close

తాజా వార్తలు

ఆర్టిస్ట్‌ను అవుదామనే ఇండస్ట్రీకి వచ్చా

షూటింగ్‌ అయ్యే వరకూ సన్నీలియోని ఎవరో నాకు తెలియదు

భయానికే భయం వేస్తే అతని ఫొటోను తలకింద పెట్టుకుని పడుకుంటుంది..
ధైర్యానికి ధైర్యం కావాలంటే అతని ఫొటోను చేత్తో పట్టుకుని తిరుగుతుంది..
ఆనందానికి ఆయుష్షు పెరగాలంటే అతని నవ్వుని తలుచుకుంటూ బతికేస్తుంది..
ఎందుకంటే అతను అలాంటి ఇలాంటి స్టార్‌ కాదు.. 
ఏ కాలంలోనైనా వేడి పుట్టించే బర్నింగ్‌ స్టార్‌.. సంపూర్ణేష్‌ బాబు..
ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

మీ అసలు పేరేంటి?
సంపూర్ణేష్‌ బాబు: నరసింహచారి. ఇండస్ట్రీకి ఒక కొత్త బాబు కావాలని దర్శకుడు స్టీఫెన్‌ శంకర్‌ ఆ పేరు పెట్టాడు. మొదట పరిపూర్ణేష్‌బాబు అనుకున్నాం. కానీ, దాన్ని సంపూర్ణేష్‌బాబుగా ఖరారు చేశారు. ‘హృదయకాలేయం’ సినిమా ప్రారంభించినప్పుడు అందరి పేర్లు మార్చుకున్నాం. మా దర్శకుడి అసలు పేరు సాయి రాజేష్‌ అయితే, స్టీఫెన్‌ శంకర్‌ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే సినిమా ఏదైనా తేడా కొడితే, ఎవరికీ దొరక్కూడదని. ఆ సినిమాకు పనిచేసిన కెమెరామెన్‌ పేరు రసూల్‌ కార్పెంటర్‌ అని పెట్టాడు.(నవ్వులు)
‘హృదయ కాలేయం’ హిట్‌ సినిమా.. ఎంత బడ్జెట్‌లో తీశారు. 
సంపూర్ణేష్‌ బాబు: దాదాపు రూ.80లక్షలు అయింది. కోటీ పాతిక లక్షలకు అమ్మేశాం. 
సినిమా చూసిన వాళ్లు ‘ఏంటి సర్‌ ఇంత ఆర్టిఫిషియల్‌గా తీశారు’ అని అడిగారా?
సంపూర్ణేష్‌ బాబు: ‘మీరేంటి.. మీ సినిమా ఏంటీ’ అంటూ తిట్టేవాళ్లు. మొదటి రెండు రోజులైతే తిట్లు భయంకరంగా ఉండేవి. ఆ తర్వాత నెమ్మదిగా అందరూ సినిమా బాగుందని, బాగా నవ్విస్తోందని మెచ్చుకున్నారు. అదే సమయంలో సోషల్‌మీడియాను బాగా వాడుకున్నాం. నా ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి. మా దర్శకుడు స్టీఫెన్‌ శంకర్‌ అందులో చాలా ఎక్స్‌పర్ట్‌. అసలు మొదట సినిమాను రూ.10లక్షల్లో తీద్దామని అనుకున్నాం. ట్రైలర్‌కు బాగా హైప్‌ రావడం వల్ల, దాన్ని నిలబెట్టుకోవడానికి అప్పటివరకూ తీసిందంతా పక్కనపెట్టేసి, మళ్లీ అంతా రీషూట్‌ చేశాం. అప్పుడే రాజమౌళిగారు మాకు సపోర్ట్‌గా ట్వీట్‌ చేయడం కొత్త బలాన్ని ఇచ్చింది. 
సినిమా విడుదలైన తర్వాత మిమ్మల్ని, దర్శకుడిని ఎవరో కొట్టారని వార్తలు వచ్చాయి. నిజమేనా?
సంపూర్ణేష్‌ బాబు: సినిమా విడుదలైన తర్వాత చిన్న పార్టీ చేసుకుందామని హోటల్‌కు వెళ్లాం. అక్కడెవరో కొందరు యువకులు తాగేసి మద్యం మత్తులో సినిమా గురించి అవహేళనగా మాట్లాడారు. మా దర్శకుడు సాయిరాజేష్‌కు కోపం వచ్చి, ‘మంచిగా మాట్లాడండి’ అని కాస్త గట్టిగా చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి, తోపులాట, ఘర్షణ జరిగింది. మరుసటి రోజు ఉదయం వాళ్లపై కేసు పెడదామని అనుకున్నాం. తీరాచూస్తే, వాళ్లు స్టూడెంట్లు. ‘రాత్రి మందులో తప్పుగా మాట్లాడాం అన్నా. సారీ’ అని చెప్పారు. సర్లే అని వదిలేశాం. 
2014లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కదా!
సంపూర్ణేష్‌ బాబు: 2013లో ట్రైలర్‌ రిలీజ్‌ చేశాం. 2014లో సినిమా విడుదలైంది. ఇండస్ట్రీ మొత్తానికి నా గురించి తెలిసి పోయింది. విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. 
‘హృదయకాలేయం’ మంచి విజయం సాధించింది. మరి మళ్లీ సినిమా తీసేటప్పుడు సందేశాత్మక చిత్రం తీయాలని అనిపించలేదా?
సంపూర్ణేష్‌ బాబు: అనిపించింది కానీ, అవకాశాలు రాలేదు. మధ్యలో ఒక సినిమా చేశాం. అది బాగా ఆలస్యం కావడం వల్ల పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ‘కొబ్బరిమట్ట’ తీస్తున్నాం.

