close

తాజా వార్తలు

వనవాసం చూతమురారండి..

రామాయణం రసరమ్యం.. ఆ కావ్యంలో ప్రస్తావించిన ప్రాంతాలు ఇప్పుడు ఆధ్యాత్మిక గమ్యాలు! అందరి బంధువైన రామయ్యకు వనవాస సమయంలో ఆతిథ్యం ఇచ్చిన నెలవులన్నీ.. సెలవులొస్తే అతిథులతో నిండిపోతాయి. ఉత్తరాదిన చిత్రకూటం నుంచి దక్షిణాది చివరనున్న రామేశ్వరం వరకు రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.  ఎలాగూ వేసవి సెలవులు వస్తున్నాయి కదా! పైగా రామ నవరాత్రులు మొదలవుతున్నాయి.. నచ్చిన చోటుకు వెళ్లి.. మనసైనన్ని రోజులు ఉండి రండి.

 

చెలిమికి మజిలీ: హంపి, కర్ణాటక

కర్ణాటకలోని హంపి విజయనగర సామ్రాజ్య రాజధాని. కృష్ణరాయల కాలంలో అష్టదిగ్గజాల కావ్యమధురిమలు విని తరించిన హంపి.. యుగాల కిందట ఆదికావ్యమైన రామాయణంలో చోటు దక్కించుకుంది. శతాబ్దాల కిందటి రాయల రాజధాని.. యుగాల నాడు వానర రాజ్యమైన కిష్కిందేనని చెబుతారు. సీతమ్మ ఎడబాటుతో దిక్కుతోచని రాముడికి సాంత్వన కలిగించిన ప్రాంతమిది. వానరయోధుడు హనుమ జన్మించింది, ఆంజనేయుడు శ్రీరాముడిని తొలిసారి కలిసింది, రామ, సుగ్రీవుల చెలిమి కుదిరింది, రాముడు.. వాలిని సంహరించింది ఇక్కడే! ఇలా ఎన్నో పౌరాణిక ప్రాంతాలు హంపి పరిసరాల్లో చూడొచ్చు. తుంగభద్ర పరుగులు ఒకవైపు.. నిండైన పచ్చదనం మరోవైపు.. పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. రామాయణ యానం చేస్తూనే రాయల రాజధానిలోని వింతలు విశేషాలు ఆస్వాదించవచ్చు.

చేరుకునేదిలా: హంపీ నగరికి 13 కిలోమీటర్ల దూరంలోనే హోస్పేట్‌ రైల్వే జంక్షన్‌ ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, అనంతపురం, కర్నూలు నుంచి హోస్పేట్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి హంపీకి వెళ్లడానికి బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు దొరుకుతాయి.

చూడాల్సినవి
*సుగ్రీవగుహ
* మాల్యవంత, హేమకూట,   రుష్యమూక పర్వతాలు
*అనెగొంది (చింతామణి ఆలయం.. ఆంజనేయుడికి రాముడు ముద్రికను ఇచ్చిన ప్రదేశం)
* రాయల నగరిలోని నిర్మాణాలు

 

రామధామం: చిత్రకూట్‌, మధ్యప్రదేశ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సరిహద్దులు పంచుకున్న చిత్రకూట్‌.. యుగాల కిందట సీతారాముల జీవితాన్ని పంచుకుంది. వనవాసాన్ని మధుమాసంగా మార్చిన ప్రకృతి సౌందర్యం చిత్రకూట్‌ సొంతం. వింద్య పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతంలో అత్రి, మార్కండేయ మహర్షి వంటి ఎందరో తపోధనులు ఆశ్రమ జీవితం గడిపేవారు. ఇక్కడున్నంత కాలం కష్టమేంటో తెలియకుండా సాగిపోయింది సీతారాముల జీవితం. ఆనాటి పౌరాణిక ఘట్టాలను చిత్రకూట పర్వతంపై నేటికీ చూడొచ్చు. రామయ్య జలకాలాడిన రామ్‌ఘాట్‌, సీతమ్మ స్నానమాడిన సీతాకుండ్‌, సౌమిత్రి కాపలా ఉన్న లక్ష్మణ గిరి, భరతుడు శ్రీరాముణ్ని కలిసిన నెలవు ఇవన్నీ రామాయణ కావ్యాన్ని దృశ్యరూపంలో చూపుతాయి. చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణ చేస్తే.. కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ పుణ్యధామంలోనే తులసీదాసుకు రామసాక్షాత్కారం లభించిందని చెబుతారు. నేటికీ ఎందరో భక్తులు చిత్రకూట్‌ వచ్చి.. రామనామ సాధనలో కాలం గడుపుతుంటారు.

చేరుకునేదిలా: సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి సత్నాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి చిత్రకూట్‌కు (78 కి.మీ.) బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.

