close

తాజా వార్తలు

మాటతో మంత్రం వేద్దాం

నువ్వు... నేను.. మనం!

మాట... భార్యాభర్తల అనుబంధాన్ని పెంచడమే కాదు తుంచేస్తుంది. భావ వ్యక్తీకరణ తీరు సరిగ్గా లేకపోతే... ఏళ్లు గడిచినా... ఆ బంధంలో ఆనందం కన్నా ఎక్కువ యాంత్రికతే ఉంటుంది. దీన్ని అధిగమించడం జంటల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి... మాట తీరు... ఎలా మారాలో, ఎలా మార్చు కోవాలో చూద్దామా.

పిలుపులో ప్రేమ...

భాగస్వామిని హాయ్‌ డియర్‌ అనో, డార్లింగ్‌ అనో పిలవక్కర్లేదు. మీ పిలుపులో ప్రేమ కనిపిస్తే చాలు. లేదా ఇద్దరికీ ఓ నిక్‌నేమ్‌ పెట్టుకోండి. అలాగే పిలుచుకోండి. ఆ పిలుపులో కరుకుదనం కానీ, ఏవగింపు కానీ ఉండకూడదు. ఏ విషయమైనా చర్చిస్తున్నప్పుడు... మన మాటతీరు ఎదుటివారు నొచ్చుకోకుండా ఉండాలి. భాగస్వామి తీరు ఎంత కోపం తెప్పిస్తున్నా... ఉద్వేగాలను అణచుకోవాలి. నిదానంగానే సమస్యను తెలియజేయాలి తప్ప అరవకూడదు. కాసేపు మౌనంగా ఉంటే... ఎదుటివారూ దాన్నే అనుసరిస్తారు.

ఫోనులో అయినా సరే...

ఈ రోజుల్లో చాలామందికి ఫోనే ప్రపంచం. దానికితోడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తోన్న రోజులివి. ఇంటికొచ్చాకా పనులతో తీరిక ఉండటంలేదు. ఉన్న ఖాళీ సమయంలో విశ్రాంతి పేరుతో ఫోనుతో గడిపేసే పరిస్థితులే ఎక్కువ. సాంకేతికత తెచ్చిన ఈ మౌనం ఇద్దరిమధ్యా ఇంకా దూరాన్ని పెంచుతోంది. అనుమానాలకూ తావిస్తోంది. దీనికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. ఇద్దరి పనివేళలు వేరా... అవకాశం, సమయం ఉన్నప్పుడల్లా ఫోనులో పలకరించుకోండి. చిన్నచిన్న ప్రేమ సందేశాలు దూరాన్ని తగ్గిస్తాయి. ‘తిన్నావా... ఏం చేస్తున్నావు... ’ వంటి ఆరాలు ఎదుటివారిపట్ల మీకున్న ప్రేమను తెలియజేస్తాయి. అలాగని వారికి చిరాకు తెప్పించేలా కాకుండా... మీ సందేశాల్లో ప్రేమే కనిపించాలని గుర్తుపెట్టుకోండి.

లోపాలు, విమర్శలు వద్ధు..

ప్రతిఒక్కరిలో లోపాలనేవి సర్వసాధారణం. ఇదే భాగస్వామికీ వర్తిస్తుంది. వాటిపై దృష్టిపెడితే... మీ బంధం బీటలు వారడం ఖాయం. ముఖ్యంగా ఎదుటివారిలో ఉన్న లోపాల్ని పదే పదే ఎత్తిచూపడం, అవకాశం వచ్చినప్పుడల్లా మూడో వ్యక్తి ముందు విమర్శించడం, వెటకారంగా మాట్లాడటం... వంటివన్నీ అనుబంధాన్ని దూరం చేసే పనులే. ముందు లోపాలు అందరిలోనూ ఉంటాయని, దానికి మీరూ మినహాయింపు కాదని అనుకోండి. భాగస్వామిలోని లోపాలు మీకు సమస్య తెచ్చిపెట్టనంతవరకూ చూసీచూడనట్లు వదిలేయండి. మూడో వ్యక్తి ముఖ్యంగా మీ కుటుంబసభ్యుల ముందు భాగస్వామిని వ్యాఖ్యానించే ఆలోచన వద్దే వద్ధు ఒకవేళ ఎదుటివారు ఏదైనా ప్రస్తావన తెచ్చినా సున్నితంగానే కొట్టిపారేయండి.

రోజుకో అరగంట...

పనులనేవి ఇద్దరికీ ఉంటాయి. ఇద్దరికీ ఉన్నవి ఇరవైనాలుగ్గంటలే. అయినాసరే... రోజులో మీ ఇద్దరికీ కలిపి కనీసం అరగంట పెట్టుకోండి. ఆ రోజు జరిగిన విషయాలు పంచుకోవడమే కాదు, ఒకరి గురించి మరొకరు తెలుసుకునేలా చూసుకోండి. ఇంటి వ్యవహారాలే కాదు... అభిరుచులు, ఆసక్తులు చెప్పుకోవడం, భాగస్వామిలో మీకు నచ్చిన, నచ్చని విషయాలు సున్నితంగా తెలియజేయడం...వంటివన్నీ అవసరమే. ఈ అరగంట సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే... మీ మధ్య మనస్పర్థలు చాలావరకూ తగ్గుతాయి. పారదర్శకత పెరుగుతుంది. అనుబంధమూ దృఢమవుతుంది. ఆ సమయంలో ఫోను, వాట్సాప్‌ ఛాటింగ్‌లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

వాదనలూ నిదానమే...

ఇద్దరిమధ్యా ఎంత అవగాహన ఉన్నా... చిన్నచిన్న మనస్పర్థలు సర్వసాధారణం. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు... అదేపనిగా వాదించడం, గొడవ పెట్టుకునే తీరులో మాట్లాడటం సరికాదు. సమస్యపైనే దృష్టిపెట్టాలి. ఎదుటివారు అరుస్తున్నట్లుగా మాట్లాడుతుంటే... మీరూ అదే అనుసరించొద్ధు కాసేపు మౌనంగా ఉండి... పరిష్కారం దిశగా ఆలోచించాలి. మీ బాధను తెలియజేయడమూ మరవొద్ధు ఒకసారి కాకపోయినా మరోసారి అర్థంచేసుకుంటారు. ఈ ప్రయత్నం ఆర్థిక వ్యవహారాల్లోనే కాదు... అన్నింటికీ ఉపయోగపడుతుంది.

నువ్వా... నేనా...

సాధారణంగా ఆర్థిక విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఇద్దరూ ‘నేను’ అనే ప్రస్తావన తెస్తారు తప్ప మనం అనే కోణంలో ఆలోచించరు. ఇదే వద్ధు మనం అని కలుపుకోవాలి. అది అనుబంధాన్ని పెంచుతుంది. చాలామంది భార్యాభర్తలు చర్చించుకోని విషయం లైంగికచర్య. ఈ విషయాన్ని చర్చించుకోరు. అది కూడా భావవ్యక్తీకరణ లోపంలో భాగమే అంటారు నిపుణులు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.