close

తాజా వార్తలు

ఇక్కడ ఆరోగ్యం దొరుకును

ఆనందయానం

ప్రయాణంలో.. ఆహారపు అలవాట్లు గతి తప్పుతాయి కంటికి కునుకు దూరమవుతుంది శరీరానికి అలసట దగ్గరవుతుంది ఈ విహారం అలాకాదు మనిషికి క్రమశిక్షణ నేర్పుతుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది

న్ని విహారాలు ఒకలా ఉండవు. కొన్ని పర్యాటక కేంద్రాలు కళ్లకు ఇంపు గొలిపితే.. ఇంకొన్ని మనసుకు ఉత్తేజాన్నిస్తాయి. ఎక్కడికి వెళ్లినా.. ఎంత ఆనందించినా.. శరీరానికి బడలిక తప్పదు. అలాకాకుండా చేసే పర్యాటక కేంద్రాలూ ఉన్నాయి. పేరుకు ఇవి ఆరోగ్య కేంద్రాలే అయినా.. సిసలైన ప్రకృతికి చిరునామాలు. అసలైన ఆనందానికి సోపానాలు. యోగ, వ్యాయామం, ధ్యానం ఇలా రకరకాల మార్గాలు.. మార్పు కోరి వచ్చిన వారిని నేర్పుగా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం ప్రకృతి వైద్యశాలలు, ఆరోగ్య కేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నప్పటికీ.. అచ్చమైన ప్రకృతి ఒడిలో, స్వచ్ఛమైన వాతావరణంలో కొలువైనవి కొన్నే ఉంటాయి. కేరళ పల్లెల్లోని ఆయుర్వేద నిలయాలు, రుషీకేశ్‌ గంగమ్మ చెంతనున్న యోగాభ్యాస కేంద్రాలు మనసును తేలిక పరుస్తూ.. మనిషికి ఉత్సాహాన్నిస్తూ.. ఆరోగ్యమస్తు అంటున్నాయి.

ప్రకృతి నిలయం
పతంజలి ఆరోగ్య ధామం, కర్ణాటక

రేబియా సముద్రం మీది నుంచి వచ్చే వెచ్చని గాలులు.. కడలి తిరుగు జలాల సోయగాలు.. ఎటుచూసినా అంతెత్తు కొబ్బరి చెట్లు.. కుందాపురను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉంటుందీ కుందాపుర. ఇక్కడే ఉంది పతంజలి ఆరోగ్య ధామం. విశాలమైన ధామంలో రెండు రోజులు ఉండగలిగితే ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. సానుకూల దృక్పథం అలవడుతుంది. ఈ ధామంలో ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్య సేవలు లభిస్తాయి. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతీ నెల 2వ, 4వ శనివారం ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే శిబిరం ఆదివారం సాయంత్రం 4 గంటలతో ముగుస్తుంది. రెండు రోజుల శిక్షణలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో ఔత్సాహికులు కుందాపురకు వస్తుంటారు. సాధారణ వైద్య సేవలూ ఇక్కడ లభిస్తాయి. మరిన్ని వివరాలకు www.arogyadhama.org వెబ్‌సైట్‌ని సందర్శించండి.

చేరుకునేదిలా: కుందాపుర.. ప్రముఖ దివ్యక్షేత్రం ఉడుపి నుంచి 35 కి.మీ. దూరంలో ఉంటుంది. మంగళూరు  నుంచి అయితే 110 కి.మీ. హైదరాబాద్‌ నుంచి ఉడుపి, మంగళూరుకు ట్రావెల్‌ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీ, బస్సులో కుందాపుర చేరుకోవచ్చు.

సాధన సదనం
ఆనందక్రియ యోగాశ్రమం, మహారాష్ట్ర

త్తిడిని చిత్తు చేయడానికి ధ్యానానికి మించిన మందు లేదని పెద్దల మాట. ఆ ధ్యానం చేయడానికి అనువైన చోటు దొరకడమే కష్టం. దొరికినా.. కుదురుగా ధ్యానించలేరు. ఆనందక్రియ యోగాశ్రమానికి వెళ్తే సాధన సజావుగా సాగిపోతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రశాంత ఆశ్రమం, ఆధ్యాత్మిక వారసత్వం పుణికిపుచ్చుకున్న గురువుల ఆధ్వర్యంలో అభ్యాసం.. మానసిక ఉల్లాసాన్నిస్తుంది. పుణెకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ యోగాశ్రమం. యోగ, ధ్యానం ఎలా చేయాలో నేర్పిస్తారిక్కడ. పరమహంస యోగానంద ప్రశిష్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే ఔత్సాహికులు నెలల తరబడి ఆశ్రమంలో ఉంటూ సాధన కొనసాగిస్తుంటారు. కుటీరాల్లో బస, ప్రత్యేకమైన ఆహార నియమావళి జీవితాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని వివరాలకు anandameditationretreat.in వెబ్‌సైట్‌ చూడండి.

చేరుకునేదిలా: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి పుణెకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆనందక్రియ యోగాశ్రమానికి చేరుకోవచ్చు.

తనువుకు.. మనసుకు..
నేచర్‌ క్యూర్‌ విలేజ్‌, గుజరాత్‌

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నింబా నేచర్‌ క్యూర్‌ విలేజ్‌. సంప్రదాయ వైద్య విధానాలకు చిరునామా ఇది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగ, ధ్యానం, ఫిజియోథెరపీ ఇతర సహజ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. నిండుగా పచ్చదనమున్న ప్రకృతి గ్రామానికి ఎందరో రోగులు వస్తుంటారు. మరెందరో తమ జీవన విధానంలో మార్పు కోసం ఇక్కడికి  చేరుకుంటారు. యోగాభ్యాసంతో శారీరక సమస్యలను దూరం చేసుకుంటారు. ధ్యానంతో మానసిక ఇబ్బందులను జయిస్తారు. నాలుగు రోజులు ఇక్కడ ప్రశాంతంగా గడిపి నూతన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. వివిధ అభ్యాసాలు, వైద్యం కోసం ప్రత్యేక ప్యాకేజీలున్నాయి. www.nimba.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

చేరుకునేదిలా: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి అహ్మదాబాద్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో నింబా ప్రకృతి గ్రామానికి చేరుకోవచ్చు.

కళల లోకం
ఆర్ట్‌ విలేజ్‌, మహారాష్ట్ర

ర్షాకాలం హర్షాతిరేకాలను ఆస్వాదించడానికి మహారాష్ట్రలోని లోనావాలా, ఖండాలాను మించిన ప్రదేశాలు ఉండవు. అక్కడి నుంచి ఇంకో 30 కి.మీ. ప్రయాణిస్తే ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆర్ట్‌ విలేజ్‌ వస్తుంది. కర్జత్‌ సమీపంలో ఉంటుందీ గ్రామం. ఇందులోకి అడుగుపెట్టగానే కళల లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. అరుదైన కళలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఆటలు పాటలు మనసును ఉత్తేజపరుస్తాయి. వ్యవసాయ క్షేత్రంలో గంటల తరబడి గడిపేయొచ్చు. అరక పట్టి మెరక దున్నొచ్చు, నారు పోసి నీరు పెట్టొచ్చు. కుండలు తయారు చేసి మురిసిపోవచ్చు. ఒత్తిళ్ల జీవితం నుంచి ఉపశమనం పొందొచ్చు. అందమైన కుటీరాల్లో బస చేసి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించి.. గంపెడు ఆనందంతో, కొండంత ఆరోగ్యంతో తిరుగు ప్రయాణం అవ్వొచ్చు. ఆర్ట్‌ విలేజ్‌లో ప్రవేశం కోసం artvillage.co వెబ్‌సైట్‌ని సందర్శించండి.

చేరుకునేదిలా: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి కర్జత్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి ఆటోల్లో ఆర్ట్‌ విలేజ్‌ (9 కి.మీ.) చేరుకోవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.