close

తాజా వార్తలు

అల..వైకుంఠపురం

కాదేదీ ఆవాసానికనర్హం!

ఫ్లోటింగ్ సిటీ

వేసవి తాపాన్ని భరించలేక చల్లగా ఉండే దేశాలకు వెళ్లి సేదతీరుతాం! మరి అక్కడా అదే పరిస్థితి ఉంటే? పెరుగుతున్న భూతాపంతో శీతల దేశాలు సైతం ఏడాది పొడవునా భగభగలాడుతున్నాయి. భూమ్మీద మరెక్కడా చోటు లేకపోతే భూగర్భంలో దాక్కోవాలా?.. అని ఎదురు ప్రశ్న వేయకండి. మున్ముందు అదే నిజం కావొచ్చు. భవిష్యత్తులో భూగర్భాలు, సముద్రాలే మన ఆవాసాలు కావొచ్చు. పెరుగుతున్న భూతాపం, కాలుష్యం, అధిక జనాభా మనల్ని ఇలా సరికొత్త ఆవాసాలపై దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్‌, చైనా వంటి దేశాలు రానున్న నాలుగేళ్లలో పూర్తిస్థాయి ప్రత్యామ్నాయ మానవ ఆవాసాలని సిద్ధం చేసుకోనున్నాయి. అవేంటో చూడండి...
జనసాంద్రత అత్యధికంగా ఉండే దేశాల్లో సింగపూర్‌ ఒకటి. పెరుగుతున్న సముద్రమట్టాలు ఓ వైపు... అధిక జనాభా మరోవైపు ఆ దేశానికి సవాల్‌ విసురుతుంటే.. అధిక వేడి, అధిక తేమ, ఆకస్మిక వాతావరణ మార్పులు ప్రజలని మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎక్కడ తలదాచుకోవాలి అనే ప్రశ్న అక్కడి నిపుణులని కునుకు పట్టనీయకుండా చేసింది. ఈ క్రమంలోనే నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ఎస్టేట్‌ స్టడీ సంస్థ భూగృహాల నివాస యోగ్యతపై దృష్టిసారించింది. వీలైనంత ఆకర్షణీయంగా భూగృహాలని రూపొందించడం ఎలానో ఆలోచిస్తోంది. లేజర్‌ స్కానింగ్‌ సాయంతో 3డి జియోలాజికల్‌ నమూనాని రూపొందించి భూగర్భ ఆవాసాలకు అనువైన ప్రాంతాలని గుర్తించి మ్యాపులని తయారుచేసింది. నాణ్యమైన గాలి, వెలుతురు... అగ్నిప్రమాదాలు జరిగితే ఎలా బయటపడాలి, భూగర్భంలో నిండిన చెత్తను బయటకు ఎలా తీసుకురావాలి అనేవి మొదట్లో వారికి ఎదురైన సవాళ్లు. స్మార్ట్‌ పరికరాలు... అవి అందించే హెచ్చరికల సాయంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ భూగర్భ ప్రదేశాలను రవాణా, పెట్రోలియం, క్రూడ్‌ ఆయిల్‌ నిల్వల కోసం వాడుతున్నారు. 2024 నాటికి భూగర్భ రైల్వే సేవలని రెట్టింపు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2030 నాటికి గృహనిర్మాణాలు కూడా మొదలవుతాయట.

భూగర్భ నగరి

అలలపై తేలియాడే నగరాలు
పన్నెండేళ్ల క్రితం.. మార్క్‌కొలిన్స్‌చెన్‌ ఫ్రెంచ్‌ దీవులకు పర్యటక మంత్రిగా పనిచేశారు. పెరుగుతున్న సముద్ర మట్టాలు పసిఫిక్‌ దీవులని ముంచెత్తేందుకు ఎంతో సమయం లేదని గ్రహించిన చెన్‌ ప్రత్యామ్నాయ ఆవాసాలపై దృష్టి పెట్టాడు. అలా అతని ఆలోచనల్లోంచి పుట్టిన సంస్థే ఓషనిక్స్‌. తేలియాడే నగరాలని తయారుచేయడం ఈ సంస్థ ప్రత్యేకత. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌ సంస్థతో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రతి పదివేలమందికి అన్ని సదుపాయాలతో ఒక తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. క్రీడాప్రాంగణాలు, ఆసుపత్రులు, ప్రార్థనామందిరాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ నగరాలు విద్యుత్‌, ఆహారం, నీటి కోసం భూమితో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోవడడం విశేషం. తేలియాడే అలల,  సౌరఫలకాల నుంచి సొంతంగా విద్యుత్‌ని తయారుచేసుకుంటాయి. సముద్ర నీటిని రీసైక్లింగ్‌ చేసి వాడుకుంటాయి. సముద్రగాలుల నుంచి రక్షణగా వెదురుతో చేసిన నిర్మాణాలు ఉంటాయి. కృత్రిమ పగడపు దిబ్బలకోసం ఉపయోగించే బయోరాక్‌ వంటి పదార్థాలని వాడి ఈ తేలియాడే నగరాలని నిర్మిస్తున్నారు. ఒక దీవి నుంచి మరొక దీవికి ప్రయాణించడానికి సోలార్‌శక్తితో నడిచే ఫెర్రీలు ఇక్కడ ఉంటాయి. భూమ్మీద ఉండే మనుషులతో పోలిస్తే ఈ దీవులపై జీవించే మనుషులు తక్కువ కార్బన ఉద్గారాలని విడుదల చేస్తారని అంటున్నారు సంస్థ సీఈవో చెన్‌.

గార్డెన్‌ సిటీ

ఒకప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి. ఆవాసాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆవాసాలు ఎక్కువ... అడవులు తక్కువ అయ్యాయి. పెరగడమే కానీ తగ్గడం తెలియని జనాభాతో అడవుల విస్తీర్ణాన్ని పెంచుకోవడం అయ్యేపనేనా? దక్షిణచైనాలో గుయాంగ్జీ ప్రాంతంలో ఉన్న లియ్‌జు ఫారెస్ట్‌ సిటీని చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. ఆర్కిటెక్ట్‌ స్టీఫెన్‌బొయిరీ రూపొందించిన నగరమే ఈ ఫారెస్ట్‌ సిటీ. అడవిలో చెట్లను కొట్టకుండా నిర్మించిన ఈ నగరం  మనుషులు, చెట్లు కలిసి సహజీవనం చేస్తున్నట్టుగా ఉంటుంది. 30,000 మంది నివసించడానికి అనువుగా ఉండే ఈ ఫారెస్ట్‌సిటీ ఏటా 10,000 టన్నుల కార్బన్‌డైఆక్సైడ్‌ను సునాయాసంగా పీల్చేసుకుంటుందట. తొమ్మిది వేల టన్నుల ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది. సౌరశక్తితో విద్యుత్‌ అవసరాలని తీర్చుకునే ఈ నగరంలో ఇతర జీవజాలం ఉనికి క్రమంగా పెరగడానికి అవకాశం ఉందని.. 2020 నాటికి ఇక్కడ ఇళ్ల అమ్మకాలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే మెక్సికో, ఆఫ్రికాల్లో ఈ తరహా ఫారెస్ట్‌ నగరాలు వెలుస్తాయట.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.