పెగాసస్‌తో తప్పుడు ఆధారాలకు అవకాశం

ప్రధానాంశాలు

Updated : 06/08/2021 06:03 IST

పెగాసస్‌తో తప్పుడు ఆధారాలకు అవకాశం

పంజాబ్‌ మాజీ డీజీపీ రెబిరో

ఈనాడు, హైదరాబాద్‌: తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశంతోనే గిరిజన హక్కుల నాయకుడు స్టాన్‌స్వామి కంప్యూటర్లోకి బలవంతపు ఆధారాలు జొప్పించారని పంజాబ్‌ మాజీ డీజీపీ జూలియో ప్రాన్సిస్‌ రెబిరో ఆరోపించారు. ఇప్పుడు పెగాసస్‌ వల్ల కూడా అలాంటి ముప్పు పొంచి ఉందన్నారు. పెగాసస్‌ ఉదంతం నేపథ్యంలో దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వానంద ‘జాతీయ భద్రత- హ్యాకింగ్‌ అండ్‌ స్పైవేర్‌’ అంశంపై గురువారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘‘న్యాయం చట్టబద్ధంగా అందాలి. అమాయకులను అక్రమంగా నిర్బంధించే రోజులు పోవాలి. తప్పుచేయని వారిపై ఎలాంటి కేసులూ నమోదు కానప్పుడే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది’’ అని రెబిరో అన్నారు. పెగాసస్‌ వంటి వాటి వల్ల తప్పుడు ఆధారాలు పుట్టించి దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపా కోరల్లో చిక్కుకుంటే బెయిల్‌ కూడా దొరకదన్నారు. అందుకే అత్యంత దుర్మార్గమైన ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండు చేశారు. హరియాణా మాజీ డీజీపీ వికాస్‌ నారాయణ్‌ రాయ్‌ మాట్లాడుతూ ఆధారాలు సృష్టించడం, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటివి నేరాలే అన్నారు. ఇటువంటి వాటివల్ల భావప్రకటన స్వేచ్ఛకు కలుగుతున్న నష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ఐజీ శర్వన్‌ రామ్‌ దారాపురి మాట్లాడుతూ.. ‘‘భావప్రకటనా స్వేచ్ఛ ఇప్పుడు ప్రమాదంలో పడింది. పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన సందర్భంగా నేను నాగరికతను రక్షించండి అని పోస్టర్‌ పట్టుకున్నందుకు అరెస్టు చేశారు. ఈ నినాదం ప్రజలను రెచ్చగొట్టేటట్లు ఉందని అభియోగం మోపారు. ఇది ఎంత వరకూ న్యాయం’’ అని ఆయన ప్రశ్నించారు. భీమాకోరెగావ్‌ కేసులో చాలామందిని బలవంతంగా ఇరికించారని, పెగాసస్‌ వల్ల ఇలాంటి ముప్పే పొంచి ఉందని, అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ చేపట్టాలన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన