close

తాజా వార్తలు

మిషన్‌ శక్తి అంటే ఏమిటి?.. ఇప్పుడే ఎందుకు?

దిల్లీ : అంతరిక్షంలో భారత్‌ మరో అద్భుతం సాధించింది. తక్కువ ఎత్తు కక్ష్యలో ఉన్న శాటిలైట్‌ను ఏ-శాట్‌తో కూల్చి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా కీర్తి గడించింది. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ వెల్లడించారు. అంతరిక్ష యాత్రలో భారత సాధించిన ఘనతను ప్రజలకు వివరించారు.  

ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత యాంటీ శాటిలైట్‌ పరీక్షను విజయవంతంగా చేపట్టిన దేశంగా భారత్‌కు గుర్తింపు దక్కింది. ఏ-శాట్‌ మిషన్‌ భూమికి అతిసమీక్ష కక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్‌ను మూడు నిమిషాల్లోనే విజయవంతంగా  కూల్చివేసింది. మోదీ ప్రసంగం అనంతరం ‘మిషన్‌ శక్తి’కి సంబంధించిన వివరాల కోసం చాలా మంది శోధించడం ప్రారంభించారు.  ఏమిటీ ప్రయోగం?.. ఎందుకు చేపట్టారు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పలు వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలముందుంచింది.

అసలు ఏమిటీ ప్రయోగం?
మార్చి 27, 2019న భారత్‌ యాంటీ శాటిలైట్‌ క్షిపణి ప్రయోగమైన ‘మిషన్‌ శక్తి’ని అబ్దుల్‌ కలామ్‌ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించింది. దీన్ని డీఆర్‌డీఓ నిర్వహించింది.  ఇది పూర్తిగా విజయవంతమై తనకు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించింది. పూర్తి స్వదేశీ సాంకేతికత సాయంతోనే భారత్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఏ శాటిలైట్‌ను వినియోగించారు?
శాటిలైట్‌ పేరును ఎక్కడా పేర్కొనలేదు. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతున్న భారత శాటిలైట్‌ను ఈ ప్రయోగం కోసం వినియోగించారు. 

ఏ క్షిపణిని ఉపయోగించారు?
డీఆర్‌డీవోకు చెందిన బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ ఇంటర్‌సెప్టర్‌ను ఇందు కోసం వినియోగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ ప్రోగామ్‌లో భాగంగా దీన్ని చేపట్టారు.

దీని వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఏమైనా ఏర్పడ్డాయా?
తక్కువ ఎత్తులోనే ఈ ప్రయోగం చేపట్టడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఏర్పడవు. ఏవైనా ఏర్పడితే అవి వాతావరణ ఘర్షణలో క్షీణించి కొన్ని వారాల్లోనే భూమిపైకి చేరుకుంటాయి.

భారత్‌ ఎందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించింది?
మన దేశం అంతరిక్ష యాత్రలో దూసుకుపోతూ అగ్ర దేశాల సరసన నిలుస్తోంది. గత ఐదేళ్లుగా తన ప్రయోగాలతో అంతరిక్షంలో విశేష కీర్తిని గడిస్తోంది. మంగళ్‌యాన్‌ను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. గగన్‌యాన్‌ ద్వారా అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మన అంతరిక్ష సంపదను సురక్షితంగా ఉంచే సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగాన్ని భారత్‌ చేపట్టింది.

ఈ ప్రయోగం ఇప్పుడే ఎందుకు?
ఈ మిషన్‌ విజయవంతమవడంపై పూర్తి నమ్మకం కలిగాకే  ఈ ప్రయోగాన్ని చేపట్టాం. జాతీయ భద్రతను పెంపొందించాలన్న భారత ఉద్దేశం కూడా ఇందులో కనిపిస్తోంది.

అంతరిక్ష యుద్ధంలోకి భారత్‌ దిగనుందా?
అంతరిక్ష యుద్ధంలోకి దిగాలన్న ఉద్దేశం భారత్‌కు ఎంతమాత్రం లేదు. భారత ప్రయోగాలు శాంతి పరిరక్షణ కోసమే. అంతరిక్షంలో ఆయుధాల వాడకానికి భారత్‌ వ్యతిరేకం.

అంతరిక్షంలో ఆయుధాలపై చట్టాలు ఏం చెబుతున్నాయి?
‘1967 ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ’ అనేది అంతరిక్ష చట్టాల్లో ప్రధాన అంతర్జాతీయ ఒప్పందం. ఈ ఒప్పందంపై భారత్‌ సంతకం చేసి 1982లో ఆమోదించింది. అంతరిక్షంలో సామూహిక వినాశనానికి ఆయుధాల వినియోగం ఈ ఒప్పందం ప్రకారం నిషేధం. భారత్‌ ఏ అంతర్జాతీయ చట్టాలను, ఒడంబడికలను ఉల్లంఘించలేదు.

ఏ దేశానికి వ్యతిరేకంగానైనా ఈ ప్రయోగాన్ని చేపట్టారా?
ఏ దేశానికీ వ్యతిరేకంగా ఈ ప్రయోగాన్ని చేపట్టలేదు. భారత అంతరిక్ష సామర్థ్యాలు ఏ దేశానికి బెదిరింపులుగా పరిగణించకూడదు. అదే సమయంలో భారత ప్రభుత్వం దేశ భద్రతకు కట్టుబడి ఉంది. అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.