close

తాజా వార్తలు

‘లక్ష’ణమైన ఇళ్లు!

నివాసయోగ్య నగరంలో ఆవాసాలకు అధిక డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని మెట్రోసిటీల్లో అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. లైవ్‌ మింట్‌ తాజా సూచికలో మొదటిస్థానం దక్కింది. ఇలాంటి నగరంలో సొంతిల్లు ఉండాలని ప్రతిఒక్కరు కోరుకుంటున్నారు. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఏటా లక్ష మందికిపైగా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు వెలువరించే వార్షిక గణాంకాలతో పోలిస్తే ఇది దాదాపు 4 రెట్లు అధికం. ఆయా కన్సల్టెన్సీలు వ్యవస్థీకృత రంగంలోని నివాసాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. స్థిరాస్తి మార్కెట్‌ అంతకంటే చాలా పెద్దదని రిజిస్ట్రేషన్ల సంఖ్యనుబట్టి తెలుస్తోంది.

రాజధాని హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలవాళ్లు స్థిరనివాసానికి మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ నగరానికి వచ్చినవారు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ వాసులే కాదు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది, ఈశాన్యవాసులు సైతం ఇక్కడ స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నారు. తమ బడ్జెట్‌నుబట్టి స్థలాలు, వ్యక్తిగత ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి జిల్లా పరిధిలో అధిక లావాదేవీలు జరుగుతున్నాయి. గత ఏడాది ఏకంగా 4.20 లక్షల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగాయి. సహజంగానే స్థలాల వాటా అధికం. వీటి సంఖ్యనే 3 లక్షల వరకు ఉంది. వ్యక్తిగత ఇళ్లు 55 వేల వరకు కొంటుండగా.. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల సంఖ్య 65 వేల వరకు కొంటున్నారు. వీటిలో పాత ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలు, కొన్న వెంటనే మరొకరికి విక్రయించడం వంటివి మినహాయిస్తే లక్ష వరకు కొత్తవే ఉంటున్నాయి. గతంలో కొన్న స్థలాల్లో సొంతంగా కట్టుకునే ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది.

భూముల కొరత..: ప్రధాన నగరం హైదరాబాద్‌ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఖాళీ స్థలాలు దాదాపుగా లేవు. అక్కడక్కడ మిగిలిన స్థలాలు చేతులు మారుతున్నాయి. గత ఏడాది చూస్తే 544 ఓపెన్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక్కడ పాత ఇళ్ల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. 13,513 ఇళ్ల క్రయవిక్రయాలు జరిగాయి. ఒకటి రెండు అంతస్తుల పాత భవనాలను రీడెవలప్‌మెంట్‌కు ఇస్తున్నారు. వీటిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఇలా కట్టిన ఫ్లాట్లు 12,823 వరకు విక్రయించారు. ఫ్లాటు, పాత ఇళ్లు, స్థలం ఏదైనా ఇక్కడ కోట్లలోనే. వీటిని అధికాదాయ వర్గాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.

స్థలాల వైపు మొగ్గు..: ఎల్‌బీనగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు వచ్చే రంగారెడ్డి జిల్లాలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కువ. ధరలు బాగా పెరగడంతో ఎక్కువమంది ఫ్లాటుతో రాజీ పడుతున్నారు. ఇక్కడ 2018లో 15,955 ఇళ్లు విక్రయిస్తే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు 24,530 వరకు కొనుగోలు చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓపెన్‌ ప్లాట్ల విక్రయాలు ఈ జిల్లాలోనే. గత ఏడాది ఏకంగా 1.41 లక్షల స్థలాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో కొన్ని స్థలాలు మేస్త్రీలు కొని వ్యక్తిగత ఇళ్లు నిర్మాణం చేపట్టారు. గత ఏడాదే కాదు గతంలో కొన్న స్థలాల్లో సొంతంగా ఇళ్లు కట్టుకున్నవారు శివార్లలో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ ఒక్క జిల్లా పరిధిలోనే వార్షికంగా 50 వేల వరకు అన్ని రకాల ఇళ్ల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

ఫ్లాట్లకు పట్టం..
కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌ వరకు విస్తరించిన ఈ జిల్లాలో అధికశాతం అభివృద్ధి చెందిన ప్రాంతాలే. సహజంగానే ఇక్కడ అపార్ట్‌మెంట్‌ సంస్కృతి పెరిగింది. సిటీలోనే అత్యధికంగా ఈ ప్రాంతంలో 25,555 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాది జరిగాయి. వ్యక్తిగత ఇళ్ల విక్రయాలూ ఎక్కువే. 18,915 ఇళ్లు గత ఏడాది ఇక్కడ కొనుగోలు చేశారు. వీటిలో పాతవి, కొత్తవి ఉన్నాయి. ఓపెన్‌ ప్లాట్ల విక్రయాలు 58 వేల వరకు జరిగాయి. వీటిలోనూ కొందరు సొంతిళ్లు కట్టుకున్నారు. మొత్తంగా ఈ జిల్లాల్లోనూ వార్షికంగా 50 వేల ఇళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. పటాన్‌చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్ల విక్రయాలు జరిగాయి. వీటి సంఖ్య గత ఏడాది పదివేలు దాటింది. సిటీ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కలిపి చూస్తే వార్షికంగా లక్ష నుంచి 1.25 లక్షల వరకు ఇళ్ల విక్రయాలు జరుగుతున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.