దాదాపు మూడేళ్ల నుంచి ‘కొబ్బరిమట్ట’ తీస్తున్నారు కదా!
సంపూర్ణేష్‌ బాబు: ‘హృదయ కాలేయం’ విడుదల రోజే పోస్టర్‌ రిలీజ్‌ చేశాం. అదే బ్యానర్‌లో మరో సినిమా ఉందని ప్రేక్షకులకు చెప్పడానికి అలా చేశాం. అప్పటి నుంచి జనాలకు గుర్తుంది. మధ్యలో ఇతర సినిమాలు చేయడం వల్ల ఆలస్యమైంది. అది ఇటీవల పూర్తయింది. ఇందులో నావి మూడు పాత్రలు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు. రూ.కోటితో సినిమా చేయాలనుకున్నాం. కానీ, నేను మూడు పాత్రలు చేయడంతో బడ్జెట్‌ పెరిగిపోయింది. 
ఏమవుదామని ఇండస్ట్రీకి వచ్చారు?
సంపూర్ణేష్‌ బాబు: నేను ఆర్టిస్ట్‌ను అవుదామనే ఇండస్ట్రీకి వచ్చా. నాకు చిన్నప్పటి నుంచి డ్రామాలు వేయడమంటే ఇష్టం. మా ఊళ్లో డ్రామాలు వేయడం తక్కువ. అప్పట్లో నేను మోహన్‌బాబుగారి డైలాగ్‌లు ఆయన వాయిస్‌తో చెబుతుండేవాడిని. అలాగే ఎన్టీఆర్‌, శ్రీహరి ఇలా పలువురి గొంతులు మిమిక్రీ చేసేవాడిని. ఇలా సరాదాగా చేసిన గొంతులన్నీ ‘హృదయకాలేయం’ డబ్బింగ్‌ చెప్పేటప్పుడు బాగా ఇబ్బంది పెట్టేవి. సడెన్‌గా ఒక్కోసారి మోహన్‌బాబుగారి గొంతు వచ్చేసేది. అయితే, నేను వెండితెరపై మొదటిసారి కనిపించిన చిత్రం కృష్ణవంశీగారు తీసిన ‘మహాత్మ’. అందులో నాది చిన్న పాత్ర. 
‘హృదయ కాలేయం’ తర్వాత కామెడీ క్యారెక్టర్లు ఏమైనా వచ్చాయా?
సంపూర్ణేష్‌ బాబు: చాలా వచ్చాయి. దాదాపు అన్నీ చేశా. అయితే, పూరిజగన్నాథ్‌గారు ‘లోఫర్‌’లో ఆఫర్‌ ఇస్తే, చేయలేకపోయా. ఆ సమయంలో ‘కొబ్బరిమట్ట’ షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. అందుకే చేయలేకపోయా. ఆయనకు కోపం వచ్చింది. తిట్టారు కూడా. ఈ విషయంలో ఇప్పటికీ ఆయనకు సారీ చెబుతున్నా. 
సినిమా అవకాశం కోసం వెళ్తే, రూ.6లక్షలు డిమాండ్‌ చేశారట!
సంపూర్ణేష్‌ బాబు: ‘హృదయకాలేయం’ సినిమాకు ముందు జరిగిందీ ఘటన. ఒక ఆఫీస్‌కు వెళ్తే, ‘ఏం చేస్తారు’ అని అడిగారు. ‘బంగారం పనిచేస్తా’ అన్నా. అయితే, ‘ఫొటోషూట్‌ చేయాలి. స్క్రీన్‌ టెస్టులు చేయాలి. ఇంకా చాలా పనులుంటాయి. రూ.6లక్షలు అవుతుంది’ అన్నారు. నేను లలితా జ్యువెలరీ షాప్‌నకు ఓనర్‌ అనుకున్నారు వాళ్లు. నా వల్ల కాదని చెబితే, 50 పర్సంట్‌కు పడిపోయారు. మళ్లీ చెబుతాలే అని వచ్చేశా. రెండు మూడు రోజుల తర్వాత ఫోన్‌చేసి ‘చెప్పిన మొత్తంలో 25 పర్సంట్‌ ఇవ్వండి చాలు’ అన్నారు. ఆఖరికి ‘50వేలు ఇవ్వండి చాలు’ అన్నారు. ఇదేదో తేడా బేరం అని నాకు అర్థమైపోయింది. ఒక వేళ వాళ్లు నాకు మొదట చెప్పిన రూ.6లక్షల మాటపై ఉండి ఉంటే నమ్మేవాడిని. 

