close

తాజా వార్తలు

ఎమ్మెస్కే ముఖాముఖి: అంతర్జాతీయ అనుభవం ఒక భ్రమ

దిల్లీ: ఎన్నో అంచనాల నడుమ ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టిన టీమిండియా ప్రపంచకప్‌ సెమీస్‌లోనే నిష్క్రమించింది. కనీసం ఫైనల్‌ చేరలేదు. జట్టు కూర్పు, మిడిలార్డర్‌ వైఫల్యంతో గెలవాల్సిన ట్రోఫీ చేతికి అందకుండా పోయింది. టోర్నీ ముగిసిన తర్వాత సారథ్యంపై కనీసం చర్చ జరగలేదు. సమీక్ష నిర్వహించలేదు. జట్టులో విరాట్‌ కోహ్లీ, రవిశాస్త్రి ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోందని మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెట్టారు. సెలక్షన్‌ కమిటీకి వారిని ప్రశ్నించే దమ్ము, చేవ, స్థాయి లేవని దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ పరుష పదజాలం  ఉపయోగించారు. వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పీటీఐకి ప్రత్యేక ముఖాముఖి ఇచ్చారు. తనపై వస్తున్న విమర్శలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇవిగో...



 సెలక్షన్‌ కమిటీ స్థాయి, దమ్ము, చేవ గురించి బయట ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇది మిమ్మల్ని బాధిస్తోందా?

చూడండి! సెలక్షన్‌ కమిటీ సభ్యులు వేర్వేరు దశల్లో టీమిండియా కోసం వేర్వేరు ఫార్మాట్లలో ఆడారు. అప్పుడున్న నిబంధనల ప్రకారమే కదా మమ్మల్ని సెలక్టర్లుగా ఎంపిక చేసింది. మా అంతర్జాతీయ కెరీర్‌ను పక్కన పెడితే మేమంతా కలిసి 4,77 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాం. మా పదవీ కాలంలో 200 పైగా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్ని తిలకించాం. సరైన ప్రతిభావంతుల్ని ఎంపిక చేసేందుకు మా అందరి అనుభవం సరిపోదని మీరు అనుకుంటున్నారా?

మీరంతా కలిసి 13 టెస్టులే ఆడారన్న విమర్శలు ఎప్పుడూ వస్తున్నాయిగా?

అంతర్జాతీయ అనుభవం, స్థాయి గురించి ఎవరైనా మాట్లాడితే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రస్తుత ఛైర్మన్‌ ఎడ్‌స్మిత్‌ ఆడింది కేవలం ఒకే ఒక్క టెస్టు. ఆస్ట్రేలియా క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా 13 ఏళ్లుగా (మధ్యలో విరామం వచ్చింది) పనిచేస్తున్న ట్రెవర్‌ హన్స్‌ 7 టెస్టులే ఆడారు. 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్‌వా ఆయన కింద పనిచేస్తున్నారు. 87 టెస్టులు, 74 వన్డేలు ఆడిన దిగ్గజ ఆటగాడు, ఆసీస్‌ మాజీ సారథి గ్రెగ్‌ ఛాపెల్‌ సైతం ట్రెవర్‌ కిందే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆ దేశాల్లో స్థాయి, అనుభవం అనేవి లెక్కలోకే రావు. మన దేశంలోనే ఎందుకిలా? నేను చెప్పేదొకటే. ప్రతి పనికీ అవసరమైన డిమాండ్లు ఉంటాయి. ఇంకా మీరు అంతర్జాతీయ అనుభవం గురించే అడిగితే... మనమంతా ప్రేమించే శ్రీ రాజ్‌ సింగ్‌ దుంగార్‌పుర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండానే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. మరి అప్పుడే కదా 16 ఏళ్ల వయసులోనే వజ్రం లాంటి సచిన్‌ తెందుల్కర్‌ను వెలికితీసింది.

అంతర్జాతీయ అనుభవమే ప్రాతిపదిక అయితే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన ఎంతో మంది ఆటగాళ్లు ఇక టీమిండియా సెలక్టర్లు కావాలనే అనుకోరు. ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అనుభవం అవసరం అయినప్పుడు సెలక్టర్ల స్థాయిపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు?

