close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. సమ్మెపై వెనకడుగు ప్రసక్తే లేదు:ఐకాస

రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ సమ్మెపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస పునరుద్ఘాటించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష చేపడతామని నేతలు స్పష్టం చేశారు. కొనసాగుతున్న సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ఐకాస కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ సందర్భంగా ఐకాస తీర్మానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి నాడు వాల్మీకి జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 13న ఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్వహణకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.25లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వాళ్లకి దసరా ఆనందం లేదు: చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి లక్షలాది పేద కుటుంబాల పొట్టకొట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పండగ పూట పేద కుటుంబాలు పస్తులుండే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. నిర్మాణ కార్మికులను అప్పులపాల్జేసి వారికి దసరా ఆనందం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇసుక కష్టాలు.. పేదల పొట్ట కొట్టి వైకాపా నేతలు జేబులు నింపే ఆకృత్యాలు ఇంకెన్నాళ్లని చంద్రబాబు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉద్దేశం లేదు: కేసీఆర్‌

భవిష్యత్‌లో ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని.. సంస్థను ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని.. అది వివేకమైన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ చర్యలపై ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం విధించిన గడువులోపు విధుల్లో చేరకుండా కార్మికులే సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నారని కేసీఆర్‌ అధికారులతో వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

5. వీవీఐపీ టూర్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

ప్రత్యేక భద్రతా బృందానికి(ఎస్పీజీ) కేంద్రం సోమవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్పీజీ భద్రత పొందే వ్యక్తి విదేశాలకు వెళ్లినపుడు తప్పనిసరిగా సిబ్బందిని వెంట తీసుకువెళ్లాలని సవరణలు చేసినట్లు సమాచారం. వారి భద్రతా ప్రమాణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒకవేళ భద్రత పొందే వ్యక్తి అందుకు అనుమతించకపోతే వారికి విదేశీ ప్రయాణాన్ని కుదించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈఎస్‌ఐ కుంభకోణం:మరో ముగ్గురు అరెస్ట్‌

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గుర్ని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ ఎండీ డాక్టర్‌ అరవింద్‌రెడ్డితో పాటు కె.రామిరెడ్డి, కె.లిఖిత్‌రెడ్డిలను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 13కి చేరింది. ఈఎస్‌ఐకి పరికరాలు సరఫరా చేసినట్లుగా పత్రాలు సృష్టించి అరవింద్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించారు. జాయింట్‌ డైరెక్టర్‌ పద్మతో కలిసి ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో 100 నగరాల్లో స్విగ్గీ

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ అందించే ప్రముఖ సంస్థ స్విగ్గీ తన సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 600 నగరాలు, 200 యూనివర్సిటీల్లో సేవలు అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం 500 నగరాలు, 75 యూనివర్సిటీల్లో ఈ సంస్థ ఫుడ్‌ డెలివరీ సేవలను అందిస్తోంది. లాంచ్‌ప్యాడ్‌ ప్రొగ్రామ్‌ కింద యూనివర్సిటీల్లో విద్యార్థులను స్విగ్గీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తాము: యునిలీవర్‌

దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ సంస్థ యూనిలీవర్‌ సోమవారం కీలక ప్రకటన చేసింది. 2025 నాటికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గిస్తామని ప్రకటించింది. దాదాపు లక్షటన్నుల ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొంది.   దీంతోపాటు తాము విక్రయించే ప్లాస్టిక్‌ కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమీకరించేందుకు, ప్రాసెస్‌ చేసేందుకు తమ కంపెనీ కృషి చేస్తుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన హిట్‌మ్యాన్‌

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌ మెరుగయ్యాయి. ఓపెనర్‌గా అరంగ్రేట టెస్టులోనే రెండు శతకాలు బాది రికార్డు సృష్టించిన రోహిత్‌శర్మ 17వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు కెరీర్‌లో హిట్‌మ్యాన్‌కి ఇదే అత్యుత్తమం. సఫారీలపై ద్విశతకం బాదిన మరో భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 38 స్థానాలు ఎగబాకి 25వ స్థానంలో నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రపంచ బాక్సింగ్‌: క్వార్టర్స్‌కు మంజురాణి

భారత బాక్సింగ్‌ క్రీడాకారిణి మంజు రాణి (48 కిలోలు) ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆమె వెనుజులా బాక్సర్‌ రోజాస్‌ టయోనిస్‌ను 5-0తో ఓడించింది. మరొక్క మ్యాచ్‌లో ఆమె విజయం సాధిస్తే కనీసం కాంస్యం ఖాయమవుతుంది. ఐతే తర్వాతి రౌండ్లో మంజురాణి కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.