‘మహాత్మ’ చేసేటప్పుడు వడ వేయలేదని ప్రొడక్షన్‌ వాళ్లపై విసుక్కున్నారట. ఏంటా కథ?
సంపూర్ణేష్‌ బాబు: సుధీర్‌ అని మా సిద్ధిపేట అతనే నన్ను ఆ సినిమా షూటింగ్‌కు తీసుకెళ్లాడు. నేను ఎక్కడ ఆఫీస్‌లో ఫొటోలు ఇచ్చినా, తన నెంబరే ఇచ్చేవాడిని. బాగా పరిచయం. అలా ‘మహాత్మ’ షూటింగ్‌కు వెళ్లా. అక్కడ సెక్షన్ల వారీగా టిఫిన్‌ పెడతారు కదా! నేను కూడా వెళ్లి టిఫిన్‌ తిన్నా. ఇంకో వడ వేస్తారా? అని అడిగా. వెంటనే నా వెనకాలే ఉన్న సుధీర్‌ సీరియస్‌గా వచ్చి ‘పిచ్చా నీకేమైనా. వాళ్లకో లిమిట్‌ ఉంటుంది. వందమందికి వంద వడలు అని లెక్క ఉంటుంది. నువ్వు రెండు తింటే ఇంకొకడికి తినడానికి ఉండదు. ఎక్కువ తినాలనిపిస్తే, బయటకు వెళ్లి తినాలి’ అంటూ క్లాస్‌ పీకాడు. అప్పుడతను అలా కాస్త గట్టిగా మందలించడం నాకు చాలా సందర్భాల్లో కలిసొచ్చింది. అందరూ ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలో తెలిసింది. 
మీకు ఎంతమంది పిల్లలు?
సంపూర్ణేష్‌ బాబు: ఇద్దరు పాపలు. పెద్ద పాప ఏడో తరగతి. చిన్న పాప ఐదో తరగతి చదువుతోంది. 
‘నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసిన తలకుమాసిన వాడెవడు’ అని మీ వైఫ్‌ అడిగారట!
సంపూర్ణేష్‌ బాబు: అవును నిజంగా అడిగింది. అప్పటికే నాకొక పాప. నేను గోల్డ్‌షాప్‌లో వర్కర్‌ని. నెలకు రూ.15వేలు వచ్చేవి. సీజన్‌ ఉంటే రూ.30వేలు వచ్చేవి. ఒక్కో నెలలో ఏమీ వచ్చేవి కావు. నా లైఫ్‌ చాలా చిన్నది. ఒక స్కూటర్‌.. చిన్న షాప్‌.. దానికి నెలకు అద్దె రూ.2వేలు. ఉదయాన్నే లేచి టిఫిన్‌ చేసి, షాపుకెళ్లి పనిచేసుకోవడం.. సాయంత్రం ఇంటికి రావడం.. రోజూ జరిగేది ఇదే. హైదరాబాద్‌ వస్తే, ఒక ఐదారొందలు ఖర్చు అయ్యేవి. అదే పెద్ద ఖర్చు. సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో నేను యాక్ట్‌ చేసి, ఆ సీడీని సినిమా వాళ్లకు ఇస్తే, వాళ్లు చూసి ఆడిషన్‌కు పిలుస్తారని చిన్న ఆశ. కానీ, అది చేయడానికి కూడా డబ్బుల్లేవు. ఇలా జీవితం సాగుతున్న రోజుల్లో ‘హృదయకాలేయం’లో నటించే అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని నా భార్యకు చెప్పా. ‘నీకేమైనా పిచ్చా. నిజంగా సినిమా చేస్తారా?’ అన్నట్లుగా మాట్లాడింది. ఎందుకంటే అప్పటికే నాకు పెళ్లై, ఒక పాపకు తండ్రిని కూడా. నాతో ఎవరు సినిమా చేస్తారని తన భావన అంతే. అయితే, నన్ను పెట్టి సినిమా తీయడానికి మా దర్శకుడు నన్నేమీ డబ్బులు అడగలేదు సరికదా! నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవోనని తనే నాకు ఛార్జీలకు డబ్బులిచ్చేవాడు. 

మీ కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమేనని చెప్పారు కదా! మరి హుద్‌హుద్‌ వస్తే రూ.లక్ష విరాళం ఎందుకు ఇచ్చారు? ఇమేజ్‌ కోసమా?
సంపూర్ణేష్‌ బాబు: ఆ పరిస్థితుల్లో చాలా మంది హీరోలు భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు. నేను అంత ఇవ్వలేను. నా వంతుగా నేను కూడా ఏదో ఒక సాయం చేయాలని అనుకున్నా. మా దర్శకుడు సాయి రాజేష్‌ కూడా అదే చెప్పాడు. ఎందుకంటే నేను నటుడిగా మొదటిసారి వైజాగ్‌ వెళ్లినప్పుడు వాళ్లు చూపిన అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేకపోయినా, ఎలాగో కష్టపడి ఇచ్చాం. అప్పుడు నాకు అనిపించింది ఒక్కటే. బాగా డబ్బులు ఉన్నవాళ్లు ఎక్కువ ఇవ్వొచ్చు.. ఏమీ లేనివాళ్లు వాళ్లదగ్గర ఉన్న బట్టలు, వస్తువులు ఇవ్వొచ్చు.. అదీ కూడా లేని వాళ్లు విశాఖ ప్రజలకు వచ్చిన కష్టాన్ని చూసి ఒక కన్నీటి బొట్టు కార్చవచ్చు. అందుకే సీఎంను కలిసి సహాయనిధికి రూ.లక్ష ఇచ్చా. తమ్మారెడ్డి భరద్వాజగారు, నేను, మా దర్శకుడు సాయిరాజేష్‌.. చంద్రబాబునాయుడిగారిని కలిసి విరాళం ఇచ్చినప్పుడు ఆయన కూడా మెచ్చుకున్నారు. 
ప్రత్యేక హోదా కోసం వైజాగ్‌ వెళ్తే పోలీసుల అరెస్టు చేశారనుకుంటా?
సంపూర్ణేష్‌ బాబు: (నవ్వులు) అరెస్టు చేస్తారని అనుకోలేదు. ప్రత్యేకహోదా కోసం వాళ్లు పోరాటం చేస్తుంటే, మద్దతు తెలుపుదామని వెళ్లా. నాతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా వచ్చారు. బీచ్‌ రోడ్‌కు వెళ్లిన తర్వాత మీడియా వాళ్లతో మాట్లాడుతుంటే, పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఆ తర్వాత వదిలేస్తారేమోననుకున్నా, వన్‌టౌన్‌కు అక్కడి నుంచి టూటౌన్‌ ఇలా తిప్పుతూ ఉన్నారు. నాకేమో సాయంత్రం 5గంటలకు విమానం. మళ్లీ ఇంకో వాహనంలో ఎక్కించి, పద్మనాభపల్లె తీసుకెళ్లారు. అది విశాఖకు 70కి.మీ. దూరంలో ఉంది. ‘ఏంటి సర్‌ ఇక్కడకు తీసుకొచ్చారు’ అంటే ‘వెళ్లిపోదాం సర్‌’ అంటూ నా ఫోన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత సెల్‌లో వేశారు. నాకేమో అర్థం కాలేదు. ‘ఏంటి సర్‌ ఇది’ అని అడిగితే, ‘మీ మీద చాలా సీరియస్‌గా ఉన్నారు. మిమ్మల్ని విడిచి పెట్టవద్దని చెప్పారు’ అని అన్నారు. రాత్రి 7.30గం. తీసుకొచ్చి విమానాశ్రయంలో వదిలారు. మళ్లీ నేను, రాజేష్‌ అన్న, తమ్మారెడ్డి భరద్వాజగారు విమానం టికెట్లు కొనాల్సి వచ్చింది. అందుకే వైజాగ్‌ వాళ్లంటే నాకు అభిమానం.
మళ్లీ మొదటి సారి విమానం ఎక్కినప్పుడు ఆ టికెట్‌ దాచిపెట్టుకున్నారట!
సంపూర్ణేష్‌ బాబు: ఇప్పటికీ ఉంది. 2015లో ‘బందిపోటు’ షూటింగ్‌ కోసమని 15రోజులు రాజమండ్రి వెళ్లాం. వచ్చేటప్పుడు విమానంలో పంపారు. విమానం ఎక్కిన తర్వాత లోపల భయం పట్టుకుంది. ఇది కరెక్ట్‌గా దిగుతుందా? లేదా? అని గుండె దడదడలాడింది. 
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు సంపాదించింది ఏంటి? పోగొట్టుకున్నదేంటి?
సంపూర్ణేష్‌ బాబు: పోగొట్టుకున్నదేమీ లేదు. ‘హృదయ కాలేయం’ తర్వాత చిన్న చిన్న పాత్రలు వేశా.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాధపడిన సందర్భం ఉందా?
సంపూర్ణేష్‌ బాబు: అలా ఏమీలేదు. అయితే, వరుసగా పదిరోజులు షూటింగ్‌ చేసిన తర్వాత ఒక్కోసారి రెండు, మూడు నెలల పాటు ఏవీ ఉండేవి కావు. అప్పుడు ఊరికి వెళ్తే, ‘సినిమాలేమీ చేయడం లేదా. ఇక్కడే ఉంటున్నావ్‌’ అంటూ కాస్త అవహేళనగా మాట్లాడినప్పుడు బాధగా అనిపిస్తుంది. అయితే నేను సినిమా ఆఫీస్‌లకు వెళ్తే మాత్రం అందరూ మంచిగా మాట్లాడతారు. నాకు మంచి పాత్రలు ఇవ్వాలని అనుకుంటారు. 
సన్నీలియోని లవర్‌గా చేసినట్లు ఉన్నారు కదా! ఎలా అనిపించింది!
సంపూర్ణేష్‌ బాబు: మొదట్లో ఆమె ఎవరో నాకు అస్సలు తెలియదు. ‘కరెంట్‌ తీగ’లో వేషం ఉందని మోహన్‌బాబుగారు పిలిస్తే, వెళ్లా. ‘ఏమయ్యా! సన్నిలియోని ఎవరో తెలుసా’ అని అడిగారు. ‘తెలియదు గురువుగారు’ అన్నా. ‘ఇందులో నీ లవర్‌గా చేస్తోంది’ అని చెప్పారు. కేవలం ఒక్కరోజే షూటింగ్‌. ఆమెతో మాట్లాడానికి కూడా ఏం ఉంటుంది? షూటింగ్‌ అయిన తర్వాత అసలు ఆమె ఎవరో తెలిసింది. (నవ్వులు) అప్పటి నుంచి ఎక్కడి వెళ్లినా, ‘సన్నీలియోనితో నటించే ఛాన్స్‌ కొట్టేశావ్‌గా‌’ అంటూ ఆట పట్టిస్తుంటారు. 

