వాంఖడే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు

ప్రధానాంశాలు

Updated : 27/10/2021 13:16 IST

వాంఖడే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు

ఉద్యోగం కోసం నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించారు

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన ఆరోపణలు

ముంబయి, దిల్లీ: షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు సహా పలువురి ఫోన్లను ఆయన అక్రమంగా ట్యాప్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు లాగేందుకే ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌సీబీ సిబ్బందిలో ఒకరు వాంఖడే అక్రమ వ్యవహారాలకు సంబంధించి తమ ఇంటికి సవివర లేఖ పంపారని చెప్పారు. ముంబయి, ఠానేల్లోని ఇద్దరు వ్యక్తుల సహాయంతో వాంఖడే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు అందులో ఉందన్నారు. తన (మాలిక్‌) కుమార్తె కాల్‌ డీటెయిల్‌ రికార్డ్‌ (సీడీఆర్‌) కావాలని పోలీసులను వాంఖడే అడిగారని కూడా తెలిపారు. తమ ఇంటికి వచ్చినట్లుగా చెబుతున్న లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దాని ప్రతిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఇప్పటికే సమర్పించానన్నారు. ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌కు కూడా ఓ కాపీ పంపించనున్నట్లు చెప్పారు. ఉద్యోగం కోసం వాంఖడే నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించారనీ మాలిక్‌ ఆరోపించారు. వాస్తవానికి ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టినా.. ఎస్సీగా గుర్తింపు పత్రాలు రూపొందించుకున్నారని పేర్కొన్నారు. మాలిక్‌కు అందిన లేఖలోని విషయాలన్నీ అవాస్తవాలని వాంఖడే కొట్టిపారేశారు. ముడుపుల వ్యవహారంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాంఖడే.. తాజా ఆరోపణలతో మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది.

దిల్లీలో వాంఖడే

సమీర్‌ వాంఖడే తాజాగా దిల్లీలో పర్యటించారు. అక్కడి ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రెండు గంటల పాటు ఉన్నారు. పలువురు సీనియర్‌ అధికారులతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. ఆర్యన్‌ను విడుదల చేసేందుకు రూ.25 కోట్లు ముడుపులు అడిగారన్న ఆరోపణలకు సంబంధించి వాంఖడేపైనా ఎన్‌సీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణకు సంబంధించి తనకు సంస్థ నుంచి తాఖీదులేవీ అందలేదని, వేరే పని మీద దిల్లీ వచ్చానని వాంఖడే తెలిపారు. ముడుపుల వ్యవహారంలో విచారణకు నేతృత్వం వహిస్తున్న ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ కూడా.. విచారణ కోసం తాను ఎవరినీ పిలిపించలేదని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు వాంఖడేకు తాఖీదులిస్తానని చెప్పారు.

చంపేస్తామంటూ బెదిరింపులొస్తున్నాయ్‌: వాంఖడే భార్య

డ్రగ్స్‌ కేసుల్లో తాజా పరిణామాల నేపథ్యంలో తాము భయంభయంగా బతకాల్సి వస్తోందని సమీర్‌ వాంఖడే భార్య, నటి క్రాంతి రెడ్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తామంటూ తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ముడుపుల వ్యవహారంలో తన భర్తపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆయన నిజాయతీపరుడైన అధికారి అని పేర్కొన్నారు. అంధేరీలో మంగళవారం విలేకర్లతో ఈ మేరకు ఆమె మాట్లాడారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన