఓ దశలో 5-4తో ఆధిక్యంలో నిలిచింది. ఇక అక్కడి నుంచి తనదైన శైలిలో స్మాష్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి చూస్తుండగానే గేమ్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో ఓ దశలో 10-9తో నిలిచిన ఆమె.. ఆ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గొప్పగా ఆడి విజయాన్ని అందుకుంది. రెండో రౌండ్లో ఆమె.. బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌ 21-14, 21-11తో సహచర షట్లర్‌ సాయి ప్రణీత్‌పై విజయం సాధించాడు. 2017లో ఈ టోర్నీలో టైటిల్‌ గెలిచిన శ్రీకాంత్‌.. ప్రణీత్‌పై పోరులో పూర్తి పెత్తనం ప్రదర్శించాడు. రెండో రౌండ్లో అతను.. ప్రపంచ నంబర్‌వన్‌ మొమొటో (జపాన్‌)తో పోటీపడతాడు. మరోవైపు సమీర్‌ వర్మ 21-17, 21-14తో కున్లావుత్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గి రెండో రౌండ్‌ చేరాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 23-21, 21-15తో హేమింగ్‌- స్టాల్‌వుడ్‌ (ఇంగ్లాండ్‌)పై, అర్జున్‌- ధ్రువ్‌ జంట 21-19, 21-15తో బెన్‌- సీన్‌ (ఇంగ్లాండ్‌)పై గెలిచాయి. మను- సుమీత్‌ ద్వయం 18-21, 11-21తో గో ఫీ- ఐజుద్దీన్‌ (మలేసియా) చేతిలో ఓడి తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన