close

తాజా వార్తలు

సమవాదం... అందరి వేదం

గోదారి ఒడ్డునున్న ఆ భవనం వేదఘోషతో మార్మోగుతుంటుంది.  ఎవరో పండితులు మంత్రోచ్ఛరణ చేస్తున్నారనుకుంటే పొరపాటుపడినట్లే. ఎందుకంటే అక్కడ వేదం పఠిస్తోంది సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన సాధారణ పిల్లలు. వల్లెవేయిస్తోంది వడ్రంగి పనిచేసుకుంటూ సామాన్య జీవనం సాగించే ఓ వ్యక్తి.  పద్దెనిమిదేళ్లు అహర్నిశలు కృషి చేసి వేదాలను ఔపోసన పట్టిన కాకినాడకు చెందిన మల్లాడి వసంతరావు అందరికీ వేదం అనే నినాదంతో ముందడుగు వేస్తున్నారు. యానాంలో స్వధర్మ ప్రచార కేంద్రం పేరిట వేద పాఠశాలను నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలేంటీ వేదనాదం అంటే... ఇలా వివరిస్తున్నారు...

‘‘ఏం జోకులేస్తున్నావా? నువ్వేంటి?... వేదం నేర్చుకోవడమేంటి?  అని తేలిగ్గ్గా తీసిపడేసిన వాళ్లున్నారు... నువ్వు చేసే పని ఏంటి...  నువ్వు చేయాలనుకుంటున్నదేంటి? అని కోప్పడ్డవాళ్లూ ఉన్నారు.

కానీ ఇవేవీ నా సంకల్పాన్ని మార్చలేదు. ఓ వైపు వడ్రంగి పనిచేసుకుంటూనే గురువు రామానుజాచార్యుల వారి వద్ద  శిష్యుడిగా చేరి పద్దెనిమిది సంవత్సరాలు వేదాలు నేర్చుకున్నా. కొందరికే పరిమితమైన వేదాలను అతిసామాన్యుల చెంతకూ చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకొని గ్రామాల్లో ప్రవచనాలు చెప్పడం ప్రారంభించా. అలా 2005 నుంచి 2012 వరకు అనేక గ్రామాలు తిరుగుతూ ప్రవచనాలు చేప్పేవాణ్ని. అదే ఏడాది యానాంలోని అయ్యన్ననగర్‌లో ఓ ఇంటి మేడపై సుమారు వంద మంది పిల్లలతో వేదపాఠశాల ప్రారంభించా. మొదట్లో హేళన చేసినవారే ఇప్పుడు మంచిపని చేస్తున్నావ్‌ అంటూ మెచ్చుకుంటున్నారు.

ఆ మాటలే స్ఫూర్తిగా..!
‘‘దేశానికి, ధర్మానికి పనికిరాని దేహం వృథా’’ అన్న స్వామి పరిపూర్ణానంద మాటలు నన్ను కదిలించాయి. అప్పటి నుంచే ధర్మపరిరక్షణలో నేనూ భాగస్వామిని కావాలనుకున్నా. దానికి పిల్లల బాల్యంలో బీజం వేయడమే సరైందని భావించి ప్రవచనాలతో పాటు వేదపాఠశాలపై దృష్టి సారించా. ప్రవచనాలకు వచ్చిన వారు, స్ధానికులు కొంత డబ్బు వేసుకొని ఈ పాఠశాల స్థలం కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వ నిధులతో భవనం నిర్మించారు. నాకు స్ఫూర్తినిచ్చిన స్వామీజీ చేతుల మీదుగానే వేదపాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ పాఠశాల వల్ల పిల్లల నడవడికలో మార్పు వచ్చింది. అప్పటి వరకూ అల్లరిచిల్లరగా తిరిగిన ఆ చిన్నారులే నేడు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? పెద్దలతో ఎలా మసలుకోవాలి? సమాజంలో మన నడవడిక ఎలా ఉండాలనే అంశాలపై వారికి ఇక్కడ మార్గనిర్దేశనం చేస్తున్నాం.  అనైక్యత నుంచి ఐక్యత వైపు, అశాంతి నుంచి శాంతి వైపు సమాజం నడిచేలా చేయటమే మా పాఠశాల ఉద్దేశం.

అందరూ ఒక్కటే..!
స్వధర్మ వేదపాఠశాలలో చేరిన పిల్లలంతా అతి సామాన్యమైనవారే. ప్రస్తుతం 200 మందికి పైగా చిన్నారులు, 60మంది స్త్రీ, పురుషులకు వేదం నేర్పిస్తున్నా. చిన్నాపెద్దా తేడా లేకుండా కులం అడ్డుగోడలు లేకుండా అందరూ సమానస్థాయిలో వేదాలు వల్లెవేస్తున్నారు. పిల్లలు వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే చతుర్వేదాలను శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వీరంతా వైదిక కార్యక్రమాలు చేయగలిగేలా బోధన కొనసాగుతోంది. ఉచితంగా తమ పిల్లలకు సనాతన ధర్మంపై శిక్షణనిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వేరే వటవృక్షం అయిందన్నట్లుగా బలమైన సంకల్పంతో ప్రారంభమైన వేదపాఠశాల కార్యక్రమాలు నేడు చుట్టుపక్కల గ్రామాల్లోనూ విస్తరించాయి. యానాం పరిసరాల్లోని సుమారు పదహారు గ్రామాల్లో వేదాభ్యాసం ప్రారంభమైంది. తమ గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాలు చేపట్టాలని వినతులు వస్తున్నాయి. వేదపాఠశాలలో మూడు రకాలుగా శిక్షణ ఉంటుంది. శుక్రవారం పెద్దలకు, శనివారం మహిళలు, పురుషులకు, ఆదివారం పిల్లలకు అభ్యాసం చేయిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న వారు వారివారి గ్రామాల్లో వేదాభ్యాసం చేయిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరినుంచి సామాన్యులందరికీ ధార్మిక ఆలోచన అందించాలన్నదే నా ఆశయం’’ అంటున్నారు మల్లాడి వసంతరావు.

- మోడెం రఘుమాధవ్‌.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.