close

తాజా వార్తలు

ఏడు పదుల వయసులోనూ అదే జోరు..!

అమితాబ్‌కు అరుదైన గౌరవం

అమితాబ్‌ బచ్చన్‌. ఈ పేరు తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ఏడు పదుల వయసులోనూ స్టార్‌ కథానాయకులకు దీటుగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారాయన. బాలీవుడ్‌ అంటే గుర్తుకొచ్చేది ఖాన్‌ల త్రయమే. అయితే వారిని సైతం తోసిరాజని, అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై అమితాబ్‌ హవా నేటికీ దేదీప్యమానంగా కొనసాగుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో షెహన్‌ షా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...

* అమితాబ్‌ కెరీర్‌ తొలినాళ్లలో సహాయపాత్రల్లోనే కనిపించారు. కథానాయకుడిగా నటించిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. అలాంటి సమయంలో వచ్చింది ‘జంజీర్‌’. నిజాయితీగల పోలీస్‌గా అమితాబ్‌ చూపించిన ఆవేశం, రౌద్రం ఆయనకు యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా పేరుతెచ్చిపెట్టింది.

‘షోలే’ ప్రస్తావన లేకుండా అమితాబ్‌ గురించి చెప్పడం సాధ్యం కాదు. ధర్మేంద్రతో కలసి అమితాబ్‌ నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలవడమే కాదు, బాక్సాఫీసు రికార్డులెన్నింటినో సరికొత్తగా లిఖించింది. ‘షోలే’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘ఆర్జీవీ కీ ఆగ్‌’లో అమితాబ్‌ విలన్‌గా నటించడం గమనార్హం.

* అమితాబ్‌ ఏడు పదుల వయసులోనూ ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. 2019 మాత్రమే కాదు, వచ్చే ఏడాది ఆయన కాల్‌షీట్‌లు ఖాళీ లేవు అంటే అతిశయోక్తికాదు. చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా:నరసింహారెడ్డి’లో ఆయన గోసాయి వెంకన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, తమిళంలో  ఎస్‌ జే సూర్యతో ‘ఉయర్న్‌ద మనిదన్‌’, సహా ‘బటర్ ఫ్లై’, ‘ఏబీ ఆని సీడీ’(మరాఠీ), ‘బ్రహ్మాస్త్ర’, ‘చెహ్రి’, ‘గులాబో సితాబో’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

* వెండితెరపై ఇంత బిజీగా ఉన్నా బుల్లి తెరపైనా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు అమితాబ్‌. ఆయన ప్రయోక్తగా వ్యవహరించిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మొదలైనప్పట్నుంచీ 17 ఏళ్లలో అత్యధిక సీజన్లకు అమితాబే ప్రయోక్తగా వ్యవహరించారంటే బుల్లితెర ప్రేక్షకులకు ఆయనెంత చేరువయ్యారో అర్థమవుతుంది. 

* ఏ గొంతు వల్ల తొలినాళ్లలో అవకాశాల విషయంలో తిరస్కారానికి గురయ్యాడో ఆ గొంతునే తన బలంగా మార్చుకుని బుల్లెట్ల లాంటి డైలాగులు పేల్చి థియేటర్లలో ఈలలు వేయించాడు అమితాబ్‌. ఆ గొంతుతోనే ఎన్నో సినిమాలకు నేపథ్య గాత్రం అందించి ప్రాణం పోశాడు.

* అమితాబ్‌ స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ ఏబీసీఎల్‌ ఆయనకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. దాని ద్వారా దాదాపు రూ.90 కోట్లు కోల్పోయారు అమితాబ్‌. మరోవైపు అదే సమయంలో ఆయన నటించిన నాలుగు చిత్రాలు ఘోర పరాజయం చెందాయి. ఇక అమితాబ్‌ చరిత్ర ముగిసినట్లే అన్న విమర్శలు బలంగా వినిపించాయి. అయితే ఆయన మాత్రం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంతో పడిలేచిన కెరటంలా మళ్లీ దూసుకొచ్చారు.

* 1976 నుంచి 1991 వరకూ వరుసగా 16 సంవత్సరాల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ కథానాయకుడిగా నిలిచి రికార్డు సృష్టించారు అమితాబ్‌. అంతకు ముందు ఆ ఘనత అలనాటి నటుడు దిలీప్‌ కుమార్‌కు మాత్రమే సాధ్యమైంది.

* సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ఈతరం నటులకు అమితాబ్‌ పోటీగా నిలిచే తీరు అబ్బురపరుస్తుంది. ట్విటర్‌, టంబ్లర్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో చురుగ్గా ఉంటూ తన సినిమాలు, వ్యక్తిగత విశేషాలను పంచుకుంటుంటారు అమితాబ్‌. ట్విటర్‌లో అమితాబ్‌కు అత్యధికంగా 38.6 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  ఈ విషయంలో ఆయన దరిదాపుల్లో ఇంకే భారతీయ నటుడూ లేడు.

* అమితాబ్‌పై అభిమానం ఎలా ఉంటుందో చూడాలంటే ఆదివారం ముంబయిలోని ఆయన స్వగృహం ‘జల్సా’కు వెళ్లాల్సిందే. ఆయనను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా అభిమానులు వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ప్రతి ఆదివారం తన ఇంటి వద్ద అభిమానులతో ముచ్చటించి ఆనందపరుస్తుంటారు అమితాబ్‌.

* 1982లో ‘కూలీ’ చిత్రీకరణలో అమితాబ్‌కు తీవ్ర ప్రమాదం జరిగి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా లక్షలాదిఅభిమానులు ప్రార్థించారు. కొంతమంది అభిమానులు అమితాబ్‌ చికిత్స కోసం 60 బాటిళ్ల దాకా రక్తం పంపించారు. ఈ సంఘటన అమితాబ్‌ పట్ల అభిమానుల్లో ఎంతటి ఆదరణ ఉందో తెలియజెప్పింది. వారి ఆశీస్సులతోనే తాను పునర్జన్మ పొందానని పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు అమితాబ్‌.

* అమితాబ్‌ అనేది ఓ పేరు కాదు... బ్రాండ్‌. ఇప్పటికీ అగ్రకథానాయకులకు దీటుగా అమితాబ్‌ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తుండటమే అందుకు నిదర్శనం. ఒకానొక దశలో ఆయన వేరెవరికీ సాధ్యంకాని రీతిలో 50కి పైగా ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నారు. ప్రస్తుతం 20కి పైగా సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అందులో పలు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలతో పాటు స్వచ్ఛ భారత్‌, జీఎస్‌టీ కమర్షియల్స్‌, గుజరాత్‌ పర్యాటకం లాంటి ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి అమితాబ్‌ బ్రాండ్‌ విలువ సుమారు రూ.160 కోట్లు అని అంచనా.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.