రూ.7,523 కోట్లతో ‘అర్జున్‌ మార్క్‌-1ఎ’ కొనుగోలు

ప్రధానాంశాలు

Published : 24/09/2021 14:32 IST

రూ.7,523 కోట్లతో ‘అర్జున్‌ మార్క్‌-1ఎ’ కొనుగోలు

అధునాతన ట్యాంకులకు ఆర్డర్‌ ఇచ్చిన రక్షణశాఖ

ఈనాడు, దిల్లీ: భారత స్వదేశీ ఆయుధ పాటవానికి పట్టం కడుతూ రక్షణ మంత్రిత్వశాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్‌ మార్క్‌-1ఎ’ కొనుగోలు కోసం చెన్నైలోని ఆవడిలో ఉన్న భారీ వాహన కర్మాగారం (హెచ్‌వీఎఫ్‌)కు రూ.7,523 కోట్ల విలువైన ఆర్డరిచ్చింది. మొత్తం 118 శకటాలను సమకూర్చుకోనుంది. ఈ ఆయుధంతో మన సైనిక పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. ఈ ట్యాంకును రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించింది. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఇది మరింత ఊతమిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ దిశగా ఇది పెద్ద ముందడుగు అని తెలిపింది. భారత సైన్యంలో ఇప్పటికే అర్జున్‌ ట్యాంకు సేవలు అందిస్తోంది. దీనికి.. ‘మార్క్‌-1ఎ’ మరింత మెరుగైన రూపం. ఇందులో కొత్తగా 72 అంశాలను జోడించారు. ఈ ట్యాంకు ఎలాంటి ఉపరితలంపైనైనా అలవోకగా దూసుకెళ్లగలదు. రాత్రివేళ కూడా లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. శత్రువుపై చాలా మెరుగ్గా గుళ్ల వర్షం కురిపించగలదు. అధునాతన సాంకేతికతతో కూడిన బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఇది కలిగి ఉంది. ఫలితంగా శత్రు దాడిని మెరుగ్గా తట్టుకోగలదు.  అర్జున్‌ మార్క్‌-1ఎ అభివృద్ధి పనులను డీఆర్‌డీఓ 2010లో మొదలుపెట్టి 2012 నాటికి పూర్తిచేసింది. నాటి నుంచి దీనిపై విస్తృతంగా పరీక్షలు నిర్వహించింది. వివిధ దశల్లో 7వేల కిలోమీటర్లు నడిపారు. భారతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారని, దేశ రక్షణ కోసం దీన్ని సులభంగా ఎక్కడైనా మోహరించవచ్చని రక్షణశాఖ వెల్లడించింది. ఈ ట్యాంకుల కొనుగోలు కోసం హెచ్‌వీఎఫ్‌కు ఆర్డర్‌ ఇచ్చినందున దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు రక్షణ ఉత్పత్తి రంగంలో ఉన్న 200 మంది విక్రేతలకు అవకాశాలు లభిస్తాయని తెలిపింది. దీనివల్ల దాదాపు 8వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన