close

తాజా వార్తలు

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!

కరీంనగర్‌: ఇటీవల తనపై కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. తనపై వచ్చిన వార్తల పట్ల కలత చెందిన రాజేందర్‌ గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. ఉద్యమ సమయం నుంచీ తెరాసతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ సాయంచేశానే తప్ప.. 15 ఏళ్లలో తాను ఏ ఒక్కరి నుంచీ డబ్బులు తీసుకోలేదని చెప్పారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదని.. ఆ పదవి కోసం తాను కులం పేరుతో కొట్లాడలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం మాత్రమే తాను పోరాటం చేశానని ఈటల వివరించారు.  

నన్ను చంపినా తెలంగాణ జెండా వదలను
తనను చంపాలని రెక్కీ నిర్వహించినప్పుడు చంపుతావా?అని ఎదురెళ్లి ఛాలెంజ్‌ చేశానని ఈటల చెప్పారు. తనను చంపినా తెలంగాణ జెండా వదిలేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా అని.. ఆ బావుటాను ఎగురవేసేందుకు తనవంతుగా కృషిచేశానని అన్నారు. 
ఎవరి నుంచైనా తాను రూ.5వేలు లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్‌ చేశారు. తాను అనామకుడిగా రాజకీయాల్లోకి వచ్చి స్వయం కృషితో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని ఈటల ఈ సందర్భంగా తెలిపారు. తన తండ్రి రాజకీయాల్లో లేరని.. తాను ఇల్లు కట్టుకుంటే తనపై ఇంత కక్షా? అని తనపై ఆరోపణలు చేసినవారినుద్దేశించి ఈటల వ్యాఖ్యానించారు.

చరిత్ర నిర్మాతలు ప్రజలే!

గతంలో వైఎస్‌ఆర్‌ ప్రలోభాలకు, బెదిరింపులకు తాను లొంగలేదని.. తెలంగాణ కోసం లక్షలాది మంది ప్రజలతో కలిసి ఉద్యమం చేశానని గుర్తుచేసుకున్నారు.  మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల గెలుపు కోసం ఉద్యమం చేపట్టా రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అందుకే తాము గులాబీ జెండా యజమానులమని అన్నారు. అడుక్కునేవాళ్లం కాదు.. అడుక్కునేవారు ఎవరో తెలుస్తుంది అని ఈటల వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని అన్నారు. ధర్మం, న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని.. ప్రజలే చరిత్ర నిర్మాతలని ఈటల అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.