close

తాజా వార్తలు

స్వయం సమృద్ధ సర్వసత్తాక గ్రామం

‘పల్లె’వించిన జీవన రాగం

గ్రామం... పక్కాగృహాల్లేని కుటుంబాలు... మురుగుకాల్వల్లేక కంపుకొట్టే వీధులు... చదువుకోడానికి కిలోమీటర్ల దూరం  నడిచి వెళ్లే పిల్లలు, స్వయం ఉపాధి లేక వలస వెళ్లే యువకుల కళ్లల్లో నీళ్లు... చేలల్లో కరవు మొత్తంగా బతకడానికి చస్తున్న పల్లెలు.

గాంధీ కలలుగన్న గ్రామం...స్వగృహాలతో మనుషులకు భద్రత ప్రణాళికతో ఊరంతా శుభ్రత చదువుకోడానికి బడి... బతకడానికి ఉపాధి ముఖాల్లో సంతోషం.. కళ్లలో ధీమా మొత్తంగా స్వయం సమృద్ధ సర్వసత్తాక గ్రామం.

... ఇలాంటి ఓ గ్రామాన్నే కలగందో జంట. పన్నెండున్నర ఎకరాల్లో కళగా తీర్చిదిద్దుతోంది! చదివేద్దామా మరి..

ఉద్యోగం తృప్తి నివ్వలేదు. ఆరంకెల జీతంతో ఆనందం లేదు. ఉన్నఫలంగా ఉద్యోగం వదిలేశారు. దేశం మొత్తం తిరిగారు. మారుమూల పల్లెలు, గిరిజన ప్రాంతాలు చుట్టి వచ్చాడు. పతనమైన పల్లెలు... వ్యధా భరితమైన గ్రామాలు.. బాధల్లో ప్రజలు... మెదడంతా ఇవే ఆక్రమించాయి. కునుకులేకుండా చేశాయి. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎంతదూరంలో ఉందో గ్రహించారు. ఆయన అడుగుజాడల్లో నడవాలనుకున్నారు. మహాత్ముడి కల... కలగా మిగలకుండా.. కళగా మార్చాలని సంకల్పించారు వారు.... ఇది కల్యాణ చక్రవర్తి దంపతుల కథ. కల్యాణ చక్రవర్తి తండ్రి డాక్టర్‌ రాజారావు హిందూపురం ఎస్‌డీజీఎస్‌ కళాశాలలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌. తల్లి కృష్ణకుమారి విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు. చక్రవర్తి మల్టీనేషనల్‌ కంపెనీలో మేనేజర్‌ స్థాయిలో పనిచేశారు. అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చి గాంధీ కలలు నిజం చేసే పనిలో పడ్డారు. సహధర్మచారిణి శోభిత కూడా ఆయన బాటలోనే నడిచారు. 2010లో మొదలైన వీరి ప్రయాణం.... ఓ ఆదర్శ ప్రాయమైన గ్రామానికి రూపకల్పన చేస్తోంది.

ఎక్కడంటే...

అనంతపురం జిల్లాలో 166 గ్రామాలు తిరిగిన చక్రవర్తి చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామంలో ఉండాలనుకున్నారు. అక్కడ 12.50 ఎకరాలు కొన్నారు. ఈ ప్రదేశంలో ఒక సుసంపన్నమైన నమూనా గ్రామం నిర్మించాలనుకున్నారు. భార్య శోభిత ఆయన వెంటే ఉండి సహకరించారు. చక్రవర్తి భావాలు నచ్చి 11 మంది రైతులు ఆయనతో నడవడానికి ముందుకొచ్చారు. స్నేహితులు సాయం చేశారు. మనకు ఎలాంటి ఆలోచన ఉంటే... మన చుట్టూ అలాంటి వారే చేరతారు. అది చక్రవర్తి విషయంలో మరోసారి నిజమైంది. అలా అందరూ కలసి అనతి కాలంలోనే స్వయం సమృద్ధితో అలరారే పల్లెను సృష్టించారు.

ఆదర్శంగా..

ఒక గ్రామాన్ని నిర్మించాలంటే మాటలు కాదు. అక్కడి ఇళ్ల నిర్మాణానికి సున్నపు గారను ఉపయోగించారు. మట్టిని సంచుల్లో నింపి.. ప్రకృతి హితంగా గోడలు కట్టారు. దీనివల్ల గృహాలు ఎండాకాలంలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా ఉంటాయి. నీటి నిల్వ కోసం నీటికుంటలు తవ్వుకున్నారు. రసాయనాలతో కలుషితమైపోతున్న భూమిని రక్షించడానికి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. మొత్తం కుటుంబాలకు అవసరమైన పంటలన్నీ అక్కడే సాగుచేయించే దిశగా అడుగులు వేస్తున్నారు.

- అచ్యుత పవన్‌కుమార్‌, చిలమత్తూరు

స్వయం ఉపాధి

గ్రామంలో ఉండేవారికి వ్యవసాయమే కాకుండా స్వయం ఉపాధి మార్గాలు నేర్పుతున్నారు. సబ్బులు, వంటనూనెలు తయారు చేస్తున్నారు. బెంగళూరుకు సరఫరా చేస్తున్నారు. స్నేహితుల సహకారంతో ప్రకృతి హితమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారు చేయిస్తున్నారు. వీటిని గ్రామాల్లో మహిళలకు అందిస్తారు. పల్లెంటే పల్లేరు ముల్లు కాదు... పల్లెంటే... గుభాళించే మల్లె అని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు చక్రవర్తి, శోభిత దంపతులు.

 

చుట్టుపక్కల వారికీ ఆదర్శగ్రామం గురించి అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయంలో ప్రధాన సమస్య గిట్టుబాటు ధర... దీనికి సంబంధించి మార్కెట్‌ మెలకువలపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. ఎక్కడైనా మానవాళికి అవసరమైనవి నీరు, వైద్యం, భోజనం, ఇల్లు, దుస్తులు, విద్యుత్తు, సాంకేతికత, వర్తకం, విద్య, విపత్తు నిర్వహణ... ఈ పది అంశాల్లోనూ గ్రామాలు స్వయంగా ఎదగాలనేది మా లక్ష్యం.

- కళ్యాణ చక్రవర్తి

ప్రయోగాల బడి

టేకులోడు గ్రామంలో 8మంది పిల్లలను తీసుకొని ప్రయోగాత్మకంగా పాఠశాల నడుపుతున్నారు. చక్రవర్తికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్లు కూడా ఇదే పాఠశాలలో చదువుకుంటారు. ఆదర్శ గ్రామంలో మాయాబజార్‌ అనే ఒక ఇళ్లుంది. అదే వారి బడి. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు ఎలాంటి పనులు అయినా చేస్తూ చదువుకోవచ్చు. ఒత్తిడి ఉండదు. హోంవర్క్‌లు ఉండవు. పరీక్షలు పెట్టరు. సైన్స్‌, గణితం కచ్చితంగా నేర్పుతారు. వీటికంటే ముందు సమాజంలో విద్యార్థుల పాత్ర, సమాజానికి చేయాల్సిన పనుల గురించి వివరిస్తుంటారు. పౌరబాధ్యతలను చెబుతారు. ఉచితంగా విద్య బోధిస్తూ, భోజన వసతి కల్పించారు. పిల్లలతో వారంలో 498 విద్య ప్రధాన కృత్యాలు చేయిస్తారు. ప్రతి శనివారం పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారిలోని ప్రతిభను పరీక్షిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.