close

తాజా వార్తలు

‘కళ’కాలం తోడుగా... 

కన్నీటి వరదలోనూ హరికథార్చన!

ఒక్కోసారి కష్టాలు భయపెడుతుంటాయి...తట్టుకోలేనంత...కన్నీళ్లు వర్షిస్తాయి... గుండెకు గండిపడేటంత... మనిషి ఆత్మస్థైర్యాన్ని సైతం మింగేసేలా  కష్టాల కడలి విరుచుకుపడితే... బయటపడడం సాధ్యమయ్యే పనేనా?కానీ ఆ దంపతులకు కళ వారికి తోడుగా నిలిస్తే... వారు కళకు నీడగా మారారు. కష్టాల్లో, కన్నీళ్లలో, బాధల్లో... చివరకు వ్యాధుల్లో కూడా వారు దాన్నే నమ్ముకున్నారు...

ఈ చిత్రాన్ని చూడండి... తుప్పు పట్టిన సైకిల్‌... వెనుక రెండు కుర్చీలు... ముతక చీర.... పచ్చటి శాలువాను ధరించి హుందాగా నడిచొస్తున్న ఈ వృద్ధ దంపతులు జీవితాన్ని చదివారు... కష్టాల కడలిని పట్టుదలతో ఈదారు... నేర్చుకున్న కళనే నావగా చేసుకొని తుపానుకు ఎదురెళ్లారు... కడుపు కోత సృష్టించిన సునామీని ఓర్చుకున్నారు.. నమ్ముకున్న కళను మరింత మందికి చేరువ చేసే పనిలో పడ్డారు.

జాగర్లపూడి నాగేశ్వరశర్మ భగవాతార్‌ వయసు 78. ఆయన భార్య భ్రమరాంబ వయసు 69. వీరికి పెళ్లయి 45 ఏళ్లు. తిరుపతి భవానీనగర్‌లో ఇద్దరు మనుషులు మాత్రమే పట్టేంత చిన్న ఇల్లు వీరిది. పూర్వీకుల నుంచి హరికథాగానం చేయడాన్ని వారసత్వ వృత్తిగా తీసుకున్న నాగేశ్వరశర్మ 12వ ఏట నుంచే పురాణాలు, ఇతిహాసాలను అద్బుతంగా గానం చేసేవారు. 1960, 70 దశకాల్లో హరికథ కళకు మంచి ప్రాచుర్యలో ఉండటంతో ఆయనకు తీరికే ఉండేది కాదు. తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్‌ అంతటా, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శనలిచ్చేవారు. ఎన్నో సత్కారాలు, మరెన్నో సన్మానాలు, అవార్డులను అందుకున్నారు. 
 

అప్పుడో పిడుగు పాటు... 
నాగేశ్వరశర్మ, భ్రమరాంబ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు వెంకట సుబ్రహ్మణ్యం. రెండో కుమారుడు విరూపాక్షుడు. ఉరుము లేని పిడుగులా ఓ రోజు సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం లేకుండా జరిగిన ఈ విషాదం కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఆ తర్వాత సంవత్సరమే రెండో కొడుకు 17 ఏళ్ల విరూపాక్షుడు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ రెండు సంఘటనలతో వారు నాగేశ్వరశర్మ, భ్రమరాంబ మూడేళ్ల పాటు సాధారణ మనుషులు కాలేకపోయారు. ఆదరించే వారు, కనీసం అన్నం పెట్టేవారు కూడా లేక అల్లాడిపోయారు.

