close

తాజా వార్తలు

‘నువ్వేమి హీరో అవుతావు.. పో..’ అనేవారు

ఇప్పుడు ఆయనే మెగాస్టార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆల్‌ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా పని చేద్దామంటే.. ‘నీ గొంతేమీ బాగోలేదు’ అని చీదరించుకున్నారు. నటుడు కావాలని దర్శకుల చుట్టూ తిరిగితే.. ‘నువ్వేమి హీరో అవుతావు.. పో..’ అని అవమానించారు. అయినా సరే ఆయన నిరాశ చెందలేదు. నటుడు కావాలనే ఆయన తపన ముందు ఈ అవమానాలు చిన్నవిగా మారాయి. అందుకే పోరాడుతూనే ఉన్నారు.. చివరికి అదృష్టం ఆయన తలుపుతట్టింది. 1969లో ‘సాత్‌ హిందుస్థానీ’తో మొదలైన ఆయన ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొన్నారు సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..  


నాటకాల నుంచి..

ఉత్తర్‌ప్రదేశ్‌ అలహాబాద్‌లో కళాకారుల ఇంట అక్టోబరు 11, 1942న అమితాబ్‌ జన్మించారు. తండ్రి హరివంశ్‌రాయ బచ్చన్‌ ప్రముఖ హిందీ కవి. తల్లి తేజీ బచ్చన్‌ సిక్కు మతస్థురాలు. నెహ్రూ కుటుంబంతో వీరికి వీడని బంధం. తల్లి అండ, ప్రోత్సాహం మెండుగా ఉండేవి. అలా పెరిగి, పెద్దవాడయ్యారు. మిత్రుల ప్రోత్సాహంతో కాలేజీ నాటకాల్లో నటించేవారు. ‘బాల్యం నుంచి నాకు నాటకాలంటే చాలా ఇష్టం. చిన్నతనంలో రకరకాల పాత్రలు వేశా. అదృష్టవశాత్తూ సినిమాల్లోకి వచ్చి పడ్డా. నాటకాల్లోని నా అనుభవం నటుడిగా కొనసాగడానికి ఎంతో ఉపయోగపడింది’ అని అమితాబ్ అంటుంటారు.


ఆకలితో ఒంటరిగా...

కొన్నాళ్లకు బిగ్‌బి కుటుంబం అలహాబాద్‌ నుంచి దిల్లీకి మారింది. ఆయన చదువుల తర్వాత మొదట ఉద్యోగం సంపాదించాలి అనుకున్నారు. తండ్రి పేరును చెప్పుకొని ఉద్యోగం చేయడం ఆయనకు ఇష్టం లేక.. ఆల్‌ ఇండియా రేడియోలో అనౌన్సర్‌ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ‘నీ గొంతేమీ బాగోలేదు’ అని అక్కడి అధికారులు అవహేళన చేశారు. ఆపై కోల్‌కత్తాలో షిప్పింగ్‌ కంపెనీలో చేరారు. కానీ, ఆయనకు ఆ ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. ఆ ఉద్యోగం నచ్చక.. రాజీనామా చేసి దిల్లీకి వచ్చేశారు. ఎలాగైనా నటుడు కావాలి 1968లో ముంబయికి వచ్చేశారు. దర్శక, నిర్మాతల దగ్గరికి వెళ్లితే.. ‘నువ్వేమి హీరో అవుతావు.. పో..’ అనేవారు. అమితాబ్‌ తలవంచుకుని వెళ్లిపోయేవారు. రాత్రుల్లో ఆకలితో ఒంటరిగా నిద్రపోయేవాడు.


రూ.10 వేలు వద్దనుకుని..

ఇంతలో ఓ రోజు అవకాశం వెతుక్కుని వచ్చింది. యాడ్‌ ఫిల్మ్‌లో మోడల్‌గా రూ.10 వేలు పారితోషికం. డబ్బు కాదు.. సినిమా ప్రధానం అనుకుని.. ఆ అవకాశాన్ని వదులుకున్నారు. 1969లో ప్రసిద్ధ పాత్రికేయుడు కేఏ అబ్బాస్‌ అమితాబ్‌కు మొదటి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. కానీ ఇందులో ఉన్న ఏడుగురు హీరోల్లో అమితాబ్‌ హైలైట్‌ అయ్యారు. ఆయన గొంతు అందర్నీ ఆకర్షించింది. ఈ సినిమాలో ఆయన నటనకు జాతీయ అవార్డు లభించింది.