థియేటర్‌కు వెళ్లి మీరు నటించిన సినిమా చూస్తుంటే ఏమనిపిస్తుంది?
సంపూర్ణేష్‌ బాబు: చాలా ఆనందంగా ఉంటుంది. సినిమా నడుస్తున్న సమయంలో మధ్యలో ఎవడో లేచి, ‘ఓరేయ్‌ సంపూర్ణేష్‌బాబు’ అంటూ అరుస్తాడు. ఒక సాధారణ వ్యక్తిలా రూ.40పెట్టి టికెట్‌ కొనుక్కొని సినిమాలు చూసే నేను నటుడు కావడం నా అదృష్టం. 
బాలకృష్ణ డైలాగ్‌ను పేరడీ చేస్తే ఫ్యాన్స్‌ సీరియస్‌ అయ్యారట!
సంపూర్ణేష్‌ బాబు: అవును! ‘బాలయ్య బాబు డైలాగ్‌ స్ఫూఫ్‌ చేశావ్‌. ఏమనుకుంటున్నావ్‌’ అని కాస్త గట్టిగాా మాట్లాడారు. ‘నేను కేవలం నటుడిని మాత్రమే. నా వల్ల మీరు హర్ట్‌ అయి ఉంటే సారీ’ అని చెప్పా. ఆ తర్వాత ఒక ఫంక్షన్‌లో బాలకృష్ణగారిని కలిస్తే, ‘నా డైలాగ్‌ భలే పేరడీ చేశావే. బాగుందయ్యా’ అంటూ మెచ్చుకున్నారు. 
‘కొబ్బరిమట్ట’ పూర్తయిపోయిందా?
సంపూర్ణేష్‌ బాబు: మొత్తం షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తాం. అందరినీ తప్పకుండా నవ్విస్తుంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.