close

తాజా వార్తలు

అందుకే ‘సైరా’ నా 150వ సినిమాగా తీయలేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నటుడిగా తనకు సంతృప్తిని ఇచ్చిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన సినిమా ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించారు. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దసరా పండగను పురస్కరించుకుని చిరు, రామ్‌ చరణ్‌లను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా  చిరంజీవి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండగ అందరి జీవితాల్లో విజయం తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి సంభాషణ చూద్దాం..

చిరంజీవి: త్రివిక్రమ్‌.. మీతో కలిసి ఇలా కూర్చోవడం మాకు కొత్త కాదు. మీరు ఇంత వరకు ఎవర్నీ ఇంటర్వ్యూ చేయలేదు. మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు?
త్రివిక్రమ్‌: ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా చూసిన తర్వాత నేను నేరుగా మిమ్మల్ని కలిసి మాట్లాడాను. ఈ సినిమాను కూడా తొలి రోజునే చూశా. షూటింగ్‌ను పక్కనపెట్టి మరీ వెళ్లాను. సినిమాపై నా అభిప్రాయాన్ని మీతో పంచుకోలేదు, కావాలనే అలా చేశాను. కేవలం నా అభిప్రాయం మాత్రమే కాకుండా నాలాగా సినిమా చూసిన వారి సంతోషాన్ని కూడా తెలుసుకుని.. ఒకేసారి మీతో పంచుకోవాలని అనుకుని ఇప్పుడు నేరుగా మీ ముందుకు వచ్చా. (చిరు కల్పించుకుని.. ‘సూపర్‌’ అన్నారు) దాని కోసం ఇలా ఆన్‌ కెమెరా ముందుకు వచ్చాను. నా ఎగ్జైట్‌మెంట్‌ అందరికీ తెలియాలి.

త్రివిక్రమ్‌: మీరు మీ సినీ కెరీర్‌లో అన్ని రకాల కథలను చేసేశారు. అలాంటి మీరు నాకు ఈ పాత్ర చేయాలి అనడం వార్తే. 40 ఏళ్ల కెరీర్‌లోనూ మీరు ఈ ఉత్సాహంతో ఉండటం గొప్ప విషయం.

చిరంజీవి: నా సినీ జీవితంలో చెప్పుకోదగ్గ పాత్రలు ఎన్ని ఉన్నాయి అనుకుంటే.. ఓ పది ఉంటాయి. అవన్నీ ఆ సీజన్‌లో అప్పుడు హిట్‌ అయ్యాయి, నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. కృష్ణ గారికి ‘అల్లూరి సీతారామరాజు’ ఉంది. ఎన్టీఆర్‌ అంటే పౌరాణిక పాత్రలు గుర్తొస్తాయి. నాకు ‘ఖైదీ’, ‘ఇంద్ర’, ‘చూడాలని ఉంది’, ‘స్టాలిన్‌’ వంటి హిట్లు ఉన్నాయి. కానీ.. చరిత్రలో నిలిచిపోయే పాత్రలేదు అనే అసంతృప్తి ఉండేది. నాకు వ్యక్తిగతంగా స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలని ఉండేది. భగత్‌సింగ్‌ కథ చేయాలని ఉండేది. ఏ నిర్మాత గానీ, కథకుడు గానీ ఆ కథతో నా ముందుకు రాలేదు. అప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ గురించి తెలిసింది. దీన్ని కమర్షియల్‌ కథగా కూడా చేయొచ్చని పరుచూరి బ్రదర్స్‌ నాకు చెప్పారు. నాకు కథ నచ్చింది. కానీ దర్శకత్వం వహించేవారు, అంత భారీ బడ్జెట్‌ను పెట్టేవారు ముందుకు రాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లా. విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాను. నా 150వ సినిమా ఎలాంటి కథతో తీస్తే బాగుంటుందని చాలా ఆలోచించాం. ‘సైరా’ కథ కూడా అందులో ఉంది. అయితే, నా రీఎంట్రీలోనే ఈ పాత్ర చేస్తే వైవిధ్యమైన పాత్రలే చేయాల్సి వస్తుందనే మీమాంస ఉంది. అందుకే పదేళ్ల కిందట నన్ను చూసి ప్రేక్షకులు ఏవిధంగా ఆనందపడ్డారో అలాగే రీఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అందుకే రీమేక్‌ కథను ఎంచుకున్నా. అందులోనూ సందేశం ఉండటంతో మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత నా క్రేజ్‌ అలానే ఉందని అర్థమైంది. ఈ తరుణంలో చరిత్రలో కనుమరుగు అవుతున్న వీరుడి సినిమాను బయటికి తీసుకురావాలి అనుకున్నాం. దాన్ని తెరపైకి తీసుకురావాలి.. పాన్‌ ఇండియాగా రూపొందించాలి అనుకున్నాం. కానీ, బడ్జెట్‌ చూసుకుంటే రూ.300 కోట్లు కనిపిస్తోంది. అంత బడ్జెట్‌ పెట్టి తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని, బలాన్ని, ధైర్యాన్ని ‘బాహుబలి’ రూపంలో రాజమౌళి మాకు ఇచ్చారు. ఆయనకు థాంక్యూ. మనమే బడ్జెట్‌ పెట్టి తీద్దామని చరణ్‌ అన్నాడు. అలా సినిమా తెరపైకి వచ్చింది.

