close

తాజా వార్తలు

నైపుణ్యమున్నా విఫలమౌతున్నారు..!

రిషభ్‌పంత్‌, కేఎల్‌ రాహుల్‌పై ప్రత్యేక కథనం​​​​​​

టీమిండియాలో నైపుణ్యమున్నా విఫలమౌతున్న ఆటగాళ్లు రిషభ్‌పంత్‌, కేఎల్‌ రాహుల్‌. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి దిగ్గజాల వారసులు వారు. మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌గా ధోనీ తనదైన ముద్ర వేస్తే.. నిలకడత్వం, నైపుణ్యం గల ఆటగాడిగా ద్రవిడ్‌ పేరుగాంచాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన ప్రతీసారి మేమున్నామంటూ జట్టుకు అద్భుత విజయాలను అందించారు ఈ దిగ్గజాలు‌. ఈ ఆటగాళ్లు క్రీజులో ఉన్నారంటే చాలు టీమిండియా గెలుపు ఖాయమనే అభిప్రాయం నెలకొంటుంది. అంతటి ప్రాముఖ్యం గల స్థానాలను పంత్‌, రాహుల్‌ నిలబెట్టుకుంటున్నారా?అనే విషయం పరిశీలిస్తే..

సుదీర్ఘ క్రికెట్‌లో సంచలన ఆరంభం
ధోనీ 2014లో టెస్టులకు గుడ్‌బై చెప్పాక బంగాల్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా వెలుగులోకి వచ్చాడు. వికెట్ల వెనుక కీపర్‌గా తనదైన ముద్ర వేస్తూనే అవసరమైనప్పుడు బ్యాట్‌తో రాణించాడు. ఈ క్రమంలో గతేడాది అతడు గాయపడగా యువ కీపర్‌ రిషభ్‌పంత్‌ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అరంగేట్రం చేసిన యువకీపర్‌ ఆడిన తొలిబంతినే సిక్సర్‌గా మలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున తొలి బంతికే సిక్స్‌ కొట్టిన ఆటగాడిగా నిలవడంతో పాటు ఆ పర్యటనలో ఆఖరి మ్యాచ్‌లో శతకం బాదాడు. దీంతో ఇంగ్లాండ్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఆసీస్‌ పర్యటనలో రెండో శతకం బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాహాను మర్చిపోయేలా చేసి 11 టెస్టులాడిన పంత్‌ 44.35 సగటుతో 754 పరుగులు చేశాడు. 

పేలవ షాట్లు.. వరుస వైఫల్యాలు

కాగా పంత్‌ టెస్టుల్లో రాణించినంతగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించలేకపోతున్నాడు. ప్రపంచకప్‌లో అనూహ్యంగా అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు. ఆపై విండీస్‌ పర్యటనలో మూడో టీ20లో (65 నాటౌట్‌) మినహా పూర్తిగా విఫలమయ్యాడు. పేలవ షాట్లతో వికెట్‌ సమర్పించుకొని విమర్శలకు గురయ్యాడు. అయినా టీమిండియా అతడికి అండగానే నిలిచి దక్షిణాఫ్రికాతో ఆడించింది. మళ్లీ టీ20ల్లో రాణించకపోవడంతో టెస్టుల్లో సాహాను తుదిజట్టులోకి తీసుకున్నాడు. బంగాల్‌ కీపర్‌ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని వికెట్ల వెనుక ఆకట్టుకున్నాడు. సిరీస్‌కు ముందు కెప్టెన్‌ కోహ్లీ చెప్పినట్టుగా సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్‌ అని నిరూపించుకున్నాడు.

ఏమైంది రాహుల్‌.. ఎందుకిలా? 


 

టీమిండియాలో రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి దిగ్గజ ఆటగాడి తర్వాత అంతటి ఓపిక, సహనం, టెక్నిక్‌ కలగలిసిన ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియాలో తనదైన ముద్ర వేశాడు. మంచి టైమింగ్‌, టెక్నిక్‌తో చూడముచ్చటైన షాట్లు ఆడే కర్ణాటక బ్యాట్స్‌మన్‌ నిలకడత్వానికి మారుపేరు. అంత తేలికగా వికెట్‌ సమర్పించుకోని రాహుల్‌ గతేడాది దక్షిణాఫ్రికా, ఆసీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అనంతరం హార్దిక్‌ పాండ్యతో కలిసి ఓ వివాదంలో ఇరుక్కొని సస్పెండయ్యాడు. తర్వాత అవకాశం వచ్చి ప్రపంచకప్‌లో రాణించినా మళ్లీ విండీస్‌ పర్యటనలో తేలిపోయాడు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని దూరం పెట్టింది టీమిండియా. రాహుల్‌కు ఉన్న టైమింగ్‌, టెక్నిక్‌తో రాణిస్తే టీమిండియాకు అద్భుత విజయాలు అందించగలడు. అలాంటి ఆటగాడు విఫలమవ్వడం విచారకరం.

వీళ్లద్దరి తర్వాతి పరిస్థితి?
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ తర్వాత ఆ స్థానాన్ని పంతే భర్తీ చేయగలడు‌. మిడిల్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడాలన్నా.. సందర్భానికి తగ్గట్టు ఆచితూచి ఆడాలన్నా ఆ స్థానమెంతో కీలకం. అందుకే అతడు విఫలమౌతున్నా టీమిండియా నమ్మకముంచి అనేక అవకాశాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌తో జరిగే రెండు సిరీస్‌లకు అతడిని ఎంపిక చేసింది. అయితే, పంత్‌ తన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే అతడి స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల సంజుశాంసన్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. సహజంగా అతడు వికెట్‌ కీపర్‌ కూడా కావడం విశేషం. దీంతో పంత్‌ ఆడకపోతే ఆ స్థానానికి ప్రత్యామ్నాయం ఉండటం గమనార్హం. ఇకనైన రిషభ్‌పంత్‌ పేలవ షాట్లు ఆడటం మానేసి కచ్చితత్వంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇక రాహుల్‌ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో అతడికి టీ20 జట్టులోనే అవకాశం దక్కింది. టెస్టుల్లో మయాంక్‌ అగర్వాల్‌ అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌లో శతకాలతో ఆకట్టుకోవడంతో మయాంక్‌ను బంగ్లా సిరీస్‌కు ఎంపిక చేశారు. దీంతో రాహుల్‌ తన అవకాశాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.        -ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.