చూడాల్సినవి
*రామ్‌ఘాట్‌
* సీతాకుండ్‌
* సీతా రసోయి (వంటగది)
* భరత్‌ మిలాప్‌ ఆలయం
* అత్రి మహర్షి ఆశ్రమం
* సతి అనసూయ మందిరం
* హనుమాన్‌ ధారా
* గుప్తగోదావరి

 

మలుపు తిప్పిన చోటు: పంచవటి, మహారాష్ట్ర

రామాయణ కావ్యాన్ని మలుపుతిప్పిన ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్‌. లక్ష్మణుడు.. శూర్పణఖ ముక్కు, చెవులు కోసిందీ ఇక్కడే. అందుకే దీనికి ఈ పేరు స్థిరపడింది. చిత్రకూట్‌ నుంచి దండకారణ్యానికి వచ్చిన సీతారామలక్ష్మణులు నాసిక్‌ సమీపంలోని పంచవటిలో నివాసమున్నారని చెబుతారు. ప్రశాంత గోదావరి ఒడ్డున కొన్నాళ్లు వీరి జీవితం రసరమ్యంగా సాగింది. శూర్పణఖ రాకతో సీతారాముల జీవితాల్లో ఊహించని మార్పు వచ్చింది. రావణుడు రావడం.. సీతను అపహరించడం..
ఘట్టాలన్నిటికీ.. పంచవటి సజీవ సాక్షి. ఈ క్షేత్ర దర్శనానికి రోజూ వందల మంది యాత్రికులు తరలి వస్తారు. గోదావరి నదిపై ఉన్న రామలక్ష్మణ కుండాల్లో స్నానమాచరిస్తారు. రామనామం జపిస్తూ చుట్టూ ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. అలాగే గ్రేప్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా పేరున్న నాసిక్‌లో ద్రాక్ష తోటలు చూడాల్సిందే!

చేరుకునేదిలా: సికింద్రాబాద్‌ నుంచి నాసిక్‌కు రైలు అందుబాటులో ఉంది. విజయవాడ, విశాఖపట్నం నుంచి షిర్డీకి రైళ్లున్నాయి. అక్కడి నుంచి సులభంగా నాసిక్‌ (87 కి.మీ.) చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి నాసిక్‌కు విమాన సర్వీసులూ ఉన్నాయి.

చూడాల్సినవి
* సీతాగుఫా
* లక్ష్మణరేఖ ఆలయం
* తపోవన్‌
* కాలారామ్‌ ఆలయం
* ముక్తిధామ్‌

 

మార్పుల్లేని మనో‘హర క్షేత్రం’: రామేశ్వరం, తమిళనాడు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన రామేశ్వరం చుట్టూ సముద్రంతో అద్భుతంగా ఉంటుంది. పంబన్‌ ద్వీపంలో ఉన్న రామేశ్వరానికి ‘అన్‌ఛేంజింగ్‌ సిటీ’గా పేరుంది. కాలానుగుణంగా ఈ నగరం పెద్దగా మారలేదు. ఇక్కడుండే మనుషులు మారలేదు. రాముడు పాదస్పర్శ పొందిన నేలను నాగలితో దున్నకూడదన్న నియమాన్ని నేటికీ పాటిస్తూ వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల మనోభావాలు మారలేదు. గుడిలో ఉన్న రామలింగేశ్వరుడిని ఎంత భక్తితో అర్చిస్తారో.. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన రామచంద్రుడినీ అంతే అరాధిస్తారు. శివనామంతో పాటు కేశవ నామమూ స్మరిస్తారు. ఏం మహిమో కానీ,  అంతటా కవ్వించే కడలి.. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సేతువు నిర్మించే సమయంలో పోటెత్తిన సముద్రుడు.. ఆపై, రాముడి హెచ్చరికతో చల్లబడ్డాడు. ఆనాడు తగ్గిన అలల ఉద్ధృతిలో నేటికీ మార్పులేదు. సముద్రంలో స్నానం చేసి.. రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు భక్తులు. రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుంచి సముద్రంపై సేతువు నిర్మించి రామదండు లంకకు వెళ్లిందని చెబుతారు. రావణ సంహారం తర్వాత మళ్లీ రామేశ్వరానికి వచ్చిన రాముడు.. బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కోరి సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం.

చేరుకునేదిలా: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి రామేశ్వరానికి రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. ముందుగా చెన్నై వెళ్తే అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో రామేశ్వరం చేరుకోవచ్చు.

చూడాల్సినవి
*రామలింగేశ్వర ఆలయం
* గంధమాదన పర్వతం (హనుమ లంకకు లంఘించిన పర్వతం)
* ఆలయ పరిసరాల్లోని బావులు (పవిత్ర నదీ జలాలు ఈ బావుల్లో ఉంటాయని విశ్వసిస్తారు)
* పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌ (1914లో నిర్మించిన వంతెన.. సముద్రంలో నౌకలు వచ్చినప్పుడు రెండుగా విడిపోతుంది)
* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నివాసం

 

ఒకే పర్యటన.. మూడు ప్రాంతాలు

మధ్యప్రదేశ్‌ పర్యాటక సంస్థ హైదరాబాద్‌ నుంచి చిత్రకూట్‌ ప్యాకేజీ నిర్వహిస్తోంది. చిత్రకూట్‌లో రెండు రోజుల విహారంతో పాటు.. చారిత్రక నగరాలు ఓర్చా, ఖజురహో కూడా చూపిస్తారు. ఏసీ గదుల్లో బస ఉంటుంది.
ఎన్ని రోజలు?: 4 రాత్రులు/ 5 పగళ్లు
ధర: రూ.14,750 (ఒక్కరికి-కనీసం నలుగురు ఉండాలి)
మరిన్ని వివరాలకు 98660 69000 నెంబరును సంప్రదించండి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.