మరి సురేందర్‌రెడ్డి ఎలా ప్రాజెక్టులోకి వచ్చారు?
చిరంజీవి: నాకున్న బలాలు, సినిమాలో నేను ఇన్‌వాల్వ్‌ అయ్యే తీరు ఎప్పటినుంచో పరుచూరి బ్రదర్స్‌కు తెలుసు. అందుకే ఈ సినిమాను నన్నే దర్శకత్వం వహించమన్నారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించగల దమ్ము, ధైర్యం నాకుంది. అయితే, నరసింహారెడ్డి పాత్రకు న్యాయం చేస్తూ, మొత్తం చిత్రాన్ని చూసుకోవడం నేను చేయలేననిపించింది. ఒకవేళ నరసింహారెడ్డి పాత్ర వేరొకరితో వేయిస్తే, నేను దర్శకత్వం చేయడానికి సిద్ధమేనని చెప్పా. వాళ్లు వద్దన్నారు. అప్పుడే దర్శకుడిగా ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా సురేందర్‌రెడ్డి కనిపించారు. ఎందుకంటే అప్పుడే ‘ధ్రువ’ సినిమాను ఆయన చాలా స్టైలిష్‌గా తెరకెక్కించారు. చరిత్రకు సంబంధించిన కథను మోడ్రన్‌గా ఆయనే తీయగలరని చరణ్‌ నమ్మాడు. ఈ విషయం సురేందర్‌రెడ్డికి చెబితే 20 రోజుల సమయం అడిగారు. ఇంత భారీ ప్రాజెక్టు తీయగలనా? లేదా? అని తనని తాను ప్రశ్నించుకుని ‘ఎస్‌. చేయగలను’ అని నమ్మకం వచ్చిన తర్వాత మాకు ‘ఒకే’ చెప్పారు. 

ఈ సినిమాలో సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌ తమన్నా. ఎందుకంటే ఫస్టాప్‌ అయిపోయిన తర్వాత ఆ పాత్ర అంతటితో అయిపోయిందనుకున్నా? పాటతో ఆ పాత్రను తీసుకురావడంతో నిజంగా అద్భుతం!
చిరంజీవి: అవును! ఆ పాత్ర అందరికీ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. ఇక ‘సైరా’ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా రాశారు.  ప్రతిపదాన్ని, ప్రతి మాటను ఆ పాత్రను ప్రతిబింబిస్తుంది. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. 

ఉరి తీసేముందు స్వాతంత్ర్యసమరయోధుడు పలికే సంభాషణలు చాలా సినిమాల్లో చూశాం. అవేవీ లేకుండా ఎలా తీశారు?
చిరంజీవి: ఆ ఆలోచన సురేందర్‌రెడ్డిదే. ఎందుకంటే రెగ్యులర్‌ సినిమాల్లో ఉండే సంభాషణలు తనకు వద్దని బుర్రా సాయిమాధవ్‌ చెబితే ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్‌ హ్యాట్సాఫ్‌. వాళ్లిద్దరి కాంబినేషన్‌ అదిరిపోయింది. 

చివరిలో నరసింహారెడ్డి తల తెగిన తర్వాత నటించడంపై సినిమా విడుదలకుముందే నాకు చెప్పి, ‘అలా చేయడం కరెక్టేనా’ అని అడిగారు? నిజంగా ఆ సీన్‌ అద్భుతంగా తీశారు..
చిరంజీవి: ఆ సన్నివేశాన్ని సురేందర్‌రెడ్డి ప్రజెంట్‌ చేసిన విధానం అలా ఉంది. ఆ సీన్‌ చూసిన తర్వాత ప్రేక్షకులు సైతం బరువైన హృదయాలతో వచ్చారు. నాతో పాటు నాగార్జునగారు సినిమా చూశారు. బయటకు రాగానే నన్ను గట్టిగా పట్టుకుని, ‘ఇదొక ఎపిక్‌ అండీ, దీనికి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి నిలబెట్టడం నిజంగా చాలా కష్టం’ అని అన్నారు. ఆ తర్వాత వెంకటేశ్‌ ఆయన ఫోన్‌ చేసి, ఇంటికి వస్తానన్నారు. వచ్చీ రావడంతోనే గట్టిగా ఆలింగనం చేసుకుని, కొద్దిసేపు అలాగే ఉండిపోయారు. ఇవన్నీ ఫోన్‌ చెప్పే భావాలు కావన్నారు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే రజనీకాంత్‌ కూడా ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. ఆయన మాట్లాడటం కాదు, ఆయన భార్య కూడా ఫోన్‌ తీసుకుని, ‘వండర్‌ఫుల్‌ సినిమా అండీ. ఆ రోజంతా అదే ఫీలింగ్‌లో ఉండిపోయాం’ అని చెప్పడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. 

నయనతార పాత్రను కూడా చాలా చక్కగా చూపించారు?
చిరంజీవి: నరసింహారెడ్డిని సిద్ధమ్మ ఇంతలా ప్రేమిస్తుందా? అని అనిపించేలా ఆ పాత్రను తీర్చిదిద్దాం. అయితే, చరిత్రను దాటి బయటకు వెళ్లలేదు. 

సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ కనిపించకపోవడమే గొప్ప వీఎఫ్‌ఎక్స్‌.. రత్నవేలు అంత అద్భుతంగా చూపించారు.
చిరంజీవి: చాలా చక్కగా చెప్పారు. ఆయనతో పాటు, వీఎఫ్‌ఎక్స్‌ టీం కూడా చాలా బాగా పనిచేసింది.

అర్జునుడిని గాండీవం వదిలేసి, కృష్ణుడిని చక్రం వదిలేసి, భీముడిని గదను విడిచిపెట్టి యుద్ధం చేయమంటే చేయలేరు. కానీ, చిరంజీవి డ్యాన్స్‌లు, పాటలు లేకుండా సినిమా తీశారు? ఎలా సాధ్యమైంది?
చిరంజీవి: చాలా తక్కువ సినిమాలకు కుదురుతుంది. ఈ చిత్రానికి అలా కుదిరింది. అలాగే, నిర్మాణం విషయంలోనూ ఒక గొప్ప సినిమా తీశామన్న సంతృప్తి ఉంటే చాలని అనుకున్నాం. సినిమా కొన్నవాళ్లు బాగుంటే చాలు. ట్రేడ్‌ మాట్లాడాలి తప్ప.. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చిన్నవాడైనా చరణ్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు.

అసలు సినిమా నిర్మించాలని మీకు ఎందుకు అనిపించింది?
చరణ్‌: సినిమాలపై ఆయనుకున్న ప్యాషన్‌. పదేళ్లు వేచి చూడటం. ఆయన ఆలోచన. ఇవన్నీ క్రోడీకరిస్తే ఒక బిజినెస్‌మెన్‌లా ఆయన ఆలోచించడం లేదని మనకు అర్థమవుతుంది. ఆయన ఆలోచనల నుంచే నిర్మాతగా నేను పుట్టా. అదీ కుటుంబ సభ్యుడైతే బడ్జెట్‌ విషయంలో వెనక్కి తగ్గకుండా ఉంటాడనిపించింది. బడ్జెట్‌ పెరిగిన తర్వాత కొన్నాళ్లు సినిమా వాయిదా వేయడం, చర్చలు జరపడం ఇవేవీ ఉండకూడదని నిర్ణయించుకుని ఆ బాధ్యతలు నేను తీసుకున్నా. 

మీరు కాకుండా ఈ సినిమాకు హైలైట్‌ అమితాబ్‌. ఆయనను తీసుకోవాలని ఎందుకు అనిపించింది?
చిరంజీవి:: అందుకు సురేందర్‌రెడ్డే కారణం. ఆయనైతే బాగుంటుంది. మీరైతే ఆయనను తీసుకురాగలరని కోరారు. ఆయనతో సినిమాకు ఎంతో నిండుదనం వచ్చింది.

సుదీప్‌.. జగపతిబాబు.. విజయ్‌సేతుపతి పాత్రలు చాలా అద్భుతంగా పండాయి. వాటి గురించి?
చిరంజీవి: అవును! ద్రోహం చేశానని తెలిసిన తర్వాత జగపతిబాబు నటన అద్భుతంగా ఉంటుంది. పేరు పేరునా అందరి గురించి చెప్పాలి. కానీ,  సమయం సరిపోదు. కథ చాలా బలమైంది. అందుకే ఏ పాత్రకు ఎవరు కావాలో అదే కోరుకుంది. అదే అందరినీ ఆకర్షించుకుంది. (మధ్యలో త్రివిక్రమ్‌ అందుకుని.. కథ రాసే వరకే మనం రాజులం.. ఆ తర్వాత మనం దానికి బానిసలం. అది చెప్పినట్లు వినడమే) చాలా మంచి మాట చెప్పారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.