పెను ప్రమాదం..

అది 1982 జులై 24 సాయంత్రం.. బెంగళూరు నగరంలోని జ్ఞాన భారతి కాలేజీ. అక్కడ గ్రంథాలయంలో ‘మన్మోహన్‌ దేశాయ్‌’ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. దర్శకుడు యాక్షన్‌ చెప్పారు. విలన్‌ లాగిపెట్టి హీరో అమితాబ్‌ కడుపులో కొట్టాడు. అంతే హీరో ఎగిరి టేబుల్‌ మీద పడ్డాడు. దర్శకుడు కట్‌, కట్‌ అన్నారు. హీరో టేబుల్‌ మీద నుంచి కిందికి జారిపోయారు. షాట్‌ బాగా వచ్చినందుకు అందరూ ఆయన్ను అభినందించారు. కానీ అమితాబ్ మాత్రం నొప్పి తట్టుకోలేకపోయారు. రాత్రి ఆ బాధ ఇంకా ఎక్కువైంది. అంతే సిబ్బంది వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి గమనించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్‌ చేశారు. ఆ తర్వాత విమానంలో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్య బృందం చికిత్సలు చేసినా.. పరిస్థితి అంతంత మాత్రమే. ఈ వార్త దేశ వ్యాప్తంగా పాకింది. మా హీరోను రక్షించని అభిమానులు ప్రార్థించారు. ఆ తర్వాత మూడు నెలలకు ఆయన మళ్లీ కోలుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పుడు 76 ఏళ్ల వయసులోనూ బిగ్‌బి హుషారుగా అనేక రకాల పాత్రల్లో సందడి చేస్తున్నారు.


అమితాబ్‌ అనేది ఓ పేరు కాదు... బ్రాండ్‌. ఇప్పటికీ అగ్రకథానాయకులకు దీటుగా అమితాబ్‌ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తుండటమే అందుకు నిదర్శనం. ఒకానొక దశలో ఆయన వేరెవరికీ సాధ్యంకాని రీతిలో 50కి పైగా ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నారు. ప్రస్తుతం 20కి పైగా సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అందులో పలు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలతో పాటు స్వచ్ఛ భారత్‌, జీఎస్‌టీ కమర్షియల్స్‌, గుజరాత్‌ పర్యాటకం లాంటి ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి అమితాబ్‌ బ్రాండ్‌ విలువ సుమారు రూ.160 కోట్లు అని అంచనా.


పడిలేచిన కెరటం

అమితాబ్‌ స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ ఏబీసీఎల్‌ ఆయనకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. దాని ద్వారా దాదాపు రూ.90 కోట్లు కోల్పోయారు అమితాబ్‌. మరోవైపు అదే సమయంలో ఆయన నటించిన నాలుగు చిత్రాలు ఘోర పరాజయం చెందాయి. ఇక అమితాబ్‌ చరిత్ర ముగిసినట్లే అన్న విమర్శలు బలంగా వినిపించాయి. అయితే ఆయన మాత్రం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంతో పడిలేచిన కెరటంలా మళ్లీ దూసుకొచ్చారు.


ఏడు పదుల వయసులోనూ ఎంతో బిజీ

అమితాబ్‌ ఏడు పదుల వయసులోనూ ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. 2019 మాత్రమే కాదు, వచ్చే ఏడాది ఆయన కాల్‌షీట్‌లు ఖాళీ లేవు అంటే అతిశయోక్తికాదు. చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా:నరసింహారెడ్డి’లో ఆయన గోసాయి వెంకన్న పాత్రలో కనిపించారు. మరోవైపు తమిళంలో ఎస్‌ జే సూర్యతో ‘ఉయర్న్‌ద మనిదన్‌’, సహా ‘బటర్ ఫ్లై’, ‘ఏబీ ఆని సీడీ’(మరాఠీ), ‘బ్రహ్మాస్త్ర’, ‘చెహ్రి’, ‘గులాబో సితాబో’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.