close

తాజా వార్తలు

అన్నాహజారే ప్రాణాలను కాపాడండి

భాజపాపై శివసేన, ఎమ్‌ఎన్‌ఎస్‌ విమర్శలు‌

ముంబయి (మహారాష్ట్ర): లోక్‌పాల్‌, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తన సొంత గ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్షకు దిగిన సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రాణాలను కాపాడాలని శివసేన పార్టీ... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆయన దీక్ష ఆరో రోజుకి చేరిన నేపథ్యంలో దీనిపై తమ పార్టీ పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘మొదట అన్నాహజారే ప్రాణాలను కాపాడండి. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి ఆలోచించండి. ఈ పోరాటంలో ఆయన ప్రాణాలు పోవాలనే ప్రభుత్వం భావిస్తే, మన సంస్కృతి వ్యాధిగ్రస్తమైందని భావించాలి. ఆయన లోక్‌పాల్, లోకాయుక్తా, రైతుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి ఆయనకు ఓ లేఖ వచ్చింది. ఆయన అమరుడయ్యేవరకు దీక్ష కొనసాగించాలని తాము కోరుకుంటున్నట్లుగా అందులో ఉంది’ అని పేర్కొంది. హజారే దీక్షకు మీడియా ద్వారా ప్రచారం జరగకుండా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని శివసేన ఆరోపించింది. ‘గతంలోలా హజారే దీక్షపై ప్రచారం జరిగితే, దేశ వ్యాప్తంగా ప్రజల్లో కదలికలు వచ్చేవి. ఆయన దీక్షపై ప్రచారం జరగకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొంది.

హజారేను కలిసిన రాజ్‌ ఠాక్రే, రాజేంద్ర సింగ్‌
అన్నాహజారేను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్‌ సోమవారం కలిశారు. ఆయన పోరాటానికి తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని, నిరుపయోగ భాజపా ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవట్లేదని ఠాక్రే అన్నారు. హజారే ప్రాణాన్ని త్యాగం చేయొద్దని, దీక్ష విరమించి తమతో కలిసి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ తమ ఎన్నికల మేనిఫెస్టోను కూడా అమలు చేయట్లేదని ఆయన విమర్శించారు. ‘ఎన్నికలకు ముందు హజారేపై నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చాలా నిజాయతీ పరుడని, ఉన్నత విలువలు గల వ్యక్తని అన్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లయినప్పటికీ ఇప్పటికీ హజారే డిమాండ్‌లను నెరవేర్చలేదు. హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే భాజపా 2014 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఆయన దీక్షకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మద్దతు తెలపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హజారే వల్లే కేజ్రీవాల్‌ ఎవరో దేశానికి తెలిసింది. ఆయన కనీసం ఇక్కడకు వచ్చి హజారే ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకోవట్లేదు’ అని ఆయన విమర్శించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.