మీపై విమర్శలు చేస్తే కోపం వస్తుందా?

ఇది దురదృష్టకరం. దిగ్గజ క్రికెటర్లపై మాకు ఎనలేని గౌరవం ఉంది. వారు వ్యక్తం చేసే ప్రతి అభిప్రాయాన్ని సరైన రీతిలోనే స్వీకరిస్తాం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అవి మేం చక్కగానే స్వీకరిస్తాం. నిజానికి రి విమర్శల వల్ల బాధపడే కన్నా ఈ సెలక్షన్‌ కమిటీ మరింత పటిష్ఠంగా, ఐకమత్యంగా మారుతుంది.

సెలక్షన్‌ కమిటీ అభిప్రాయంతో కోచ్‌ రవిశాస్త్రి, సారథి విరాట్‌ కోహ్లీ విభేదిస్తే చివరికి ఏం జరుగుతుంది? వారు మీపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తారా?

రవిశాస్త్రి, కోహ్లీ మా సీనియర్‌ జట్టు కోచ్‌, సారథులు. భారత్‌-ఏ బాధ్యతలను రాహుల్‌ ద్రవిడ్‌ చూసుకుంటారు. మా అందరికీ ఎవరి పాత్రలు ఏంటో బాధ్యతలు ఏంటో స్పష్టంగా తెలుసు.  మా అభిప్రాయ బేధాలను విమర్శలుగా భావించం. మా మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలను ప్రజలకు తెలియనివ్వం. నాలుగు గోడల మధ్య జరిగింది నాలుగు గోడల మధ్యే ఉండిపోతుంది. చివరికి మేం భారత జట్టు బహుళ ప్రయోజనాల మేరకే నడుచుకుంటాం. ఆటగాళ్లు ఎక్కువ క్రికెట్‌ ఆడినంత మాత్రాన మరింత విజ్ఞానం, మరింత శక్తిమంతులు, ఎవరిపైనైనా ఆధిపత్యం చెలాయిస్తారనుకోవడం ఉత్త భ్రమ. అదే నిజమైతే మొత్తం సహాయ సిబ్బంది, కోచ్‌, సెలక్టర్లు, మిగతా అందరినీ అంతర్జాతీయ అనుభవం గల వారితోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. అది సరైందని అనుకోను.



ఈ మూడేళ్లలో సెలక్షన్‌ కమిటీ పనితీరుకు మీరు ఎంత రేటింగ్‌ ఇస్తారు?

మా సెలక్షన్‌ కమిటీ దేశం నలుమూలలా పర్యటించి దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని గుర్తించింది. ఒక క్రమ పద్ధతిలో వారిని పెంచి పోషించింది. అర్హత ఉన్న వారిని ‘భారత్‌-ఏ’కు ఎంపిక చేసింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు పంపించాం.

ఎ) మేం ఎంపిక చేసిన టెస్టు జట్టు 13కు 11 సిరీస్‌లు గెలిచింది. మూడేళ్లుగా భారత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 

బి) వన్డేల్లో మాకు 80-85% విజయాలు లభించాయి. ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమికి ముందు భారత్‌ నంబర్‌ వన్‌. మేం ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరుకున్నాం. రెండు ఆసియా కప్‌లు (2016, 2018) కైవసం చేసుకున్నాం.

సి) మేం ఎంపిక చేసిన భారత్‌-ఏ జట్టు 11కు 11 వన్డే సిరీస్‌లు గెలిచింది. అందులో చతుర్ముఖ సిరీస్‌లూ ఉన్నాయి. 9 టెస్టు సిరీస్‌లకు 8 కైవసం చేసుకున్నాం.

డి) టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో మేం 35 మంది కొత్తవారికి అవకాశం కల్పించాం. అన్ని విభాగాల్లోను అవసరమైన రిజర్వు ఆటగాళ్లను బలోపేతం చేశాం. ఒక విజయవంతమైన కమిటీగా మా బ్యాటన్‌ను తర్వాతి కమిటీకి ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉన్నాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.