close

తాజా వార్తలు

భ్రమరమై తల్లి ప్రణవమై తండ్రి 

ఫిబ్రవరి 25 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమఃశివాయ

అయ్యవారు ఇక్కడ వెలిశారు. 
అమ్మ కూడా ఇక్కడే ఉంది. 
ఇక లేనిదేముంటుంది. 
ఈ కొండపై ఝుంకార నాదం చేస్తూ జగన్మాత అసుర సంహారం చేస్తే... నా కొలువూ ఇక్కడేనంటూ నీలకంఠుడు తరలివచ్చాడు... 
అందుకే శ్రీశైలం మహా క్షేత్రమైంది. మహోజ్వల శక్తిపాతానికి పీఠమైంది.

పరతత్త్వ స్వరూపుడైన పరమ శివుడు తన ఆత్మజ్యోతిని ఉద్భవింపజేసి వెలసిన క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. జగన్మాత  స్వయంభువుగా వెలసినవి అష్టాదశ శక్తి పీఠాలు. 
పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండోది... 
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరోది... 
ఇలలో వెలిసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ శైలం శ్రీశైలం. 
ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతల సమాహారం... మరెన్నో విశేషాలకు ఆలవాలం.

శ్రీశైలం మహాక్షేత్రం. స్వయం శక్తి సమన్వితం. ఇక్కడ ఉద్భవించే శక్తి నలుదిక్కులకూ వెదజల్లుతుందని మహర్షులు దర్శించారు. స్కాంద పురాణంలోని శ్రీపర్వత ఖండం శ్రీశైలాన్ని అష్టదళపద్మం అని వర్ణించింది.  అంటే ఎనిమిది రేకలున్న పద్మం అని అర్థం. ఎనిమిది దళాలు ద్వారాలు, ఉపద్వారాలుగా, పద్మానికి మధ్యలో ఉన్న కర్ణిక శ్రీశైలంగా భావిస్తారు. నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వార క్షేత్రాలు, నాలుగు మూలల్లో ఉన్న ఉప ద్వారాల్లోనూ ఉన్న క్షేత్రాలకు శ్రీశైలం శక్తి కేంద్రంగా ఉంది. ద్వారక్షేత్రాలుగా త్రిపురాంతకం, జ్యోతి సిద్ధవటం, అలంపురం, ఉమామహేశ్వరం ఉండగా... ఉప ద్వారాలుగా సోమశిల, పుష్పగిరి, సంగమేశ్వరం, ఏలేశ్వరం విరాజిల్లుతున్నాయి. ఈ విధంగా శ్రీశైల మహాక్షేత్రం ముప్ఫై ఆమడల పొడవు, ముప్ఫై ఆమడల వెడల్పు విస్తరించిందని పురాణాలు పేర్కొన్నాయి. ముప్ఫై ఆమడలు అంటే సుమారు 384 కిలోమీటర్లు.

శనగల బసవన్న ఎవరు? 
* గర్భాలయంలో కొలువుదీరిన స్వామి వారికి ఎదురుగా ఉన్న నందీశ్వరునికి శనగల బసవన్న అని పేరు. నందికి శనగలు ప్రియమైనవి. అందువల్ల భక్తులు గుడ్డలో శనగలు ఉంచి నంది మూతికి కడతారు. అందువల్ల శనగల బసవన్న అని పేరు వచ్చిందంటారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత భక్తులు ఈ నందీశ్వరుని చెన్నుకల్లు బసవన్న అని పిలిచేవారు. ఆ పేరు కాలక్రమంలో శనగల బసవన్న అయి ఉంటుందని చెబుతారు.

చెంచుల అల్లుడుగారు 
*  శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాలన్నీ చెంచుల ఆవాసాలే. వారికి, స్వామివారికి విడదీయరాని సంబంధం ఉంది. దానికి సంబంధించి ఓ గాథ చెబుతారు. పూర్వం మహీశురుడనే రాజు కుమార్తె శివుడిని వివాహం చేసుకోవాలనే కోరికతో ఇక్కడ తపస్సు చేసింది. ఆమె మల్లె పొదల్లో తనస్సు చేస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలోని చెంచులు ఆమెకు సపర్యలు చేస్తూ కూతురిలా చూసుకున్నారు. తర్వాత వృద్ధుడి రూపంలో శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్లి చేసుకోగా, చెంచులు ఉత్సవం చేశారు. స్వామిని అల్లుడిగా భావించి సపర్యలు చేశారు. అప్పటి నుంచి ఈ స్వామిని చెంచులు తమ అల్లుడుగా, చెవిటి మల్లయ్యగా ముసలిమల్లయ్యగా కొలుచుకుంటారు. ఆయన కొలువున్న ఆలయమే ప్రధాన ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఒకటైన వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం. ఇందులోని లింగం పెద్దగా ఉంటుంది. కానీ నునుపుగా ఉండదు. ముసలితనానికి నిదర్శనంగా గుంతలు, ముడతలుగా ఉంటుంది. దట్టమైన అరణ్యంలో తొలి నుంచీ చెంచులు భక్తులకు తోడు, నీడగా ఉండి  సహకరించేవారు.

