close

తాజా వార్తలు

ఎయిర్‌పోర్ట్‌ స్లీప్‌ టు అంపైర్‌ ఫైట్‌

ఐపీఎల్‌ 12లో ధోనీ విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం వరకూ జరిగిన లీగ్‌ మ్యాచుల్లో టాప్‌ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. దీంతో ఈ వారంలో మూడు ప్లే ఆఫ్‌ మ్యాచులతో పాటు మే 12న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే లీగ్‌ దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ లీగ్‌ దశ జరుగుతున్నంతకాలం దాదాపు టాప్‌లోనే ఉంది. ఆఖరి మ్యాచ్‌లో ముంబయి కోల్‌కతాను చిత్తుగా ఓడించడంతో ఆ జట్టు సరాసరి మూడో స్థానం నుంచి ఏకంగా ఒకటో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ ధోనీ ఐదు సందర్భాల్లో విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం..

ఎయిర్‌పోర్టులో నేలపై నిద్ర:
ఐపీఎల్‌ బిజీ షెడ్యూల్‌ నేపథ్యంలో ఆటగాళ్లకు సరైన తీరిక సమయం ఉండదు. అలాంటి ఓ ఘటనే ధోనీ నేలపై పడుకోవడం. ఈ సీజన్‌ ప్రారంభమైన తొలి వారంలో కోల్‌కతాతో మ్యాచ్‌ అనంతరం ధోనీసేన రాజస్థాన్‌ మ్యాచ్‌కోసం జైపూర్‌ వెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంగా వేకువజామునే బయలుదేరాల్సిన విమానాన్ని అందుకునేందుకు చెన్నై జట్టు ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. రాత్రి మ్యాచ్‌ లేటవ్వడం మళ్లీ తెల్లవారుజామునే జైపూర్‌ వెళ్లాల్సి రావడంతో ధోనీ, సాక్షి ఇద్దరూ నేలపైనే పడుకున్నారు. ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారి ధోనీ సింప్లిసిటీని తెలియజేసింది.

అంపైర్‌తో వాగ్వాదం:
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట ధోనీ 43 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్‌శాంట్నర్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అయితే అతను ఆడిన తొలి బంతి నోబాల్‌ అని ఫీల్డ్‌ అంపైర్‌ సైగచేశాడు. తర్వాత లెగ్‌ అంపైర్‌ దాన్ని కాదని బంతిని కౌంట్‌ చేశాడు. దీంతో మిస్టర్‌ కూల్‌ కాస్తా మిస్టర్‌ హాట్‌గా మారిపోయాడు. ఆగ్రహంతో మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై పలువురు క్రికెటర్లు ధోనీని తప్పుబట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోనీసేన ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలుపొందడంతో ఐపీఎల్‌లో 100 మ్యాచులు గెలిచిన తొలి కెప్టెన్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు.

మెరుపు స్టంపింగులు:
ఏ ఫార్మాట్‌లోనైనా ధోనీ వికెట్‌ కీపింగ్‌ చేస్తుంటే బ్యాట్స్‌మెన్‌ క్రీజు వదలడం తెలివితక్కువ పనే. ఇప్పటికే ధోనీ స్టంపింగ్‌ వేగం గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకొన్నాం. అయితే ఈ ఐపీఎల్‌లో మాత్రం తన స్టంపింగ్‌ సామర్థ్యాన్ని మరోసారి తెలియజేశాడు. బ్యాట్స్‌మన్‌ క్రీజు వదలకుండా కాలు గాల్లోకి తీసిపెట్టేలోపే స్టంపింగ్‌ చేశాడు. అది కూడా ఒకే ఓవర్‌లో ఇద్దరు టాప్‌ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌చేసి ఔరా అనిపించాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీ క్రిస్‌మోరిస్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను రెప్పపాటులో స్టంపింగ్‌ చేసి వార్తల్లో నిలిచాడు. 

 

ఈ సీజన్‌లో రికార్డులు: 
ఈ సీజన్‌లో ధోనీ అరుదైన రికార్డులు నమోదు చేశాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టి చెన్నై బ్యాట్స్‌మెన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. అదేంటంటే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు చెయ్యాల్సినస్థితిలో 24 పరుగులు చేసి చెన్నైని గెలిపించినంత పని చేశాడు. ఉమేశ్‌యాదవ్ వేసిన ఆ ఓవర్‌లో ధోనీ ఏకంగా మూడు సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టి చెన్నై జట్టులో ఆశలు రేపాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా బెంగళూరు కీపర్‌ పార్థివ్‌పటేల్‌ శార్దుల్‌ ఠాకుర్‌ని రనౌట్‌ చేయడంతో ఒక్క పరుగుతో ఆ జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో ధోనీ 48 బంతుల్లో 84 పరుగులు చేశాడు. టీ20ల్లో అతడికిదే అత్యుత్తమ స్కోర్‌. అలాగే ఈ మ్యాచ్‌లో ఏడు సిక్సులు బాదడంతో ఐపీఎల్‌లో 200 సిక్సులు కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

చెన్నై అభిమానుల తలా: 
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఉన్నంత క్రేజ్‌ ఏ జట్టుకు లేదనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులోనూ ధోనీ అంటే చెన్నై అభిమానులకు అమితమైన ప్రేమాభిమానం. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ధోనీ ఆ జట్టుకు కెప్టెన్‌గా సేవలందిస్తూ మూడుసార్లు టైటిల్‌ విజేతగా నిలిపాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వల్ల 2016, 2017 రెండు సీజన్లు చెన్నై జట్టు ఆడకపోయినా 2018లో తిరిగి ప్రవేశించి కప్పును ఎగరేసుకుపోయింది. దీంతో ధోనీ అభిమానులు ఆయనకు తలా అనే పేరు పెట్టారు. ఈ పేరంటే తనకు చాలా ఇష్టమని దిల్లీతో చెన్నైలో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ తర్వాత ధోనీ పేర్కొన్నాడు. తమిళనాడు అభిమానులు తనతో పాటు సూపర్‌ కింగ్స్‌ జట్టుని అమితంగా అభిమానించారని, వారు పెట్టిన పేరు తలా తనకెంతో నచ్చిందని చెప్పాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.