close

తాజా వార్తలు

జైళ్లను బద్దలుకొట్టుకొని జనంపైకి..?

 పొంచి ఉన్న ఐసిస్‌ ముప్పు
 ట్రంప్‌, టర్కీ స్వార్థప్రయోజనాల ఫలితం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: టర్కీ స్వార్థంతో  చేపట్టిన ఒక ఏకపక్ష దాడి ప్రపంచ శాంతిభద్రతలను మళ్లీ పెను ప్రమాదంలో పడేస్తోంది. అయినా ఆ  దేశానికి ఇవేవీ పట్టడంలేదు. తన స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది.  ఉత్తర సిరియాలోని కుర్దులకు చెందిన సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్స్‌(ఎస్‌డీఎఫ్‌)పై చేస్తున్న టర్కీ దాడులు ప్రపంచ దేశాల్లో ఆందోళనను పెంచుతున్నాయి. దాదాపు 11వేల మంది కుర్దు యోధుల ప్రాణత్యాగాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. దీంతో ఇక్కడ జైళ్లలో బందీలుగా ఉన్న దాదాపు పది వేల మందికి పైగా కరుడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాదులు జైళ్లను బద్దలు కొట్టుకొని జనంపై పడేందుకు సిద్ధమైపోతున్నారు.

ఈ కుర్దులు ఎవరు..? 

కుర్దులు ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, టర్కీ దేశాల్లో నివసించే ఒక గ్రామీణ తెగ. వీరు రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ప్రత్యేక కుర్దిస్థాన్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, సఫలం కాలేదు. 2012లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పుడు వీరు కూడా కేవలం స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి సిరియా ప్రభుత్వంతో నేరుగా విభేదాలు లేవు. దేశంలోని ఇతరప్రాంతాల్లోని తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా బలగాలు కుర్దుల ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. అదే సమయంలో 2014-15లో ఐసిస్‌  సిరియాలోని వీరి ప్రాంతాన్ని కూడా కబ్జాచేయడానికి ప్రయత్నిస్తే  తీవ్రంగా ప్రతిఘటించారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా వీరు చేసిన పోరాటానికి అమెరికా సంకీర్ణ దళాలు మద్దతు ఇచ్చాయి. కుర్దులపై భయంతో టర్కీ ఐసిస్‌కు  మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో  కుర్దు దళాలు 2019లో ఐసిస్‌ను ఓడించి కనుమరుగు చేశాయి. పలువురు ఐసిస్‌ ఉగ్రవాదులను బందీలు పట్టుకొని జైళ్లలో పెట్టారు. ఈ పోరాటంలో దాదాపు 11వేల మంది కుర్దు యోధులు మరణించారు. వీరు ఉండే ప్రాంతాన్ని ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ రోజవా’గా ప్రకటించుకొన్నారు. టర్కీలోని కుర్దులకు చెందిన కుర్దిస్థాన్‌ వర్కర్స్ పార్టీకి ఎస్‌డీఎఫ్‌ నుంచి మద్దతు లభిస్తోంది. అయితే కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీని టర్కీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉత్తర సిరియాలోని కుర్దులను  వెనక్కి తరిమి కొట్టి 480 కిలోమీటర్ల మేరకు బఫర్‌ జోన్‌ఏర్పాటు చేసి సిరియా శరణార్థులను  అక్కడ ఉంచాలని టర్కీ భావిస్తోంది. మరోపక్క ఇప్పటి వరకు కుర్దులకు మద్దతుగా ఉన్న అమెరికా దళాలు అక్కడి నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే టర్కీ కూడా కుర్దులపై దాడులను ప్రారంభించింది.

కుర్దుల ఎదుట తక్కువ అవకాశాలు..

హఠాత్తుగా అమెరికా సేనలు వైదొలగడంతో ఇప్పుడు కుర్దులు ప్రమాదంలో పడ్డారు. వీరు తమను తాము రక్షించుకోవడానికి రష్యా సాయం కోరడమనే  ఒక అవకాశం మిగిలివుంది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలను వదలి వెళ్లిపోవడం మరో మార్గం.   టర్కీ సమీపంలోని అల్‌హౌల్‌లోని ఒక  క్యాంపులో 70వేల మంది ఉంటున్నారు. వీరిలో చాల మందికి ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు టర్కీ దాడులు చేస్తున్న ప్రదేశాల్లో ఐసిస్‌ ఉగ్రవాదులను బంధించిన పలు జైళ్లు ఉన్నాయి.

ఈ జైళ్లలో దాదాపు 12వేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది విదేశీయులే. ఈ జైళ్లకు సమీపంలోకి ఐసిస్‌ ఉగ్రవాదుల కుటుంబాలు కూడా వచ్చి ఉంటున్నాయి. జైళ్ల నిర్వాహకులతో వీరు తరచూ గొడవలకు దిగుతుంటారు. ఇప్పుడు కుర్దు దళాలు ఇక్కడి నుంచి వెనక్కి వెళితే ఐసిస్‌ ఉగ్రవాదులు జైళ్లను బద్దలు కొట్టుకొని బయటకు వస్తారు. టర్కీ ఇప్పటికే వీరి విషయంలో సానుభూతిగా ఉండటంతో వారిపై పెద్దగా చర్యలు తీసుకోదని అనుమానిస్తున్నారు.  

జైళ్లపై టర్కీ షెల్లింగ్‌..

నిన్న టర్కీ శతఘ్నులు పేల్చడంతో గుండ్లు ఉత్తర సిరియాలోని ఖమిష్లిలోని నౌకూర్‌ జైలుపై పడ్డాయి. ఈ గందరగోళంలో ఐదుగురు ఐసిస్‌ ఉగ్రవాదులు తప్పించుకొన్నట్లు తెలిసింది. మరోపక్క టర్కీ దళాలు వస్తున్న విషయం తెలుసుకొన్ని ఖైదీలు కుర్దు జైలు గార్డులపై దాడులకు పాల్పడుతున్నారు. మరోపక్క అల్‌ హౌల్‌ క్యాంపులో కొందరు మహిళలు టెంట్లకు నిప్పు పెట్టి గార్డులపై రాళ్లు, కర్రలతో దాడి చేస్తున్నారని ‘దిసన్‌’ పత్రిక వెల్లడించింది. ఒక వేళ వీరు జైళ్ల నుంచి బయటకు వస్తే మళ్లీ 2014-15 నాటి పరిస్థితులు ఏర్పడతాయని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. కుర్దులకు ఎవరైనా మద్దతునిస్తే తమ దేశంలో ఉన్న 35 మిలియన్ల మంది సిరియా శరణార్ధులను యూరప్ లోకి పంపేస్తామని టర్కీ అధినేత ఎర్డోగాన్‌ హెచ్చరికలు జారీచేస్తూ పరోక్షంగా యూరప్‌ దేశాలపై బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.