ధూళితో దర్శనం 
* మల్లికార్జునస్వామి వారిని ధూళిదర్ళనం చేసుకోవడం ఆచారం. అంటే శ్రీశైలం చేరుకున్న భక్తులు స్నానం కూడా చేయకుండా, వచ్చిన దుస్తుల్లోనే ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవడం. ఇది అత్యంత ప్రాచీనకాలం నుంచి అమల్లో ఉంది. పూర్వం రవాణా సౌకర్యాలు లేని సమయంలో ఎన్నో వ్యయప్రయాసలు పడి శ్రీశైలం వచ్చిన భక్తులు అలాగే స్వామి వద్దకు వెళ్లేవారు. కృష్ణానది ఎంతో లోతులో ఉండడం, అక్కడకు వెళ్లి స్నానం చేసిరావడం కష్టం కావడం కూడా కారణం అయిఉండవచ్చని చెబుతారు. 
 ఆదిదంపతులకు సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతల్లో ఒకరైన చండీశ్వరుని నేతృత్వంలో ఇవి జరుగుతాయని చెబుతారు. ఈఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7 వరకు ఇవి జరగనున్నాయి. 
ఈనెల 25 -ధ్వజారోహణం 
26 - భృంగివాహన సేవ 
27  - హంసవాహనం 
28- మయూరవాహనం 
01 - రావణవాహనం 
02- పుష్ప పల్లకీ సేవ 
03- గజవాహనం 
04- మహా శివరాత్రి, ప్రభోత్సవం, నందివాహనం 
05- రథోత్సవం

* శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యాన్ని పద్మ, మత్య, అగ్ని, ఆదిత్య, మార్కండేయ, వాయు, దేవీ పురాణాలతో పాటు ఆది శంకరుల శివానందలహరి, సిద్ధనాథుడి రసరత్నాకరం, భవభూతి మాలతీ మాధవం, బాణభట్టుని కాదంబరి, హర్షవర్ధనుడి రత్నావళి వంటి సంస్కృత రచనలు విస్తారంగా వివరించాయి. తెలుగు సాహిత్యంలో నన్నయ మహాభారతం, నన్నెచోడుడి కుమార సంభవం, మల్లికార్జున పండితుడి అక్షరాంకగద్య, పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్యుడి చరిత్ర, శ్రీనాథుడి కాశీఖండం, బమ్మెరపోతన శ్రీమద్భాగవతం, ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యం వంటి వాటిలో ఈ అద్భుత స్థలం గురించి వర్ణించారు. చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ రచనల్లో శ్రీశైలం ప్రస్తావన ఉంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైల మల్లన్నను సేవించాడని, శ్రీశైలం అతని పూజా మందిరమని, అహోబిలం సభా మండపమని పురాణాలు చెబుతున్నాయి.

* శ్రీశైల క్షేత్రాన్ని వివిధ కాలాల్లో వివిధ పేర్లతో పిలిచారు. క్రీ.శ 2వ శతాబ్ధం నాటి శాతవాహనుల నాసిక్‌ శాసనంలో పేర్కొన సిరితనే శ్రీశైలమని చరిత్రకారులు  గుర్తించారు. సిరిపబ్బతం, శ్రీపర్వతం, శ్రీనగం, శ్రీగిరి ఇవన్నీ ఈ క్షేత్రం పేర్లే. 
* సాధారణంగా పువ్వును స్త్రీకి ప్రతీకగా, దానిపై వాలే తుమ్మెదను పురుషుడికి ప్రతీకగా చెబుతారు. అయితే శ్రీశైలంలో పురమశివుడు మల్లికార్జునుడు, అమ్మవారు భ్రమరాంబ అయ్యారు. ఆది దంపతుల మధ్య అభేదానికి ఇది అద్భుతమైన సూచిక.