‘‘కళ’’కాలం తోడుగా..:  నాగేశ్వరశర్మ దగ్గరకు సుదీర్ఘకాలం తర్వాత ఓ మిత్రుడు ఇంటికి వచ్చాడు. ఓ సలహా ఇచ్చాడు. కళలను నీ కోసం, నీ ప్రయోజనం కోసం ప్రదర్శించడం కాదు. దానికి అంకితం కావాలి... నీవు బతికున్నంత వరకు దాన్ని కూడా బతికించాలి... అన్న మాటతో మళ్లీ కార్యోన్ముఖులయ్యారు. ఈ సారి ఆయనకు సహాయంగా ఆయన భార్య భ్రమరాంబ కూడా వచ్చారు. మళ్లీ కాళ్లకు గజ్జెలు, చేతిలో చిడతలతో.. హరికథాగానం చేసేందుకు సమాయత్తమయ్యారు. కొన్నిరోజుల పాటు తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, మంచినీళ్లగుంట శివాలయం ప్రాంతాల్లో హరికథలు చెప్పారు. 
కానీ కష్టాలు ఈ దంపతుల్ని తరుముతూనే ఉన్నాయి. నాగేశ్వరశర్మకు ఆరోగ్యం దెబ్బతింది. ఆయన కంటిచూపు బాగా మందగించింది. వినికిడి లోపం ఎక్కువయింది. భ్రమరాంబ సాయం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. దీంతో హరికథాగానం బయట చెప్పడం ఆగిపోయింది. ఓ పక్క ఆస్పత్రులకు,  మరోపక్క బతుకు బండి నడిపేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉన్నా ఆ దంపతులు కళను మాత్రమే నమ్ముకున్నారు.

నడివీధిలోనే హరికథాగానం... 
తిరుపతి టీనగర్‌లోని నడివీధి గంగమ్మ ఆలయం వారికి వేదిక అయింది. నడిరోడ్డుపైనే ఉండే ఈ ఆలయం వద్ద హరికథను చెప్పడం మొదలుపెట్టారు. ఆయనకు తోడుగా, నీడగా భ్రమరాంబ సైతం ఆయనతోనే ఉంటారు. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భార్యాభర్తలిద్దరూ తుప్పుపట్టిన సైకిల్‌పై రెండు కుర్చీలను తగిలించుకొని... హరికథాగానం చేసే బట్టలు వేసుకొని నడివీధిలోకి వస్తారు. అక్కడే  ఆలయం వద్ద ఉన్న మైక్‌సెట్‌ను అందుకొని... నిర్విరామంగా 3 గంటల సేపు హరికథను చెబుతారు. 12 సంవత్సరాలుగా వారి లోకం అదే. అప్పటి నుంచి  ఈ కళార్చన నిర్విరామంగా సాగుతూనే ఉంది.

నాగేశ్వరశర్మకు ఒకప్పుడు అభిమానసంఘాలుండేవి. స్వాగతాలు, సత్కారాలు, సన్మానాలకు కొదవే ఉండేది కాదు. అయితే ఇప్పుడు నడివీధిలో ఆయన చెప్పే హరికథను వినేందుకు ఎవరూ ఆగరు. అయినా నాగేశ్వరశర్మ ఎక్కడా తగ్గరు. చిన్న కథానికను అద్భుతంగా, ఆటంకాలు లేకుండా ఏకధాటిగా చెబుతారు. ఎంత సంప్రదాయబద్ధంగా హరికథను మొదలుపెడతారో... అంతే హుందాగా దాన్ని ముగిస్తారు కళ కోసం తపించే వీరి పట్టుదల చూసి... దారిన పోయే వారు ఇచ్చే పదో, పాతికో ఇంటికి ఖర్చులకు ఉపయోగించుకుంటున్నారు. అసలు రూపాయి కూడా రాని రోజులు అనేకం. పస్తులు పడుకున్న రోజులెన్నో... అయినా వీరేమీ మదనపడిపోరు... బెంగపడిపోరు.... చీకటి తర్వాత వెలుగొస్తుంది... అని ఆశగా ఎదురుచూస్తూ... కొత్త కథానికను ఎంచుకొని.... హరిలో రంగహరి... అని చెప్పేందుకు సిద్ధమవుతారు.

- మావూరి శివ, ఎన్‌.హరిగంగాధర్‌, తిరుపతి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.