* పూజలు, వ్రతాల సమయంలో జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే... అంటూ తమ ఉనికిని శ్రీశైల క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెబుతారు. అత్యంత ప్రాచీన కాలం నుంచి ఈ క్షేత్రం ఉంది. భూమండలానికి ఇది నాభి స్థానంగా చెబుతారు. 
* చుట్టూ నాలుగు గోపురాలతో, కోట గోడల్లాంటి ఎత్తైన ప్రాకారాలతో 2,79,300 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న విశాల ప్రాంగణంలో ఆలయం ఉంది. ఆలయ ప్రాకారం 2121 అడుగుల పొడవుతో దాదాపు 20 అడుగుల ఎత్తుతో నిర్మించారు.  తూర్పు ద్వారంలోని ప్రధాన గోపురాన్ని కృష్ణదేవరాయ గోపురం  అంటారు. దక్షిణ గోపురానికి హరిహరరాయ గోపురం, ఉత్తరాన శివాజీ గోపురం, పశ్చిమ గోపురానికి బ్రహ్మానందరాయ గోపురం అని పేరు.  

దత్త తపోస్థలి 

శ్రీశైలం సిద్ధక్షేత్రం. ఇక్కడ ఎందరో తపోధనులు నిరంతర తపస్సమాధిలో మునిగి ఉంటారని చెబుతారు. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయులు కూడా ఇక్కడే తపోసిద్ధి పొందినట్లు నమ్ముతారు శ్రీశైల ప్రాంగణంలో వృద్ధ మల్లికార్జునస్వామి ఆలయానికి పక్కన ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది. దాన్ని త్రిఫలవృక్షం అని కూడా పిలుస్తారు. మేడి, రావి, జువ్వి చెట్లు కలిసి ఒకే వృక్షంగా రూపొందాయి. మేడి బ్రహ్మ స్వరూపంగా, రావి విష్ణు రూపంగా, జువ్వి శివ స్వరూపంగా... మొత్తంమీద  ఈ వృక్షం త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకుంటోంది. దత్తాత్రేయస్వామి ఈ చెట్టు కింద తపస్సు చేసినట్లు చెబుతారు. దత్తావతారమైన నృసింహ సరస్వతిస్వామి శ్రీశైలం వచ్చి ఇక్కడి కదళీవనంలో తపస్సు చేశారు. ఒకరోజు అరటి ఆకులతో చేసిన ఆసనంపై కూర్చుని కృష్ణానదిలో పయనించి శిష్యులు చూస్తుండగానే అంతర్ధానమైనట్లు చెబుతారు. ఆయన అవతార పరిసమాప్తి జరిగిన శ్రీశైలం దత్తభక్తులకు చాలా ముఖ్యమైన క్షేత్రంగా ఉంది.

ఆమె హ్రీంకారం... 

పరబ్రహ్మను తెలుసుకోవడమే యోగులు, సాధకుల జీవిత పరమావధి. బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు లౌకికంగా ఏర్పడే భ్రమలను తొలగించుకోవాలి. మనసుకంటిన ఆ భ్రమలను తొలగించుకోడానికి భ్రామరీదేవి తత్త్వం మార్గం ,చూపుతుంది. భ్రమరాంబదేవి శ్రీశైల పురాధీశ్వరి. అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి ఆమె అవతరించింది. అరుణాసురుడు నిజానికి జపతప నిష్ఠుడే. కానీ ఆయన పనులు మాత్రం ముల్లోకాలకూ బాధ కలిగించేవి. దాన్ని పోగొట్టి లోకశాంతిని కలిగించాలని దేవతలంతా ఆ పరమేశ్వరిని కోరారు. లోకంలోని సౌందర్యమంతా రాశి పోసినట్లు ఆ మంగళకారిణి దేవతల ముందు అవతరించింది. ఆ తల్లి చుట్టూ అసంఖ్యాకంగా తుమ్మెదల గుంపు ఆవరించింది. హ్రీంకార ధ్వనులు చేస్తున్న ఆ భ్రమరశక్తి అరుణాసురుణ్ణి తుద ముట్టించింది. హ్రీంకారం అనేది మాయాశక్తి బీజాక్షరం.  పరమాత్మ అన్వేషణకు ఇది దారిచూపుతుంది. భ్రామరి అనేది శ్రీశైల భ్రమరాంబను ఉపాసించే ఓ తంత్ర విద్యగా కూడా చెబుతారు.  మల్లికార్జునస్వామి వారి ఆలయానికి వెనకవైపు కొంత ఎత్తులో స్వామి వారి దేవేరి అష్టాదశ శక్తుల్లో ఒకరైన భ్రమరాంబాదేవిగా వెలసి ఉంది. గర్భాలయంలో నిలుచున్న భంగిమలో ఉన్న అమ్మవారు అలంకారం వల్ల కూర్చున్నట్లు దర్శనమిస్తుంటారు.

-ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు, డా.యల్లాప్రగడ మల్లికార్జునరావు, జె.వెంకటేశ్వర్లు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.